ఓటరు స్లిప్పుల ప్రింటింగ్.. నవంబర్​20లోపు పూర్తి చేయాలె

ఓటరు స్లిప్పుల ప్రింటింగ్.. నవంబర్​20లోపు పూర్తి చేయాలె

హైదరాబాద్, వెలుగు :  ఓటరు స్లిప్పుల ప్రింటింగ్​ఈ నెల 20వ తేదీకల్లా పూర్తి చేయాలని రాష్ట్ర పోలింగ్​సిబ్బందిని కేంద్ర ఎన్నికల ప్రత్యేక పరిశీలకులు ఆదేశించారు. పోలింగ్ విధులు నిర్వహిస్తున్న క్షేత్రస్థాయి సిబ్బందికి చివరి నిమిషం వరకు శిక్షణ ఇస్తూనే ఉండాలని వారు సూచించారు. మంగళవారం కేంద్ర ఎన్నికల ప్రత్యేక పరిశీలకులు అజయ్ వి. నాయక్, దీపక్ మిశ్రా హైదరాబాద్​నుంచి పోలింగ్​సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. పోలింగ్ ముగిసిన తరువాత ఓట్ల వివరాలున్న ఈవీఏంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంలలో మరే ఇతర ఈవీఎంలను ఉంచకూడదని వారు సూచించారు. 

పోలింగ్ కేంద్రాల వద్దకు ఎన్నికల విధులతో సంబంధంలేని వ్యక్తులను అనుమతించకూడదని స్పష్టం చేవారు. సమస్య తీవ్రతను బట్టి అధికారులు స్పందించాలన్నారు. అభ్యర్థులకు, రాజకీయ పార్టీలకు కేవలం సాంకేతిక కారణాలతో  అనుమతులను తిరస్కరించవద్దని సీఈఓ వికాస్ రాజ్ సూచించారు. ఎన్నికల నిబంధనలు, నియమాలను గౌరవిస్తూనే.. ప్రచారం కోసం అభ్యర్థులకు  వెసులుబాటు ఉండేలా చూడాల్సి ఉంటుందన్నారు. అఫిడవిట్‌లో దాఖలైన వివరాలను పరిశీలించి వెంటనే అప్‌లోడ్ చేయాలని రిటర్నింగ్ అధికారులకు సూచించారు. 

అసంపూర్తిగా ఉన్న అఫిడవిట్లను గుర్తించిన వెంటనే అభ్యర్థులను అప్రమత్తం చేయాలని ఆయన చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్​లో అడిషనల్​ సీఈఓ లోకేశ్​ కుమార్, జాయింట్ సీఈఓ సర్ఫరాజ్ అహ్మద్, డిప్యూటీ సీఈఓ సత్యవాణి, డీజీపీ అంజనీ కుమార్, రాష్ట్ర  నోడల్ అధికారి మహేశ్ భగవత్, అన్ని జిల్లాల నుంచి కలెక్టర్లు, డీఈఓలు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లు పాల్గొన్నారు.