జీవో ఉల్లంఘించిన ప్రైవేట్ స్కూల్స్ కు హైకోర్ట్ షాక్

జీవో ఉల్లంఘించిన ప్రైవేట్ స్కూల్స్ కు హైకోర్ట్ షాక్

హైదరాబాద్ లోని 10 ప్రైవేట్ స్కూల్స్…. జీవో 46ను ఉల్లంఘించాయని పాఠశాల విద్యాశాఖ గుర్తించింది. వీటిపై చర్యలు తీసుకోవడానికి రెడీ అయ్యింది.  అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో అక్టోబర్ 8న 11 స్కూళ్లకు నోటీసులు జారీ చేశారు అధికారులు. విచారణ జరిపేందుకు నలుగురు జాయింట్ డైరెక్టర్లతో ఓ కమిటీ వేశారు. ఈ కమిటీ మౌంట్ లిటేరా జీ స్కూల్, మెరిడియల్ స్కూల్, జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్, గీతాంజలి పబ్లిక్ స్కూల్, లిటిల్ ఫ్లవర్ స్కూల్, కల్ప స్కూల్, సికింద్రాబాద్ లోని సెయింట్ ఆండ్రూస్ స్కూల్, మేడ్చల్ లోని సెయింట్ ఆండ్రూస్ స్కూల్, అమీర్ పేటలోని నీరల్ పబ్లిక్ స్కూల్, హిమాయత్ నగర్ లోని ఆక్స్ ఫర్డ్ గ్రామర్ స్కూల్ జీవో 46లో రూల్స్ ఉల్లంఘించాయని ఆధారాలతో సహా నివేదిక సమర్పించింది.

ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని జీవో 46 చెబుతోంది. గత సంవత్సరం ఎంత ట్యూషన్ ఫీజు ఉందో ఈ ఏడాది కూడా అంతే ఫీజు కలెక్ట్ చేయాలని సూచిస్తోంది. నెలవారీగా ఫీజు కట్టే అవకాశం కల్పిస్తోంది. అయితే జీవోను కొన్ని స్కూల్స్ ఉల్లంఘించడంతో అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు కోర్టును ఆశ్రయించారు తల్లిదండ్రులు.

మరోవైపు అధికారులు హెచ్చరించినా ప్రైవేట్ స్కూల్స్ తీరు మార్చుకోవడం లేదు. ఫీజుల కోసం పేరెంట్స్ ను పరేషాన్ చేస్తున్నాయి. ఇన్నాళ్లు పైసలు కట్టని స్టూడెంట్లను వాట్సప్ గ్రూప్ ల నుంచి రీమూవ్ చేయడం, ఐడీ, పాస్ వర్డ్ తీసేయడం చేసిన మేనేజ్ మెంట్లు ఇప్పుడు కొత్త స్టైల్ లో వెళ్తున్నాయి. ట్యూషన్ ఫీజు కట్టేందుకు సిద్ధంగా ఉన్నామని పేరెంట్స్ చెబుతున్నా,  టెస్ట్ ల పేరుతో మొత్తం ఫీజు రాబట్టుకునేందుకు ప్లాన్ వేశాయి. విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఆ పేపర్లు కావాలంటే బకాయిలు కట్టాలని పేచీ పెడుతున్నాయి. దీనిపై డీఈఓలకు కంప్లయింట్ చేసినా రెస్పాన్స్ ఉండడం లేదు. టెస్ట్ పేపర్స్ కు ఫీజు లింక్, ఆన్ లైన్ క్లాసులంటూ అధిక ఫీజులు వసూలు చేయొద్దని, ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలని ప్రభుత్వం జీవో 46లో స్పష్టంగా తెలిపింది. అయితే హైదరాబాద్ లోని ఒక్క స్కూల్ మేనేజ్ మెంట్ కూడా ఈ జీవోను ఫాలో కావడం లేదు. ఇప్పటికే ఆన్ లైన్ క్లాస్ ల పేరుతో పేరెంట్స్ నుంచి  చాలా వరకు ఫీజులను వసూలు చేశాయి. మరోసారి పరీక్షలకు ఫీజులకు లింక్ పెట్టడంతో పేరెంట్స్ ఆందోళన చెందున్నారు.

మంత్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని ఓ క్వశ్చన్ పేపర్ ని ఒక సీల్డ్ కవర్ లో పెట్టి పేరెంట్స్ ను స్కూల్స్ కు  పిలిపించుకుని వారికి అందిస్తున్నాయి మేనేంజ్ మెంట్లు. టీచర్ చెప్పినప్పుడే ఆ కవర్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలని సూచిస్తున్నాయి. ఇలా సీల్డ్ కవర్ తీసుకెళ్లాలనుకుంటే మొత్తం ఫీజు చెల్లించాలని పేరెంట్స్ ను భయపెడ్తున్నాయి.

మరోవైపు ప్రభుత్వం జారీ చేసిన జీవో –46 పై క్లారిటీ లేదంటున్నారు పేరెంట్స్. ఫీజులో ఎంత శాతం కట్టాలో  కూడా చెప్పలేదంటున్నారు. ఫీజు రిసిప్ట్ లో మొత్తం కాలమ్స్ ఫిల్ చేసి ఉంచి, పూర్తి ఫీజు కట్టాలని మేనేజ్ మెంట్లు చెబుతున్నాయంటున్నారు. ఏపీలో 30 శాతం మినహాయింపు ఇస్తున్నట్లు స్పష్టంగా పేర్కొన్నారని, ఇక్కడ అలాంటిదేమీ లేక పోవడంతో ప్రైవేట్ స్కూల్స్ దోపిడీకి అడ్డు లేకుండా పోయిందంటున్నారు. కరోనా ఎఫెక్ట్ తో జాబ్ లు పోయి, బిజినెస్ లు లాస్ అయి ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న ఈ సమయంలో స్కూల్స్ ఫీజులపై ఒత్తిడి తెస్తుండడంతో మేనేజ్ మెంట్లపై పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.