మాకూ రూ.50 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలి : ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్

మాకూ రూ.50 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలి : ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్

హైదరాబాద్:  ప్రభుత్వ వైద్యులకు ఇస్తున్న రూ.50 లక్షల ఇన్సూరెన్స్ త‌మ‌కు, త‌మ‌ సిబ్బందికి కూడా ఇవ్వాలని ప్ర‌భుత్వాన్ని కోరారు ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్.  ప్రాపర్టీ టాక్స్,విద్యుత్ బిల్ ,ఇతర టాక్స్ లలో రాయితీ కల్పించాలని కోరారు. ప్రైవేట్ హాస్పిటల్ లకు సంబంధించిన పలు అంశాలపై శుక్ర‌వారం బిఆర్కే భవన్ లో వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు అసోసియేషన్ సభ్యులు. ప్రభుత్వ వైద్యులతో సమానంగా పనిచేస్తున్నాం కాబ‌ట్టి త‌మ‌కు కూడా భద్రత కల్పించాల‌ని కోరారు.

అనంత‌రం వారు మీడియాతో మాట్లాడుతూ.. “కరోనా ఎలాంటి లక్షణాలు లేకుండా వస్తుంది. అలాంటప్పుడు రోగి కి ఎలాంటి వైద్యం చేయాలన్నా, ఎలాంటి ఆపరేషన్ చేయాలన్నా ముందుగా టెస్ట్ లు చేయాలి. ఇక నుండి ప్రతి ఆపరేషన్ కు ముందు కరోనా టెస్ట్ కూడా చేయాల్సి ఉంది కాబట్టి త‌మ‌కు కూడా రాపిడ్ టెస్ట్ లకు అనుమతి ఇవ్వాలని” ప్ర‌భుత్వాన్ని కోరామ‌న్నారు.

“దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఉంది కావున వైద్యం మొత్తం ప్రభుత్వ హాస్పిటల్ లలో మాత్రమే నడుస్తోంది. చాలా హాస్పిటల్ లలో టెస్ట్ లు చేస్తున్నామ‌ని సీజ్ చేస్తున్నారు, మా హాస్పిటల్ లలో చూశాక ప్రభుత్వ దవాఖాన కి వెళ్ళాక పాజిటివ్ వస్తే మా ప్రైవేట్ హాస్పిటల్స్ ని సీజ్ చేస్తున్నారు.ఇది కరెక్ట్ కాదు.” అని అభిప్రాయ పడ్డారు.

గత 50 రోజులుగా ప్రైవేట్ హాస్పిటల్ చాలా వరకు నడవడం లేదని , త‌మ‌కు ప్రాపర్టీ టాక్స్,విద్యుత్ బిల్ లకు రాయితీలు ఇవ్వాల‌ని కోరారు అసోసియేష‌న్ స‌భ్యులు . స్టాఫ్ కు పీఎఫ్ కట్టాలని కేంద్ర ప్రభుత్వం నోటీస్ లు ఇచ్చింద‌ని, అయితే దీనికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని పీఎఫ్ కట్టకుండా చూడాలన్నారు. త‌మ ఆసుప‌త్రుల‌కు స్టాఫ్ రావడం లేదని , వారికి పీఎఫ్ ఎలా కడుతామని అ‌న్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ వైద్యులకు ,వైద్య సిబ్బంది కి కల్పించిన విదంగా త‌మ‌కు కూడా ఇన్సూరెన్స్ కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ప్రాపర్టీ టాక్స్,విద్యుత్ బిల్ ,ఇతర టాక్స్ లలో రాయితీ కల్పించాలని కోరారు.