తెలంగాణ రాష్ట్రంలో అడవులు, కొండ ప్రాంతాలు, మైదాన ప్రాంతాల్లో లక్షల మంది గిరిజనులు నివసిస్తున్నారు. వీరికి ప్రత్యేక భాష, జీవన విధానం, వస్త్రధారణ, ఆహారపు అలవాట్లు, సంప్రదాయాలు, ఆచారాలు, సంస్కృతి ఉన్నాయి. వీటిలో అనేక తెగలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుండగా, చెంచులు ఆహార సేకరణతో జీవనం సాగిస్తున్నారు. పూర్వం గిరిజనులు తమకు అవసరమైన ఆహారాన్ని తామే పండించుకుంటూ మైదాన ప్రాంతాల్లో ఎక్కువ సంబంధాలు కలిగి ఉండేవారు కాదు.
దూరంగా ఉన్న సంతలకు వెళ్లి వస్తు మార్పిడి పద్ధతిలో తమకు అవసరమైన వస్తువులు తెచ్చుకునేవారు. అయితే, ప్రస్తుతం గిరిజనేతరులు గిరిజన ప్రాంతాల్లోకి వలసలు రావడంతో వస్తుమార్పిడి స్థానంలో ధనం మాధ్యమంగా మారింది. గిరిజనుల్లో అత్యంత వెనుకబడిన వారిని ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్‌గా పిలుస్తారు. వీరిని కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తున్నది. తెలంగాణలో నాలుగు ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి. అవి.. చెంచులు, కొండరెడ్లు, తోటిలు, కోలామ్లు.
చెంచులు
తెలంగాణలో గుర్తించిన మొదటి ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్ చెంచులు. వీరు నాగర్‌కర్నూల్ – అమ్రాబాద్, పూర్వపు నల్లగొండ జిల్లాలో ఎక్కువగా నివసిస్తున్నారు. దేశంలో అతి ప్రాచీన ఆదివాసీ తెగల్లో చెంచు ఒకటి. మానవజాతి ఆవిర్భావం నాటి ఆనవాళ్లు చెంచు తెగల్లో స్పష్టంగా కనిపిస్తాయి. వేట ద్వారా ఆహారాన్ని సమకూర్చుకుంటారు. చెంచులు జరుపుకునే ప్రధాన జాతరలు సలేశ్వరం జాతర, లోద్ది మల్లయ్య జాతర, మల్లెల తీర్థం, ఇష్ట కామేశ్వరి, మన్ననూరు జాతర. సంక్రాంతి పండుగను చింతకాయల పండుగగా జరుపుకుంటారు. తేనె పరలను లోతయిన గుంతల్లో నిల్వ చేసి దానిని మల్లమ్మగా పూజిస్తారు.
చెంచులు ప్రధాన పండుగ శివరాత్రి. చెంచు సమాజాల్లో భార్యభర్తలు ఇరువురికి అన్ని కార్యకలాపాల్లోనూ సమాన పాత్ర ఉంటుంది. స్త్రీ, పురుష వివాహ సంబంధాల్లో వివాదం వచ్చినప్పుడు స్వేచ్ఛగా విడిపోతారు. చెంచుల్లో అనేక ఉప తెగలు ఉన్నాయి. వీరిలో అడవి చెంచులు, ఊర చెంచులు, బొంతు చెంచులు, యానాది చెంచులు, కృష్ణ చెంచులు, చెంచు దాసరిలు, కోయ చెంచులు తదితర తెగలు ఉన్నాయి. తమ వివాదాలను పెద్దల పంచాయితీలో పరిష్కరించుకుంటారు. వీరు పార్వతి దేవిని తమ ఆడపడుచుగా భావిస్తారు. నల్లమల అడవుల్లో చెంచులకు చెందిన నివాస స్థలాలను పెంటలుగా పేర్కొంటారు.
కొండరెడ్లు
ఈ తెగ ప్రజలు ములుగు, ఖమ్మం, భద్రాచలం, గోదావరి ప్రాంతంలో నివసిస్తున్నారు. కొండ ప్రాంతాల్లో నివసించడం వల్ల వీరిని కొండరెడ్లు, హీల్ రెడ్లు, రాచరెడ్లు, పాండవరెడ్లు అని రకరకాల పేర్లతో పిలుస్తారు. వీరి మాతృభాష తెలుగు. కొండరెడ్లు పితృస్వామ్య వ్యవస్థను అనుసరిస్తున్నారు. వీరు సాధారణంగా పోడు వ్యవసాయం , అటవీ సంపదపై ఆధారపడి జీవిస్తారు. వీరు ఎక్కువగా జొన్న పంటను సాగు చేస్తారు. కొండరెడ్లు నాగలిని ఉపయోగించరు. అడవిని కొట్టి, నేలను చదును చేసి, చిన్నకర్రల సాయంతో గుంతలు తీసి విత్తనాలు చల్లుతారు. ఈ తరహా సంప్రదాయ సేద్యం ఏ తెగలోనూ కనిపించదు.
పోడు వ్యవసాయం ద్వారా పండించుకున్న ధాన్యాలు అయిపోయినప్పుడు అటవీ ఫల సాయంపై ఆధారపడతారు. చేపలు పట్టడం, వేటాడటం కూడా వృత్తిగా కలిగి ఉంటారు. ఆహార సేకరణ, ఫలసాయం అనుభవించడం, వేటాడిన జంతువులను మాంసాహారంగా స్వీకరించడంలో సామూహికత్వాన్ని ప్రదర్శిస్తారు. దేనిని సొంత ఆస్తిగా భావించరు. ఉమ్మడితనం సంప్రదాయాలు, ఆచారాల్లోనూ కనిపిస్తున్నది. కొండరెడ్లు తమ సమూహంలో ఒకరిని పెద్దగా ఆరాధిస్తారు. వీరికి కులపెద్దగా కుదురులు ఉంటారు. అతనికి తెగ ప్రజలపై పూర్తి అధికారం ఉంటుంది. విత్తనాలు చల్లే నాటి నుంచి నేల తల్లి చల్లని దీవెనల కోసం కోడిపుంజులను బలి ఇవ్వడం వంటి విధులన్నీ తెగ పెద్దనే నిర్వహిస్తారు.
సంస్కృతి: ప్రసవించిన తల్లిని ప్రత్యేకమైన గదిలో ఉంచుతారు. బాలింతలను 21 రోజులు వేరే ఇంట్లో ఉంచుతారు. దీనిని కీడుపాక అంటారు. వీరిలో ప్రధానంగా మూడు రకాల వివాహ పద్ధతులు ఉంటాయి. అవి.. 1. బలవంతపు వివాహం 2. మొగనాలు వివాహం (పారిపోయి పెండ్లి చేసుకోవడం), 3. పెద్దలు కుదిర్చిన వివాహం. వీరిలో బహుభార్యత్వం అమలులో ఉన్నది. మృతిచెందిన సోదరుడి భార్యను వివాహం చేసుకుంటారు. కొండరెడ్ల స్మశాన వాటికలు వారి గ్రామానికి తూర్పు వైపు ఉంటాయి.
పండుగలు: కొండరెడ్లు మామిడి కోతను పండుగగా అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ పండుగలో నృత్యం, డోలు, కాళ్ల గజ్జెలు, డప్పులతో ఆడామగా అనే తేడా లేకుండా సమష్టిగా నృత్యం చేస్తారు. వేర్వేరు కుటుంబాల వాళ్లు వేర్వేరు దేవతలను మామిడి కోత సందర్భంగా పూజిస్తారు. కొండరెడ్లు మామిడికోత పండుగ, భూదేవి పండుగ, రాజాల పండుగ, టెంక పండుగలను పూర్వం వేర్వేరుగా ప్రత్యేకమైన రోజుల్లో జరుపుకునేవారు. కానీ, ప్రస్తుతం ఈ పండుగలన్నింటిని వరుసగా మామిడికోత పండుగను సోమవారం, దేవర్ల పండుగను మంగళవారం, భూదేవి పండుగను బుధవారం జరుపుకుంటున్నారు.
వ్యవసాయం: వీరు వేసవికాలంలో కొండ పై ప్రాంతాల్లో దేవతలను ప్రతిష్టించి పూజలు చేసి వ్యవసాయ పనులను ప్రారంభిస్తారు. వీరు ఇప్ప, జాలుగ చెట్లను నరుకరు. వీటిని తల్లితో సమానంగా భావిస్తారు. వీరు పండించే ప్రధాన పంటలు జొన్నలు, సజ్జలు, సామలు, కొర్రలు. కొండవాలు ప్రాంతాల్లో వరి పండిస్తారు.
వేట: కొండరెడ్లు వేటలో సిద్ధహస్తులు. గ్రామంలోని ప్రతి ఒక్కరు కత్తి, విల్లంబులను ధరించి జీవనం సాగిస్తారు. వీరి అస్తిత్వ చిహ్నం విల్లంబులు. వేటకు వెళ్లిన రోజున గ్రామస్తులందరు ఒకచోట చేరి సామూహిక విందు భోజనం చేస్తారు.
ఆహారం: అడవుల నుంచి సేకరించిన దుంపలను రెండు రోజులు నీటిలో నానబెట్టి విషరహితం చేసి తింటారు. మామిడి టెంకలను నీళ్లల్లో నానబెట్టి తర్వాత పిండిగా కొట్టి రొట్టెలుగా, జావగాను ఉపయోగిస్తారు. చెట్ల కల్లును ఆహారంగా కొన్నిసార్లు ఉపయోగిస్తారు.
తోటిలు
తోటి అనే పదం తొండు అనే పదం నుంచి వచ్చింది. తొండు అంటే తవ్వడం లేదా చుట్టూ తిరిగి రావడం. వీరు గ్రామ కమ్యూనిటీ సర్వెంట్స్. వీరు ఉట్నూరు ప్రాంతంలో నివసిస్తున్నారు. వీరి మాతృభాష గొండి. వీరిని భారత ప్రభుత్వం 1983లో ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్‌గా గుర్తించింది. పచ్చబొట్టు వేయడంలో నిష్ణాతులు. వీరు సాధారణంగా ఏక భార్యత్వం/ ఏక భర్తృత్వాన్ని పాటిస్తారు. తోటిల గ్రామస్థాయి రాజకీయ వ్యవస్థను పాంచ్ అని అంటారు. గోండుల సంస్కృతీ సంప్రదాయాలను పాటిస్తారు. వీరిలో అంతర్వివాహాలు జరుగుతాయి. ప్రధాన వృత్తి వేట. వీరి సంగీత వాయిద్యాలు కింగ్రీ లేదా కిక్రీ.
కొలామ్లు
వీరు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఎక్కువగా నివసిస్తున్నారు. వీరి మాండలికం కొలామీ. దేవర వివాహాన్ని ఆచరిస్తారు. వీరు గోండుల సామాజిక వ్యవస్థను కలిగి ఉంటారు. వీరు తమకు తాము కొలవర్లు అని వ్యవహరిస్తారు. వీరు పూజించే దేవత హిడింబి. దేవుడు భీముడు. వీరి ప్రధాన ఆహారం జొన్న. ప్రదర్శించే నృత్యాలు గుస్సాడి, థింసా. వీరు నందియమ్మ అనే గ్రామ దేవతను పూజిస్తారు. వీరు పంట కోత సందర్భంగా జరుపుకొనే పండుగ అఖాడి/ అఖండి. కొలాములను వారి భాషలో కొలావర్లు అని వ్యవహరిస్తారు. కొలాములు పోడు వ్యవసాయం, స్థిర వ్యవసాయం చేస్తారు. వీరిలో సామూహిక జీవనం, ఆరాధన ఎక్కువగా కనిపిస్తుంది. గణదేవత ఆయక మాత ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. ఈ ఆరాధనలకు ప్రత్యేక పూజారి వర్గం వంశపారంపర్యంగా ఒకే కుటుంబం నుంచి ఏర్పాటు చేసుకుంటారు. కోలాములు పూజా సంబంధమైన విధుల్లో గోండులకు సహకరిస్తారు. దేవతలను సంతృప్తిపరచడం, భవిష్యత్తును ఊహించి చెప్పడంలో కొలాములు శ్రేష్టులను విశ్వాసం గోండుల్లో ఉంది.
