ఖమ్మంలో ప్రైవేట్ ఫైనాన్స్​ సంస్థల ఇష్టారాజ్యం!

ఖమ్మంలో ప్రైవేట్ ఫైనాన్స్​ సంస్థల ఇష్టారాజ్యం!
  •     ఆయా శాఖలను మామూళ్లతో మేనేజ్​ చేస్తున్నట్టు ఆరోపణలు
  •     చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు!
  •     ఇటీవల పెరుగుతున్న ఆగడాలు

 ఖమ్మం/ ఖమ్మం టౌన్, వెలుగు :  ఖమ్మంలో  ప్రైవేట్ ఫైనాన్స్​ సంస్థల ఆగడాలకు అడ్డూ, అదుపూ లేకుండా పోయింది. ఏ డిపార్ట్ మెంట్ నుంచి అనుమతులు లేకుండా, కేవలం ట్రేడ్ లైసెన్స్​ తోనే అన్ని శాఖలను మేనేజ్​ చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. లోన్​ రికవరీ పేరుతో కస్టమర్లను వేధించి, ముక్కు పిండి, రాళ్లతోకొట్టి మరీ చక్ర వడ్డీ వసూలు చేస్తున్నారు. రెండురోజుల కింద ఖమ్మంలో బైక్​ కిస్తీ కట్టనందుకు యువకుడిని లోన్​ రికవరీ ఏజెంట్లు వెంబడించి రాళ్లతో కొట్టడంతో  యువకుడిని కొట్టడంతో బాధితుడు వినీత్ చెరువులో పడి చనిపోయిన ఘటన తెలిసిందే. ఘటనకు బాధ్యులైన లోక్​ రికవరీ ఏజెంట్లు అజయ్​ కుమార్, రాం చందర్​ తో పాటు మొత్తం నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

దీనికి కారణమైన మోహనసాయి ఫైనాన్స్​ తో పాటు మిగిలిన సంస్థల వ్యవహారాలపై పోలీసులు దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. శనివారం ఖమ్మంలో పర్యటించిన మల్టీ జోన్​ ఐజీ ఏవీ రంగనాథ్​ కూడా ఈ ఫైనాన్స్​ సంస్థలకు సంబంధించి జిల్లా అధికారులకు పలు సూచనలు చేశారు. అక్రమ ఫైనాన్స్ వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు. పేద, మధ్య తరగతి వారి అవసరాన్ని ఆసరాగా తీసుకుని అధిక వడ్డీలు, స్కీమ్ ల పేరుతో వేధిస్తే  కేసులు నమోదు చేయాలని అధికారులకు సూచించారు. నగరంలో బైక్ ఫైనాన్స్ కిస్తీలు కట్టలేదని యువకుడి మృతికి కారణమైన  ఫైనాన్స్ రికవరీ ఏజెంట్లతో పాటు ఫైనాన్సర్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఆయన ఆదేశించారు.

మొత్తం జీరో వ్యాపారమే? 

ఖమ్మం నగరంలో 20 నుంచి 22 టూ వీలర్ ఫైనాన్స్ సంస్థలున్నాయి. వీటిలో ఒక్కదానికి కూడా ఫర్మ్​ రిజిస్ట్రేషన్​ లేదని సమాచారం. కేవలం మున్సిపల్ కార్పొరేషన్​ నుంచి ట్రేడ్ లైసెన్స్​ తీసుకొని ఇష్టారాజ్యంగా ఫైనాన్స్ సంస్థలు నెలకొల్పుతున్నారు. నిబంధనల ప్రకారం టూ వీలర్ ఫైనాన్సర్లకు ఫర్మ్​ రిజిస్ట్రేషన్ తో పాటుగా కార్మికశాఖ, కమర్షియల్ ట్యాక్స్​, సేల్స్ ట్యాక్స్, ఇతర శాఖల నుంచి అనుమతి ఉండాలి. పెద్ద ఫైనాన్స్​ సంస్థలు, బ్యాంకులు పేద, మధ్య తరగతి వ్యక్తులకు, వ్యాపారాలు చేసుకునే వారికి, ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునే వారికి కొత్త టూ వీలర్​ కొనుక్కునేందుకు లోన్లు ఇస్తాయి. 

అసలు, వడ్డీ కలిపి ఆ సంస్థలకు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. లోన్​ తీసుకున్న వారు తిరిగి చెల్లించలేని పరిస్థితిలో ఆయా సంస్థలు, లోన్​ తీసుకున్న వారికి నోటీసులు ఇచ్చినా ఈఎంఐ చెల్లించకపోతే వాహనాలను సీజ్​ చేస్తాయి. అలా సీజ్ చేసిన వాహనాలను బల్క్​ గా వేలం వేసిన సమయంలో చిన్న స్థాయి ఫైనాన్స్​ సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి. ఒకేసారి తక్కువ ధరకే పెద్ద సంస్థల నుంచి కొనుగోలు చేసిన టూవీలర్లను మళ్లీ లాభం చూసుకొని అమ్మడం

వాటికి ఫైనాన్స్​ ఇచ్చి ఈఎంఐల రూపంలో వసూలు చేసుకోవడం, లోన్​ తిరిగి చెల్లించని వారిపై వేధింపులకు పాల్పడడం చేస్తున్నారు. పాత బండ్లను తిరిగి అమ్మడం, బండి కొత్తగా ఉంటే వాటి స్పేర్​ పార్ట్స్ ను పాతవాటితో మార్చి వ్యాపారం చేస్తున్నారు.​ ఆర్బీఐ నిబంధనకు విరుద్ధంగా నెలకు రూ.2 నుంచి రూ.10 వడ్డీ వసూలు చేస్తున్నారు. ఈ సంస్థలు ఎలాంటి ట్యాక్స్​లు చెల్లించకుండా సర్కారు ఆదాయానికి గండికొడుతున్నాయి.  

భయపెట్టేందుకు నోటీసులు!

బండ్లకు సంబంధించిన ఒరిజినల్​ డాక్యుమెంట్లు తమ దగ్గరే ఉంచుకొని కస్టమర్​ నుంచి దాదాపు 35 పేపర్లపై సంతకాలు తీసుకుంటారు. డాక్యుమెంటేషన్​ఛార్జీల పేరుతో రూ.3వేలు, రిజిస్ట్రేషన్​ పేరు మార్పు పేరుతో రూ.3 వేల వరకు డబ్బులు వసూలు చేస్తున్నాయి. టూవీలర్​ కొనుగోలు చేసిన వ్యక్తి ఈఎంఐ కట్టడం ఒక్కరోజు ఆలస్యమైనా రూ.10వడ్డీ బాధితుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులున్నాయి. కస్టమర్​ వాయిదా డబ్బులు కట్టకపోతే ష్యూరిటీ ఇచ్చిన వారిని వేధించిన ఘటనలూ ఉన్నాయి. లోన్​ తీసుకున్న అజయ్​ ఠాగూర్​ ఈఎంఐ కట్టకపోతే

వినీత్​ ను వెంటబడించి వేధించడంతోనే చెరువులో పడి చనిపోయాడు. డబ్బులు కట్టని వ్యక్తికి బండి సీజ్​ చేస్తామంటూ ఇంటికి నోటీసులు  పంపించి భయాందోళనలకు గురిచేస్తున్నారు. వ్యాపారంలో ఎలాంటి నిబంధనలు పాటించకుండా అధికారులకు మామూళ్లు ఇచ్చి  మ్యానేజ్​ చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.  ఈ సంస్థలన్నింటి తరఫున ఒక్కరే అధికారులను మ్యానేజ్​ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

రికవరీ ఏజెంట్లు కూడా చిరుద్యోగులే.. 

ఈ మొత్తం వ్యవహారంలో వ్యాపార లాభాలు పొందేది ఫైనాన్స్​ సంస్థల యజమానులు అయితే, చివరకు బాధితులుగా మిగులుతున్నది మాత్రం లోన్​ తీసుకున్న కస్టమర్లు, రికవరీ ఏజెంట్లుగా పనిచేస్తున్న చిరుద్యోగులే. ఫైనాన్సర్లు రూ.14వేల చొప్పున యువకులను నియమించుకొని, వారి ద్వారా లోన్లు రికవరీ చేస్తున్నారు. ఈ ఏజెంట్ల ఉద్యోగాలకు ఎలాంటి భద్రత ఉండదు. సొంత బైక్​ ఉండి, పెట్రోల్​ పోసుకొని లోన్​ తీసుకున్న కస్టమర్ల దగ్గరకు వెళ్లి లోన్​ రికవరీ చేయాలి. రోజూ సాయంత్రం వరకు కనీసం ఐదారుగురి నుంచయినా ఈఎంఐ వసూలు చేసి చూపించాలి. 

లేకపోతే రికవరీ ఏజెంట్లకు కూడా సంస్థ ఓనర్ల నుంచి వేధింపులు తప్పవు. ఈ పరిస్థితితో టూ వీలర్ ఫైనాన్స్ తీసుకున్న వ్యక్తులపై ఏజెంట్లు కఠినంగా వ్యవహరిస్తున్నారు. పోలీసులు, ఇతర శాఖల అధికారులు ముందుగా ఫైనాన్స్​ సంస్థలకు సంబంధించిన పూర్తి వ్యాపార లావాదేవీలపై దృష్టిసారిస్తే మరిన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.