లిక్కర్ దందాలో ప్రైవేట్ సైన్యం..బెల్టు షాపుల కోసం ప్రత్యేక తనిఖీ బృందాలు

లిక్కర్ దందాలో ప్రైవేట్ సైన్యం..బెల్టు షాపుల కోసం ప్రత్యేక తనిఖీ బృందాలు
  • ఎక్సైజ్ శాఖకు దీటుగా దాడులు
  • మద్యం బాటిళ్లపై సొంత స్టిక్కర్లు
  • వేరే లిక్కర్ అమ్మితే గుంజుకపోతన్రు
  • స్టేట్​లో లక్షకు పైనే బెల్టుషాపులు

జనగామ, వెలుగు: మద్యం ఆదాయంతో బతుకుతున్న రాష్ట్ర సర్కారు బలహీనతను ఆసరా చేసుకున్న లిక్కర్ మాఫియా పెట్రేగిపోతోంది. ఊరూరా పదుల సంఖ్యలో బెల్టు షాపులను ప్రోత్సహిస్తున్న మద్యం వ్యాపారులు.. ఆ బెల్టుషాపుల్లో తమ లిక్కరే అమ్మేలా నిఘా పెడుతున్నారు. ఇందుకోసం  ఎక్సైజ్ శాఖకు దీటుగా ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. లిక్కర్ సేల్స్​టార్గెట్లు చేరుకునే క్రమంలో ఎక్సైజ్​ఆఫీసర్లు బెల్టుషాపుల వైపు కన్నెత్తి చూడడం లేదు. అదే సమయంలో లిక్కర్​మాఫియా మాత్రం ఎక్సైజ్​శాఖకు సమాంతర వ్యవస్థను నడిపిస్తోంది. తమ మద్యం షాపుల్లో అమ్మే బాటిళ్లకు సొంత స్టిక్కర్లు అతికించి, తమ పరిధిలోని బెల్టుషాపుల్లో ఆ లిక్కర్ మాత్రమే అమ్మాలనే రూల్ పెడుతున్నారు. రోజూ తనిఖీలు నిర్వహిస్తూ ఎక్కడైనా వేరే మద్యం అమ్మితే ధ్వంసం చేయడమో, గుంజుకపోవడమో చేస్తున్నారు. 

బెల్టుషాపులపై కంట్రోల్​ కోసం..

రాష్ట్రంలో సుమారు 2,630 వైన్​షాపులు, మరో వెయ్యికి పైగా బార్లలో లిక్కర్​అమ్మకాలు జరుగుతున్నాయి.  అన్ని జిల్లాల్లో కలిపి 12,769 గ్రామ పంచాయతీలు ఉండగా ప్రతీ ఊరిలో నాలుగైదు బెల్టు షాపులు నడుస్తున్నాయి. మొత్తంగా లక్ష వరకు బెల్ట్​షాపులుంటాయని అంచనా. కిరాణా కొట్లు, మిర్చి బండ్లు, పాన్​ డబ్బాలు, టిఫిన్ సెంటర్లలోనూ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. గతంలో బెల్టు షాపుల నిర్వాహకులే పోలీస్​, ఎక్సైజ్ ఆఫీసర్లతో మాట్లాడుకుని దందా చేసేవారు.  ప్రస్తుతం సిండికేట్ ఈ వ్యవహారాలు చూసుకుంటోంది. కొందరు నిర్వాహకులు ఇతర ప్రాంతాల నుంచి తక్కువ రేట్లకు లిక్కర్ తెచ్చి, బెల్టుషాపుల్లో అమ్మడం గుర్తించిన లిక్కర్ మాఫియా రంగంలోకి దిగింది. ప్రతీ మండలంలో సిండికేట్​ అయిన ఒకేషాపు నుంచి మద్యం బాటిళ్లకు స్టిక్కర్ వేసి సప్లై చేయిస్తోంది. ఉదాహరణకు జనగామ జిల్లా రఘునాథ పల్లి మండలంలో 36 గ్రామ పంచాయతీలుండగా, కొన్ని గ్రామాల్లో 10 నుంచి 15 వరకు బెల్టు షాపులు ఉన్నాయి. మరికొన్ని గ్రామాల్లో రెండు, మూడు షాపులున్నాయి.  సరాసరి గ్రామానికి 4 బెల్టు షాపులు వేసుకున్నా 144 షాపులు ఉన్నట్టు తెలుస్తోంది. ఒక్కో షాపులో  రూ. 5 వేల సరుకు అమ్మినా రోజుకు రూ.7 లక్షల మద్యం అమ్మకాలు జరుగుతాయి. లిక్కర్ క్వార్టర్, బీరు బాటిల్​ను ఎమ్మార్పీ మీద రూ.15కు, ఫుల్​బాటిల్​ను రూ.60 ఎక్కువకు బెల్ట్​షాపులకు ఇస్తే.. బెల్టు షాపుల వారు క్వార్టర్​బాటిల్, బీరు బాటిల్​ మీద మరో రూ.20 నుంచి 30 అదనంగా వసూలు చేస్తున్నారు. ఇలా రాష్ట్రంలోని   బెల్టు షాపుల్లో ప్రతిరోజు వందల కోట్ల అక్రమ బిజినెస్​జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బెల్టుషాపులపై కంట్రోల్ కోసం లిక్కర్​మాఫియా ఎక్సైజ్​శాఖకు సమాంతరంగా వ్యవస్థను తెచ్చినట్లు స్పష్టమవుతోంది.

విచ్చలవిడిగా అమ్మకాలు

రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్​అమ్మకాలతో ఈ ఏడాది 40వేల కోట్లు రాబట్టాలని లక్ష్యం పెట్టుకుంది. ఈ టార్గెట్ ను చేరుకునేందుకు ఎక్సైజ్​శాఖ విచ్చలవిడి అమ్మకాలను ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలోనే అక్రమ మద్యం అమ్మకాలను ఆబ్కారోళ్లు గాలికొదిలేస్తున్నారు. ఆఫీసర్లు లిక్కర్​ మాఫియాతో చేతులు కలపడంతో బెల్టు షాపులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. గతంలో ఎక్సైజ్, సివిల్ పోలీసుల తనిఖీలతో బెల్ట్​షాపుల మీద నియంత్రణ ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వైన్​షాపుల యజమానులంతా సిండికేట్​గా మారి.. ప్రతీ మండలంలో ఏదో ఒక వైన్​షాపు నుంచి మాత్రమే బెల్టు షాపులకు మద్యం సరఫరా జరిగేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇందుకు ప్రతిఫలంగా ఆ వైన్​షాపు యజమాని ప్రతీ నెల మిగిలిన వైన్​షాపులకు గుడ్​విల్ ముట్టజెప్పడంతోపాటు ఆఫీసర్లను కూడా మేనేజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తమ పరిధిలోని బెల్టు షాపులకు సొంత రూల్స్ పెడుతున్నారు. వైన్స్​నుంచి బెల్ట్​షాపులకు పంపే లిక్కర్​బాటిళ్లపై ఓ కోడ్​ఉన్న స్టిక్కర్​ అతికిస్తున్నారు. ఆయా బెల్ట్​షాపుల్లో వాళ్ల మద్యాన్ని మాత్రమే అమ్మేలా చూసేందుకు ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మండలాన్ని బట్టి రెండు, మూడు తనిఖీ బృందాలను పెట్టుకుంటున్నారు. ఒక్కో టీమ్​లో ఇద్దరి నుంచి నలుగురు యువకులు ఉంటున్నారు.  వీరు గ్రామాలకు వెళ్లి అక్కడి  బెల్టు షాపులను తనిఖీ చేస్తున్నారు. స్టిక్కర్ లేని బాటిళ్లు ఉంటే బలవంతంగా గుంజుకుని పోతున్నారు.