ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల ఫీజులు దోపిడి

ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల ఫీజులు దోపిడి

రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల దోపిడీకి హద్దు అదుపు లేకుండా పోతుంది. LKG పిల్లలకే లక్షల్లో ఫీజులు వసూళ్లు చేస్తూ..మధ్య తరగతి ప్రజలను అప్పుల పాలు చేస్తున్నాయి. ల్యాబ్ ..లైబ్రరీ, స్పోర్ట్స్  ఇతర ఫీజులు అన్నీ కలిపి  తల్లిదండ్రుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు గుంజుతున్నాయి. కార్పోరేట్.. ప్రైవైట్ స్కూల్స్ ఇష్టారాజ్యంగా ఫీజులు దోపిడి చేస్తున్న రాష్ర్ట ప్రభుత్వం..విద్యాశాఖ అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోణలు వస్తున్నాయి. 

అడ్మిషన్ దగ్గరి నుంచి మొదలు.. పుస్తకాలు, బూట్లు, టై బెల్టుల వరకు ఇష్టం వచ్చినట్లు రేట్లు పెడుతూ.. దోచుకుంటున్నారు. నిబంధనల ప్రకారం స్కూళ్ల పక్కనే దుకాణాలు పెట్టొద్దని ఉన్నా అవేవీ పట్టించుకోవడం లేదు. ఇప్పటికే కరోనాతో తీవ్రంగా నష్టపోయిన సామాన్య మధ్యతరగతి ప్రజలు.. ఫీజుల దోపిడిని తట్టుకోలేక పోతున్నారు. ఫీజలు కట్టేందుకు అప్పుల పాలవుతున్నారు. రాష్ట్రంలో స్కూళ్ల ఫీజుల నియంత్రణకు చట్టం తెస్తామని చెప్పిన ప్రభుత్వం.. మాటలకే పరిమితమైందన్న విమర్శలు వస్తున్నాయి.

తెలంగాణ ప్రభుత్వం ఫీజుల నియంత్రణ కోసం 2017లో ప్రొఫెసర్ తిరుపతిరావు నేతృత్వంలో కమిటీ వేసింది. ఏడాదికి 10శాతం ఫీజులు పెంచుకోవాలని ఆ కమిటీ సిఫార్సులు కూడా చేసింది. అయితే ఆ కమిటీ నివేదిక ఇప్పటికీ ప్రభుత్వ పరిశీలనలోనే ఉంది. కరోనా కారణంగా ఫీజులు పెంచొద్దని.. 2020 ఏప్రిల్లో రాష్ట్ర ప్రభుత్వం 46 జీవో జారీచేసింది. అయినా ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ ఉత్తర్వులను పట్టించుకోవటంలేదు. కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. ఒక్కో పాఠశాల.. 10వేల నుంచి 3లక్షల 50వేల రూపాయలను ఫీజల కింద వసూలు చేస్తున్నాయి. దీంతో పేరెంట్స్ ఏంచేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు.

2009 విద్యాహక్కు చట్టం ప్రకారం.. ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లు మొత్తం సీట్లలో 25శాతం పేద పిల్లలకు ఇవ్వాలి. కానీ రాష్ట్రంలోని ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్ విద్యాహక్కు చట్టాన్ని పట్టించుకోవడం లేదు. డొనేషన్, అడ్మిషన్ ఫీజుల పేరుతో లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నాయి. ఇప్పటికే దేశంలో దాదాపు 15రాష్ట్రాల్లో అమలవుతోన్న విద్యాహక్కు చట్టాన్ని.. రాష్ట్రంలో పక్కాగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలంటున్నారు పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు. ప్రభుత్వం తీరు మారకపోతే పోరాటం తప్పదని హెచ్చరిస్తున్నారు.

కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లు అడ్మిషన్ కు..ముందు ఒకలా.. జాయిన్ అయ్యాక మరోలా వ్యవహరిస్తున్నాయని మండిపడుతున్నారు పేరెంట్స్. పిల్లలను చదువుల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉందంటున్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలంటూ.. అధికారులను సంప్రదించినా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. స్కూల్ ఫీజులు ఎందుకు పెంచుతున్నారని గట్టిగా ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని అంటున్నారు. రాష్ట్రంలో రాజకీయ నేతలకు పెద్ద సంఖ్యలో విద్యాసంస్థలు ఉండటంతో.. ప్రభుత్వం ఫీజులపై చూసీచూడనట్టు వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు విద్యావేత్తలు. ప్రభుత్వం ఇప్పటికైనా ఫీజుల నియంత్రణకు కఠినమైన చట్టం తేవాలంటున్నారు.