వాహనాల ఫిట్​నెస్​ టెస్టింగ్​కు ప్రైవేటు సెంటర్లు

వాహనాల ఫిట్​నెస్​ టెస్టింగ్​కు ప్రైవేటు సెంటర్లు
  • అందుబాటులోకి తెచ్చేలా రవాణా శాఖ కసరత్తు
  • బ్రోకర్ల దందా లేకుండా.. ఆన్​లైన్​లోనే సర్టిఫికెట్
  • త్వరలో టెండర్లు.. రెండు సంస్థల ఆసక్తి

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్రంలో వాహనాల ఫిట్​నెస్ టెస్టింగ్​కు ప్రైవేట్‌ సెంటర్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రైవేటు ఫిట్​నెస్ సెంటర్లు పెట్టాలన్న కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర సర్కారు కసరత్తు చేస్తోంది. త్వరలోనే టెండర్లు పిలిచి వాహనాల సర్టిఫికెట్లు ఇచ్చే బాధ్యతను ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే రెండు సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇది అందుబాటులోకి వస్తే ఆర్టీఏలో అవినీతి, బ్రోకర్ల దందాకు చెక్ పడనుంది.

మ్యానువల్​కు ఫుల్‌స్టాఫ్
హెవీ వెహికల్స్‌, కమర్షియల్‌, గూడ్స్‌, స్కూళ్లు.. కాలేజీల బస్సులు తదితర వెహికల్స్​కు ఎప్పటికప్పుడు ఫిట్​నెస్ టెస్ట్ చేయించి సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం బండ్లకు ఫిట్‌నెస్‌ టెస్టులన్నీ మ్యానువల్​గానే చేస్తున్నారు. బండి ఫిట్‌గా ఉంటేనే సర్టిఫికెట్‌ ఇవ్వాలి. కానీ బ్రోకర్లు, అధికారులు కుమ్మక్కై బండి ఎట్లున్నా క్లియరెన్స్‌ ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేట్‌లో ఫిట్‌నెస్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తే ఆటోమేటెడ్‌ మిషన్లు అందుబాటులోకి రానున్నాయి. అంతా ఆన్‌లైన్‌లోనే పక్కాగా జరగనుంది. పూర్తిగా మెషీన్‌ ద్వారానే టెస్ట్‌ చేస్తారు. కంప్యూటరైజ్డ్‌ సర్టిఫికెట్‌ జారీ చేస్తారు. వాహనంలో చిన్న సమస్య ఉన్నా దానికి రిపేర్‌ చేసేదాకా ఫిట్​నెస్ సర్టిఫికెట్‌ రాదు. బ్రోకర్ల ప్రమేయం ఉండదు. ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు. దీంతో అవినీతి, అక్రమాలకు చెక్‌ పడే అవకాశం ఉంటుంది. 

పదేండ్ల కిందే సెంటర్ శాంక్షన్
యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ దగ్గరి దండుమల్కాపూర్‌ వద్ద ఫిట్‌నెస్‌ టెస్టింగ్‌ సెంటర్‌ 2011లో శాంక్షన్‌ అయ్యింది. ఈ ప్రాజెక్ట్​ను 2015లో 10 ఎకరాల స్థలంలో ప్రారంభించారు. 2018 మే నాటికి పూర్తి కావాల్సి ఉన్నా ఇప్పటికీ అడుగు ముందుకు పడటంలేదు. 2019లోనే సెంటర్‌కు కావాల్సిన ఎక్విప్‌మెంట్లు కూడా అందాయి. అయితే జాగ వివాదంలో ఉందని రవాణా శాఖ ఉన్నతాధికారులు చేతులు దులుపుకొంటున్నారు.