ప్రైవేట్ స్కూళ్లలో సరిపడా టీచర్లు లేరు!

ప్రైవేట్ స్కూళ్లలో సరిపడా టీచర్లు లేరు!
  • పోటీ పరీక్షలకు ప్రిపేర్​ అవుతుండడమే కారణం
  • మరో మూడ్రోజుల్లో తెరుచుకోనున్న స్కూళ్లు
  • కరోనా టైంలో తీసేసిన వారికి మేనేజ్​మెంట్ల ఫోన్లు, మెయిల్స్
  • అడ్మిషన్లు మంచిగా అవుతున్నా వేధిస్తున్న సిబ్బంది కొరత 

హైదరాబాద్, వెలుగు:గ్రేటర్​ పరిధిలోని ప్రైవేట్​స్కూళ్లలో అడ్మిషన్ల జోరు కొనసాగుతోంది. కొన్నిచోట్ల నెల రోజుల కిందే సీట్లు ఫిల్​అయిపోయాయి. ఇంకో మూడు రోజుల్లో కొత్త అకడమిక్​ఇయర్​స్టార్ట్​కానుంది. ఈ టైంలో స్కూళ్లను టీచర్ల కొరత వెంటాడుతోంది. కరోనా టైంలో మేనేజ్​మెంట్లు అధిక సంఖ్యలో టీచర్లను తీసేశాయి. అలా ఉపాధి కోల్పోయిన చాలా మంది వ్యాపారాలు, ఇతర పనుల్లోకి మారిపోయారు. ప్రస్తుతం టీచింగ్ ఫీల్డ్​లో ఉన్నవారు గవర్నమెంట్​జాబ్​నోటిఫికేషన్లు రావడంతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. దీంతో వేసవి సెలవులు ముందు వరకు సగం జీతం ఇస్తూ వచ్చిన మేనేజ్​మెంట్లు ప్రస్తుతం గతంలో కంటే డబుల్ ఇస్తామని ఆఫీసర్లు ప్రకటిస్తున్నాయి. కరోనా టైంలో తొలగించిన వారికి ఫోన్లు, మెయిల్స్​చేయడంతోపాటు సోషల్​మీడియాలో ప్రకటనలు ఇస్తున్నాయి. ఒక్కో స్కూల్​లో దాదాపు 40 నుంచి 45శాతం టీచర్ల కొరత ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లిష్ టీచర్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. తెలుగు, హిందీ, సోషల్ టీచర్ల కోసం మేనేజ్​మెంట్లు వెతుకుతున్నాయి.
 
తొలగించినోళ్లకే తిరిగి కాల్స్
గతంలో తొలగించిన టీచర్లకు మేనేజ్​మెంట్ల నుంచి రోజూ ఫోన్లు వస్తున్నాయి. గతంలో కంటే ఎక్కువ జీతం ఇస్తామని చెబుతున్నాయి. అయితే కొందరు టీచర్ల నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో బయటి నుంచి రిక్రూట్​చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. జీహెచ్ఎంసీ, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో 7 వేల ప్రైవేట్​స్కూల్స్ ఉన్నాయి. ఇందులో 60 శాతం ఇంటర్నేషనల్, కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి. 1,000 నుంచి 1,500 వందల వరకు బడ్జెట్ స్కూల్స్ ఉన్నాయి. వీటిలో దాదాపు లక్షమంది టీచర్లు పనిచేస్తున్నారు. లాక్ డౌన్ లో వీరిలో 70 నుంచి 90 శాతం మంది ఉద్యోగాలు కోల్పోయారు. మిగతావారు సగం జీతానికే ఆన్​లైన్​పాఠాలు చెప్పారు. కరోనా ప్రభావం తగ్గడంతో గతేడాది సెప్టెంబర్​లో ఫిజికల్ క్లాసులు తిరిగి ప్రారంభం అయ్యాయి. కానీ మేనేజ్​మెంట్లు మాత్రం సగం జీతాలనే కొనసాగించాయి. దీంతో విసిగిపోయిన కొందరు ఇతర వృత్తుల్లోకి మారారు. చాలా మంది జాబ్​నోటిఫికేషన్లు పడడంతో ప్రిపేర్​అవుతున్నారు. ఈ నెల 12న ‘టెట్’ఉండటంలో టీచర్లందరూ ఆ హడావిడిలో ఉన్నారు. కాగా టెట్ ఎగ్జామ్ క్వాలిఫై అవమని అనుకున్నవారు తిరిగి స్కూళ్లలో చేరే అవకాశముందని టీచర్ యూనియన్ సభ్యులు చెప్తున్నారు. ఆపద సమయంలో మేనేజ్​మెంట్లు తమపట్ల ప్రవర్తించిన తీరుకి విసిగిపోయామని కొంతమంది టీచర్లు అంటున్నారు.

ఎక్కువ జీతం ఇస్తం రమ్మంటున్నరు

పదేళ్లుగా టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నాను. గతంలో ఓ ప్రైవేట్​స్కూల్​లో రూ.20 వేల జీతానికి పనిచేశాను. కరోనా టైంలో జాబ్​పోయింది. స్కూళ్లు మొదలయ్యాక ఇంకో స్కూల్ లో జాయిన్ అయ్యాను. అయితే గతంతో తీసేసిన స్కూల్ నుంచి ఇప్పుడు ఫోన్లు వస్తున్నాయి. అప్పటి కంటే రెండు రెట్లు ఎక్కువ జీతం ఇస్తామని ఆఫర్ చేస్తున్నారు. కానీ తొలగించే టైంలో మేం ఎంతగా బతిమాలినా మమ్మల్ని పట్టించుకోలేదు. ఇప్పుడు మేనేజ్​మెంట్లకు మా అవసరం తెలుస్తోంది.
- భాస్కర్, బయోలజీ టీచర్

అన్ని స్కూళ్లలో ఇదే పరిస్థితి
ప్రైవేట్ ​స్కూళ్లలో టీచర్ల అవసరం చాలా ఉంది. స్కూళ్లపై నోటిఫికేషన్ల ప్రభావం చాలా ఉంది. టెట్ కి ప్రిపేర్ అవుతున్న వారు డీఎస్సీ వేస్తారనే ఆలోచనలో ఉన్నారు. దీంతోనే మళ్లీ స్కూళ్లకు వెళ్లేందుకు వెనకడుగు వేస్తున్నారు. మరికొందరు గ్రూప్స్, ఎస్సై, కానిస్టేబుల్ కి ప్రిపేర్ అవుతున్నారు. కరోనా టైంలో మేనేజ్​మెంట్లు 30 మందిని తొలగించగా, 20 శాతం మంది పోటీ పరీక్షలకు వైపు వెళ్లారు. స్కూళ్లు ఎక్కువ జీతం ఇస్తామని ఆఫర్లు ఇస్తున్నా స్పందన రావడం లేదు. కొరత తీరకపోతే క్లాసులను క్లబ్ చేసి పాఠాలు చెప్పే అవకాశం ఉంది.
- శివరాజ్, ఉపాధ్యక్షుడు, తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం