భారత్‌లో రక్తపుటేర్లు.. నా దేశాన్ని ఆదుకోండి ప్లీజ్

భారత్‌లో రక్తపుటేర్లు.. నా దేశాన్ని ఆదుకోండి ప్లీజ్

లండన్: కరోనాతో విలవిల్లాడుతున్న భారత్‌‌ను ఆదుకోవడానికి అందరూ ముందుకు రావాలని బాలీవుడ్ ప్రముఖ నటి ప్రియాంక చోప్రా కోరారు. దేశంలో చాలా భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయని, పేషెంట్లకు వైద్యం అందించేందుకు ఆస్పత్రులు సరిపోవడం లేదని ప్రియాంక వాపోయింది. కరోనా ట్రీట్‌మెంట్‌లో కీలకమైన ఆక్సిజన్ సప్లయ్, లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ కొరత ఉందని తెలిపింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేసిన ప్రియాంక.. భారత్‌కు సాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. 

‘నేను లండన్‌లో ఉన్నా. భారత్‌లో నెలకొన్న పరిస్థితుల గురించి నా మిత్రులు, కుటుంబీకుల నుంచి తెలుసుకున్నా. ఆస్పత్రుల సామర్థ్యం చాలా తక్కువగా ఉంది. ఐసీయూలు నిండిపోయాయి. అంబులెన్స్‌ల కొరత, ఆక్సిజన్ సప్లయ్ లేమి ఉంది. కరోనా మరణాలు రేటు ఎక్కువగా ఉండటంతో శ్మశానాల్లో సామూహిక దహనాలు చేస్తున్నారు. భారత్ నా ఇల్లు, నా ఇంటికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సమయంలో ప్రపంచం భారత్‌‌కు బాసటగా నిలవాలి. దయచేసి అందరూ విరాళం చేయండి. మీ అవసరం భారత్‌‌కు ఉంది’ అని ప్రియాంక కోరారు.