
- రాజకీయ కుట్రలో భాగంగానే యూరియా సరఫరా చేయట్లేదు: ప్రియాంక గాంధీ
- రాష్ట్ర కోటాను వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్
- పార్లమెంట్ ఆవరణలో స్టేట్ కాంగ్రెస్ ఎంపీలతో కలిసి నిరసన
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ రైతులపై కేంద్రం వివక్ష చూపుతున్నదని, రాజకీయ కుట్రలో భాగంగానే యూరియా సరఫరా చేయడం లేదని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ మండిపడ్డారు. రాష్ట్రానికి కేటాయించిన కోటా మేరకు వెంటనే యూరియా రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో యూరియా కొరతను తీర్చాలని వరుసగా మంగళవారం రెండోరోజు రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ లోపల, బయట నిరసన తెలిపారు.
సభ ప్రారంభానికి ముందు పార్లమెంట్ ఆవరణలో మకర ద్వారం వద్ద ఎంపీలు మల్లు రవి, గడ్డం వంశీకృష్ణ, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రామసహాయం రఘురాంరెడ్డి, కడియం కావ్య, బలరాంనాయక్, అనిల్‌కుమార్ యాదవ్, రఘువీర్ రెడ్డి, సురేశ్ షెట్కర్‌తో పాటు ఇతర రాష్ట్రాల ఎంపీలు ఆందోళన చేశారు. ఇందులో ప్రియాంక గాంధీ పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రైతుల హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతుందన్నారు. జీరో అవర్‌లో యూరియా సమస్యను లేవనెత్తుతామని తెలిపారు.
మా వాటానే అడుగుతున్నం: రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు
తెలంగాణకు కేటాయించిన యూరియాను కేంద్రం సరఫరా చేయకుండా రాష్ట్ర సర్కార్‌ను బద్నాం చేసేందుకు కుట్ర చేస్తున్నదని రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు మండిపడ్డారు. తాము అదనంగా యూరియా ఇవ్వాలని కోరడం లేదని, కేటాయించిన వాటానే రిలీజ్ చేయాలని అడుగుతున్నామని చెప్పారు. ‘‘తెలంగాణకు మొత్తం 8.30 లక్షల టన్నుల యూరియాను కేంద్రం కేటాయించింది. కానీ అందులో కేవలం 5.32 లక్షల టన్నులు మాత్రమే రిలీజ్ చేసింది.
ప్రతి నెలా రావాల్సిన వాటా కన్నా తక్కువగా యూరియా సరఫరా చేసి రాష్ట్రంలో కొరత సృష్టించింది. కేంద్ర కుట్రపూరిత చర్యలతోనే ఈ పరిస్థితి వచ్చింది”అని ఫైర్ అయ్యారు. తెలంగాణకు కేటాయించిన యూరియాను వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ‘‘బీజేపీ.. రైతు ద్రోహి. రాష్ట్రంలోని కేంద్రమంత్రులు, బీజేపీ ఎంపీలకు రైతుల బాధలు కనిపించడం లేదా?”అని మండిపడ్డారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకూ ఆందోళన కొనసాగిస్తామన్నారు.
ఎంపీలతో మాట్లాడిన తుమ్మల..
యూరియా కోసం ఢిల్లీలో కొనసాగుతున్న ఆందోళనలపై స్టేట్ కాంగ్రెస్ ఎంపీలతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. రాష్ట్ర వాటాను విడుదల చేయకుండా వివక్ష చూపుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని ఎంపీలకు ఆయన సూచించారు.
తెలంగాణ కోటాను వేరే రాష్ట్రాలకు మళ్లిస్తున్నరు: ఎంపీ వంశీకృష్ణ
తెలంగాణకు కేటాయించిన యూరియాను బీజేపీ పాలిత రాష్ట్రాలకు మళ్లిస్తున్నారని ఎంపీ వంశీకృష్ణ మండిపడ్డారు. తెలంగాణ రైతుల హక్కులను కేంద్రం కాలరాస్తున్నదని ఫైర్ అయ్యారు. తెలంగాణకు కేటాయించిన కోటా ఇవ్వాలని అడిగితే.. అదనపు యూరియా అడుగుతున్నామంటూ కేంద్రం బద్నాం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘సకాలంలో యూరియా సరఫరా చేయాలని గత మూడు నెలలుగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మలతో కలిసి ఎంపీలందరం కేంద్రమంత్రులకు విజ్ఞప్తి చేశాం. రాష్ట్ర రైతుల ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాం. కానీ కేంద్రం స్పందించకపోవడంతో ఆందోళన చేస్తున్నం. పార్లమెంట్‌లో వాయిదా తీర్మానం ఇచ్చాం”అని తెలిపారు.