మమతకు 600 కిలోల మామిడి పండ్లు గిఫ్ట్.. ఇచ్చిందెవరో తెలుసా?

మమతకు 600 కిలోల మామిడి పండ్లు గిఫ్ట్.. ఇచ్చిందెవరో తెలుసా?

పశ్చిమ బెంగాల్​ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తన చిరకాల మిత్రురాలి నుంచి అరుదైన గిఫ్ట్​ పొందారు. ఏంటనుకుంటున్నారా.. మామిడి పండ్లు. ఇచ్చింది ఎవరో కాదు బంగ్లాదేశ్​ ప్రధాని. ఆ వివరాలేంటో చూడాలంటే ఈ వార్త చదవాల్సిందే. 
బంగ్లాదేశ్, పశ్చిమబెంగాల్​ దౌత్య పరమైన సంబంధాల్లో భాగంగా ఆ దేశ ప్రధాని షేక్​హసీనా సుమారు 600 కిలోల మామిడి పండ్లను బెంగాల్​ సీఎం మమతా బెనర్జీకి గిఫ్ట్​గా పంపారు. ఈ పండ్లలో హిమసాగర్​, లంగ్రా రకాలు ఉన్నాయి. ఏటా వీటిని భారత్​లోని ప్రజాప్రతినిధులకు పంపడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా ఈ ఏడాది కూడా మామిడి పంపినట్లు డిప్యూటీ హై కమిషన్​అధికారి తెలిపారు. మమతతో పాటు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన సీఎంలకూ హసీనా పండ్లు పంపించారు. గత ఏడాది అమ్రాపలి అనే రకం పండ్లను  ప్రధాని మోడీ, మాజీ రాష్ట్రపతి రామ్​నాథ్​కోవింద్ కి గిఫ్ట్​గా ఇచ్చారు. 

ఇండియా – -బంగ్లాదేశ్ ఫ్రెండ్‌షిప్ పైప్‌లైన్

భారత్ బంగ్లాదేశ్ మధ్య దౌత్య సంబంధాలు ఈ మధ్య కాలంలో మరింత బలపడ్డాయి.  ఇరు దేశాల మధ్య డీజిల్ పైప్‌లైన్‌ను మార్చిలో ప్రధానులు ప్రారంభించారు. మొదటి క్రాస్-బోర్డర్ ఎనర్జీ పైప్‌లైన్‌ను రూ. 377 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించారు. ఇందులో బంగ్లాదేశ్ లోని భాగాన్ని సుమారు రూ. 285 కోట్లతో నిర్మించారు. గ్రాంట్ సహాయం కింద భారత ప్రభుత్వం ఖర్చు భరించింది. ఈ డీజిల్ పైప్‌లైన్ సంవత్సరానికి ఒక మిలియన్ మెట్రిక్ టన్నుల హై-స్పీడ్ డీజిల్‌ను రవాణా చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది మొదట ఉత్తర బంగ్లాదేశ్‌లోని ఏడు జిల్లాలకు హైస్పీడ్ డీజిల్‌ను సరఫరా చేస్తుంది. మొత్తంగా ఇరు దేశాల మధ్య ఇంధన భద్రతలో సహకారాన్ని పెంచడం, దౌత్యసంబంధాలు మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వాలు పని చేస్తున్నాయి.