సోమశిలలో ఆదిమానవుని రాతి గొడ్డలి

సోమశిలలో ఆదిమానవుని రాతి గొడ్డలి
కృష్ణానదీ తీర గ్రామం సోమశిల గ్రామం వద్ద కొత్త రాతియుగం ఆనవాళ్లు బయటపడ్డాయి. నాగర్​కర్నూల్​ జిల్లా సోమశిలలో ఉన్న సోమనాథ స్వామి ఆలయానికి తూర్పున ఉన్న పంట చేలలో ఆది మానవులు వాడిన రాతి గొడ్డలి బయటపడింది. ఆర్కియాలజీ డిపార్ట్​మెంట్​లో స్థపతిగా పనిచేసి రిటైర్​ అయిన ఈమని శివనాగిరెడ్డి ఈ రాతి గొడ్డలిని గుర్తించారు. ఈ రాతి గొడ్డలి నవీన శిలాయుగానికి (క్రీ.పూ. 4000 నుంచి 2000 మధ్య కాలం) చెందినదని ఆయన చెప్పారు. ఈ గొడ్డలి అంచులకు పాటిమట్టి, బూడిద అంటుకొని ఉన్నాయని, ఆ కాలానికి పశువులను మచ్చిక చేసుకుని వ్యవసాయం చేస్తున్నారు. స్థిరనివాసం ఏర్పరుచుకొన్నారు. పనిముట్ల తయారీలో స్కిల్​ సాధించారు. గొడ్డలి అంచులు రాతితో సానపట్టడం వల్ల పదునుగా ఉన్నాయని ఆయన విశ్లేషించారు. సోమశిలకు సమీపంలోనే గార్గేయపురం గ్రామం వద్ద రాతికొండల్లో ఆదిమానవుడు నివసించిన ఆనవాళ్లు.. ప్రపంచంలోనే తొలిసారిగా మానవులు సంకేతాలను భాషగా మలిచిని లిపి గుర్తులు, పెంపుడు జంతువులను మచ్చిక చేసుకుని వాటిని ఆహారంగా ఉపయోగించుకున్న గుర్తులు వెలుగులోకి వచ్చాయి. రాతి కొండపై వేసిన గుర్తులు వేల సంవత్సరాలైనా ఇప్పటికీ చెక్కుచెదరకపోవడం పురావస్తు శాఖనే కాదు… మొత్తం చరిత్ర కారులనే ఆశ్చర్యానికి గురిచేసింది. వీటికి సమీపంలోనే సోమశిల వద్ద ఇప్పుడు ఆదిమానవుడు ఉపయోగించిన రాతిగొడ్డలి బయటపడింది.