
- పేరెంట్స్ నుంచి కలెక్ట్ చేస్తున్న ప్రైవేటు మేనేజ్మెంట్లు
- 300 నుంచి 2 వేల వరకు వసూలు
- ఫుల్ ఫీజులతోపాటు అదనపు భారం వేస్తున్న వైనం
- డైలీ మెసేజ్‌లు, ఫోన్ కాల్స్
- మొత్తం ఫీజులు కట్టకుంటే క్లాసులు చెప్పబోమని హెచ్చరికలు..
- ఫిర్యాదులొచ్చినా పట్టించుకోని ఆఫీసర్లు
హైదరాబాద్, వెలుగు: ప్రైవేటు స్కూళ్లు స్టూడెంట్ల నుంచి ‘శానిటైజేషన్’ ఫీజులు వసూలు చేస్తున్నాయి. క్లాసులు క్లీన్ చేస్తున్నందుకు రూ.300 నుంచి 2 వేల దాకా చార్జీలు విధిస్తున్నాయి. ఈ చార్జీలను కొన్ని స్కూల్స్ ఫీజులోనే కలిపి అడుగుతుండగా, మరికొన్ని స్కూల్స్ సపరేట్ గా కలెక్ట్ చేస్తున్నాయి. ఈమేరకు పేరెంట్స్‌కు డైలీ ఫోన్లు, మెసేజ్‌లు చేస్తున్నాయి. దీనిపై విద్యాశాఖ అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని, ప్రైవేట్ స్కూల్స్ వేధింపులు ఆగడంలేదని స్కూల్ పేరెంట్స్ సంఘాలు చెబుతున్నాయి.
కరోనా రూల్స్‌కు అనుగుణంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని స్కూల్స్ రీఓపెన్ చేయాలని రాష్ట్ర సర్కారు ఈ మధ్య ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు స్కూల్ మేనేజ్మెంట్లు శానిటైజేషన్, క్లీనింగ్ కోసం పలు కంపెనీలతో టైఅప్ అయి క్లీన్ చేయిస్తున్నాయి. కరోనా గైడ్ లైన్స్ పాటించడానికి ఎక్స్ ట్రా స్టాఫ్ ని నియమించాలని, క్లీనింగ్ కోసం అధిక ఖర్చు అవుతుందని చెబుతూ.. స్టూడెంట్స్ నుంచి వసూలు చేస్తున్నాయి. సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నందుకు అవుతున్న మొత్తాన్ని ఫీజు కింద కలెక్ట్ చేస్తున్నాయి. స్కూల్ ని బట్టి రూ.300 నుంచి రూ. 2 వేల వరకు శానిటైజేషన్ ఫీజులు చార్జ్ చేస్తున్నాయి. లాక్ డౌన్ వల్ల ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న పేరెంట్స్ కి.. ఫుల్ ఫీజుల బాధ తీరకముందే ఇప్పుడు మళ్లీ శానిటైజేషన్ పేరుతో అదనపు భారం పడింది.
సేఫ్టీ ప్రికాషన్స్ పేరుతో
ఆన్లైన్ క్లాసులు చెబుతూ మొత్తం ఫీజు కట్టాలని పేరెంట్స్‌ను ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఒత్తిడి చేశాయి. ఫిబ్రవరి 1 నుంచి 9, 10క్లాసుల స్టూడెంట్స్ కి స్కూళ్లు రీఓపెన్ అవడంతో.. ఎగ్జామ్స్ కి అనుమతించాలంటే కచ్చితంగా కట్టాల్సిందేనని స్పష్టం చేస్తున్నాయి. కరోనా సేఫ్టీ ప్రికాషన్స్ లో భాగంగా థర్మల్ స్కానింగ్, ప్రతి క్లాస్, ఫ్లోర్ శానిటైజేషన్, గంటగంటకు వాష్ రూమ్స్ క్లీనింగ్ తదితరాలు చేస్తున్నాయి. ఇందుకోసం అవుతున్న ఖర్చులను ఫీజులో కలిపేస్తున్నాయి. ఒక ప్రైవేట్ స్కూల్ లో చదివే 9వ క్లాస్ స్టూడెంట్ ఏడాది ఫీజు 38,400 కాగా, ఇప్పుడు అదనంగా శానిటైజేషన్ ఖర్చు రూ.600 కలిపి 39 వేలు వసూలు చేస్తున్నాయి. ఆన్లైన్ క్లాసుల సమయంలో డ్యూ ఉన్న అమౌంట్ ని క్లియర్ చేస్తేనే ఎగ్జామ్స్ కి అనుమతిస్తామని ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేస్తున్నాయి. దీంతో 9వ క్లాస్ స్టూడెంట్స్ పేరెంట్స్ డైరెక్ట్ స్కూల్ కి పంపకుండా ఆన్లైన్ లో క్లాసులే బెటర్ అని భావిస్తుండగా, 10వ క్లాస్ స్టూడెంట్స్ పేరెంట్స్ మాత్రం ఆందోళన చెందుతున్నారు. పిల్లల భవిష్యత్‌పై ప్రభావం పడుతుందనే భయంతో అప్పుచేసి మరీ ఫీజులు కడుతున్నారు.
ఫీజులు కడితేనే..
హైదరాబాద్ సిటీలో 1,184 ప్రైవేట్ హైస్కూల్స్ ఉన్నాయి. వీటిలో 9వ తరగతిలో 55,450 మంది, 10వ తరగతిలో 58,609 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. ప్రస్తుతం 10వ తరగతి స్టూడెంట్స్ లో 70 నుంచి 80 శాతం మంది, 9వ క్లాస్ నుంచి 50 నుంచి 60 శాతం మంది స్కూళ్లకు వెళ్తున్నారు. దీంతో ఫుల్ ఫీజుని కట్టాలని పేరెంట్స్ కి స్కూల్ స్టాఫ్ మెసేజ్ లు, ఫోన్ కాల్స్ చేస్తున్నారు. రెండు, మూడు నెలలుగా ఉన్న డ్యూ అమౌంట్ ని వెంటనే క్లియర్ చేయాలని, అప్పుడే క్లాసులు చెబుతామని హెచ్చరిస్తున్నాయి.
కాల్స్ ఎక్కువైనయ్
మాకు ఇద్దరు పిల్లలు. ప్రైవేటు స్కూల్లో చదువుతున్నారు. బాబు ఆన్లైన్ లో క్లాసులు వింటున్నాడు. అమ్మాయి 9వ క్లాస్ కాబట్టి స్కూల్ కి పంపుతున్నాం. పాపకి నెలకి 3,200 కట్టేవాణ్ని. ఇప్పుడు కరోనా గైడ్ లైన్స్ అని చెప్పి ఫీజు పెంచి కట్టమంటున్నారు. ఆన్లైన్ క్లాసుల టైం నుంచే ఫుల్ ఫీజు కోసం మెసేజ్ లు, కాల్స్ వచ్చేవి. అమ్మాయి ఇప్పుడు డైరెక్ట్‌గా స్కూలుకు వెళ్తుంది కాబట్టి.. ఫీజు కోసం కాల్స్ ఎక్కువ అయ్యాయి. లాక్ డౌన్ లో ఉద్యోగం పోగొట్టుకున్నా. చాలా ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ‑ రవీందర్, పేరెంట్, హిమాయత్ నగర్
స్పెషల్ చార్జీలట
మెహదీపట్నంలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో మా అమ్మాయి 10వ క్లాస్ చదువుతోంది. స్కూల్ రీఓపెన్ అయ్యాక క్లాసులకు వెళ్తోంది. స్కూల్ లో సేఫ్టీ ప్రికాషన్స్, క్లాసుల్లో శానిటైజేషన్ తదితర ఖర్చులను మా మీదే వేస్తున్నారు. ఇప్పటిదాకా ఫీజులో సగం కట్టాను. స్కూల్ ఓపెన్ అయింది కాబట్టి మొత్తం కట్టాలని మెసేజ్ లు పంపిస్తున్నారు. కరోనా స్పెషల్ చార్జీలు అని చెప్పి 500 ఎక్కువ వసూలు చేస్తున్నారు. ‑ నాగేశ్వర్ రావు, పేరెంట్
ఎన్ని సార్లు ఫిర్యాదులు చేసినా..
ఫీజులు ఎక్కువగా వసూలు చేయడం గురించి విద్యాశాఖ అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదులు చేసినా ప్రైవేట్ స్కూల్స్ వేధింపులు మాత్రం ఆగడం లేదు. ఇప్పుడు శానిటైజేషన్ పేరుతో పేరెంట్స్ నుంచి వసూలు చేస్తున్నారు. ఎంతో మంది పేరెంట్స్ మానసికంగా కుంగిపో తున్నారు. బయటకు చెప్పుకోలేక సతమతమవుతున్నారు. మా దృష్టికి ఇలాంటి ఫిర్యాదులు వస్తున్నాయి. కానీ ఏం చేసినా ప్రాబ్లం సాల్వ్ కావడంలేదు. ‑ వెంకట్, జాయింట్ సెక్రెటరీ, హెచ్ఎస్పీఏ