క్లాసులు లేకున్నా..ఫీజు కట్టాల్సిందే

క్లాసులు లేకున్నా..ఫీజు కట్టాల్సిందే
  • గతేడాదితో పాటు కొత్త సంవత్సరం ఫీజు కూడా
  • స్టూడెంట్స్ కు ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల హుకుం
  • లాక్ డౌన్ టైమ్ లో ఫీజులు అడగడంపై పేరెంట్స్ఆందోళన
  • పట్టించుకోని యూనివర్సిటీలు

అకడమిక్ ఇయర్ చివరలో క్లాసులే జరగలేదు. కొత్త అకడమిక్ ఇయర్ షురూ కాలేదు. అయినా ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు మాత్రం గతేడాది ఫీజు బకాయిలతోపాటు కొత్త విద్యా సంవత్సరం ఫీజులు కూడా కట్టాలని స్టూడెంట్స్ కు హుకుం జారీ చేస్తున్నయి. దీంతో కరోనా టైమ్ లో ఫీజులెలా కట్టాలని పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు.

స్టూడెంట్స్ ను వేధిస్తున్నాయి

రాష్ట్రంలో మొత్తం 172 ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయి. మార్చి నెలాఖరులో లాక్డౌన్ కారణంగాఅన్నీమూతపడ్డాయి. సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా వాయిదా పడ్డాయి. ఈ నెల 20 నుంచి ఫైనలియర్ స్టూడెంట్స్ కు పరీక్షలు నిర్వహిస్తామని చెప్పిన జేఎన్టీయూ తాజాగా సర్కారు నిర్ణయం వచ్చే వరకు పరీక్షలు నిర్వహించబోమని ప్రకటించింది. పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో ఇంకా క్లారిటీ లేదు. మరోపక్క కొత్త అకడమిక్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే దానిపైనా స్పష్టత లేదు. అయినా ఇంజినీరింగ్ కాలేజీల మేనేజ్మెంట్లు మాత్రం ఫీజుల కోసం స్టూడెంట్స్ ను వేధిస్తున్నాయి. 2019–20 విద్యాసంవత్సరం బకాయిలన్నీ కట్టాల్సిందేననీ, 2020–21 విద్యాసంవత్సరం డబ్బులూ చెల్లిం చాలని మెసేజ్లు, ఫోన్లు చేస్తున్నాయి. స్టూడెంట్స్ నుంచి  రెస్పాన్స్ రాకుంటే … వారి పేరెంట్స్ కు కాల్ చేసి మాట్లాడుతున్నారు. ఇంత జరుగుతున్నా.. జేఎన్టీయూ, ఓయూ అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం.

అకౌంట్ నంబర్లు ఇస్తున్నరు..

క్లాసులు ప్రారంభం కాకున్నా, ఫీజులు అడగటంపై పేరెంట్స్ మండిపడుతున్నారు. ఫీజుల కోసం వేధించవద్దని ప్రభుత్వం, వర్సిటీల అధికారులు చెబుతున్నా.. మేనేజ్మెంట్లు మాత్రం వినడంలేదు. ఫీజులను కాలేజీకి వచ్చికట్టడం ఇబ్బంది అయితే, పేటీఎం ద్వారా చెల్లించాలని పేరెంట్స్ కు సూచిస్తున్నాయి. అదీ సాధ్యం కాకపోతే కాలేజీ బ్యాంక్ అకౌంట్ కు ఆన్ లైన్ లో ట్రాన్స్ ఫర్ చేయాలని చెబుతున్నాయి. అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్ ను స్టూడెంట్స్ కు, పేరెంట్స్ కు పంపిస్తున్నరు. నెలాఖరు లోపే కట్టాలని గడువు కూడా ఇచ్చారు. లాక్డౌన్ టైమ్ లో ఫీజులు చెల్లించడం కష్టమని చెప్తున్నా, మేనేజ్మెంట్లు వినడం లేదని పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. కాలేజీ మేనేజ్మెంట్ల వేధింపుల నుంచి కాపాడాలని కోరుతున్నారు.