చంద్రుడిపై దిగిన ప్రైవేట్ ల్యాండర్

చంద్రుడిపై దిగిన ప్రైవేట్ ల్యాండర్
  • దక్షిణ ధ్రువం దగ్గర్లో విజయవంతంగా దిగిన ‘అడీషియస్’ 
  • ఈ ఘనత సాధించిన తొలి ప్రైవేట్ కంపెనీగా ఇంట్యూటివ్ మెషీన్స్ 
  • చంద్రుడిపై అడుగుపెట్టిన 52 ఏండ్ల తర్వాత నాసా మూన్ మిషన్

వాషింగ్టన్: చంద్రుడిపై తొలిసారిగా ఓ ప్రైవేట్ ల్యాండర్ విజయవంతంగా దిగింది. అమెరికాలోని హూస్టన్ కు చెందిన ‘ఇంట్యూటివ్ మెషీన్స్(ఐఎం)’ రూపొందించిన ‘అడీషియస్’ ల్యాండర్ చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండ్ అయినట్లు ఆ కంపెనీ ప్రకటించింది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసాతో కాంట్రాక్టులో భాగంగా ఐఎం కంపెనీ ఈ ల్యాండర్ ను తయారు చేయగా, ఇటీవల స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగించారు.

గురువారం సాయంత్రం 6.23 గంటలకు (భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 4.23 గంటలకు) చంద్రుడి దక్షిణ ధ్రువానికి దగ్గర్లో అడీషియస్ ల్యాండర్ విజయవంతంగా దిగిందని నాసా సైంటిస్టులు ప్రకటించారు. దీంతో చంద్రుడిపైకి ల్యాండర్ ను పంపిన తొలి ప్రైవేట్ కంపెనీగా ఐఎం చరిత్ర సృష్టించింది. నాసా చివరిసారిగా 1972లో అపోలో 17 మూన్ మిషన్ ను చేపట్టింది. ఆ తర్వాత 52 ఏండ్లలో మళ్లీ మూన్ మిషన్ చేపట్టడం ఇదే తొలిసారి.

ల్యాండింగ్ సమయంలో ల్యాండర్ నుంచి సిగ్నల్స్ కట్ అయ్యాయని, కానీ ల్యాండ్ అయిన వెంటనే తిరిగి సంకేతాలు అందుతున్నాయని నాసా సైంటిస్టులు తెలిపారు. చంద్రుడిపై వివిధ పరిశోధనలు చేసేందుకు వీలుగా అడీషియస్ ల్యాండర్ పై నాసా కొన్ని పరికరాలను అమర్చి పంపింది. అయితే, ల్యాండర్ దిగిన చోట మరో 7 రోజుల్లో లూనార్ నైట్ ప్రారంభం కానుండటంతో ఇది ఆ తర్వాత మూగబోనుంది.

చీకటి వల్ల సోలార్ ప్యానెల్స్ కు వెలుతురు లేక పవర్ అయిపోనుంది. అలాగే గడ్డ కట్టే చలి కారణంగా ల్యాండర్ లోని పరికరాలు పాడయ్యే అవకాశాలు ఉన్నాయి. కాగా, ఇప్పటివరకూ ఇండియా, రష్యా, అమెరికా, చైనా దేశాలు మాత్రమే చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ సాధించాయి.