ఓఆర్ఆర్పై బస్సు పల్టీ: ఒకరు మృతి.. 16 మందికి గాయాలు

ఓఆర్ఆర్పై బస్సు పల్టీ: ఒకరు మృతి.. 16 మందికి గాయాలు

గండిపేట్, వెలుగు: ఔటర్​ రింగ్​ రోడ్డుపై ఓ ప్రైవేట్​ బస్సు పల్టీ కొట్టింది. అందులో ప్రయాణిస్తున్న ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. 16 మంది గాయపడ్డారు. డ్రైవర్​ అతివేగంగా బస్సును నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు.  ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి చెన్నైకి ప్రయాణికులతో  బయలుదేరిన ‘మార్నింగ్​ స్టార్’ అనే ప్రైవేటు బస్సు.. రాత్రి 8.30 గంటలకు నార్సింగి​ ఓఆర్​ఆర్​ వద్ద అదుపుతప్పి డివైడర్​ను ఢీకొని పల్టీ కొట్టింది. 

బస్సులో మొత్తం 18 మంది ఉన్నారు. బస్సు చక్రాల కింద పడి ఓ ప్రయాణికురాలు అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. మరో 16 మంది గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు అక్కడికి చేరుకొని.. క్షతగాత్రులను హాస్పిటల్స్​కు తరలించారు. రెండు క్రేన్ల సాయంతో బస్సును బయటకు తీశారు. డ్రైవర్  మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. డ్రైవర్ ను నార్సింగి పోలీస్ స్టేషన్​కు తరలించారు. సంఘటనా స్థలాన్ని ఏసీపీ రమణ గౌడ్, సీఐ హరికృష్ణ రెడ్డి, ఎస్సై అశోక్ వర్మ పరిశీలించారు.