సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని తన జాగీరు అనుకుంటున్నారని కాంగ్రెస్ సీనియర్ లీడర్ ప్రియాంక గాంధీ మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడితే అందరూ మంచి జరుగుతుందని అనుకున్నారని..కానీ కేసీఆర్ ఇక్కడ నియంత పాలన చేస్తున్నారని విమర్శించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. ఎవరికైనా ఇంటికి ఒక ఉద్యోగం వచ్చిందా అని ప్రశ్నించారు. రైతులకు రుణమాఫీ చేస్తామని ఇప్పటి వరకు చేయలేదన్నారు. నిరుద్యోగులకు భృతి ఇస్తామని చెప్పి..మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నియామకాలు కల్వకుంట్ల కుటుంబానికే పరిమితం అయ్యాయని ఘాటుగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో డెవలప్ మెంట్ లేదు..వివిధ వర్గాల ప్రజలకు సాయం లేదు..ఉద్యోగాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 40 మంది నిరుద్యోగులు ఉన్నారని వారంతా ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలను తగ్గించారని... విద్యా బడ్జెట్ ను తగ్గిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ప్రతీ వ్యక్తిపై వేల రూపాయల అప్పుందన్నారు.
ఇందిరమ్మ అంటే బాధ్యత పెరుగుతది
తెలంగాణను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ప్రియాంక గాంధీ అన్నారు. త్వరలో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయని చెప్పారు. ప్రభుత్వాన్ని ఎన్నుకునే సమయంలో ప్రుజలు జాగరుకతతో ఉండాలని... ఆ చైతన్యంతోనే కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని సూచించారు. తనను ఇందిరమ్మ అంటే బాధ్యత ఇంకా పెరుగుతుందన్నారు. 40 ఏళ్ల క్రితం చనిపోయిన ఇందిరమ్మను గుర్తు పెట్టుకున్న తెలంగాణ ప్రజలకు తప్పుడు హామీలు ఇవ్వలేనన్నారు. నిజాయితీగా మాట్లాడుతున్నానని....పూర్తి బాధ్యతతో సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని..అదే బాధ్యతతో యూత్ డిక్లరేషన్ ను ప్రకటిస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక హామీలు నెరవేర్చలేకపోతే అధికారం వెనక్కు తీసుకోండని చెప్పారు.
నీళ్లు, నిధులు, నియామకాల కోసం..
నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఏర్పడిందని...శ్రీకాంతాచారి వంటి ఎంతో మంది అమరవీరుల ఆకాంక్షలతోనే తెలంగాణ కల సాకారమైందని ప్రియాంక గాంధీ అన్నారు. ఏ ఒక్కరో పోరాడితే తెలంగాణ రాలేదని చెప్పారు. త్యాగం అంటే ఏంటో తన కుటుంబానికి కూడా తెలుసని ప్రియాంక పేర్కొన్నారు. తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేయడంతో సోనియా ఎంతో ఆలోచన చేసి.. స్వప్పాన్ని సాకారం చేశారని గుర్తు చేశారు. తెలంగాణను ఇక్కడి ప్రజలంతా తల్లిలా భావిస్తారని.. తెలంగాణ మీకు నేల కాదు.. తల్లి అంటూ ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. ఎంతో మంది అమరులు..త్యాగమూర్తుల బలిదానాలు వృథా కావొద్దన్నారు.
యూత్ డిక్లరేషన్
- అమరవీరుల కుటుంబాలకు రూ. 25 వేల నెలవారీ పెన్షన్
- ఉద్యమంలో పాల్గొన్న యువతపై నమోదైన కేసుల ఎత్తివేత
- ఉద్యమంలో పాల్గొన్న యువతకుఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డులు
- ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీ
- తొలి ఏడాదిలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ
- ప్రతీ ఏడాది జూన్ 2 నాటికి అన్ని శాఖల్లోని ఖాళీలతో జాబ్ క్యాలెండర్ , సెప్టెంబర్ 17 లోపు నియామకాల పూర్తి
- నిరుద్యోగులకు ప్రతీ నెలా రూ. 4,000 నిరుద్యోగ భృతి
- ప్రత్యేక చట్టంతో టీఎస్పీఎస్సీని ప్రక్షాళన, యూపీఎస్సీ తరహాలో పరీక్షల నిర్వహణ
- కాంగ్రెస్ హయాంలో నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తెలంగాణ
- రాష్ట్రంలో 7 జోన్లలో ఎంప్లాయిమెంట్ ఎక్స్‌చేంజ్‌లు, ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు
- ప్రైవేట్ కంపెనీల్లో తెలంగాణ యువతకు 75 శాతం ఉద్యోగాలు
- తెలంగాణలోని విద్య, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు యూత్ కమిషన్
- యువతకు రూ. 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు
- ప్రత్యేక గల్ఫ్ విభాగం ఏర్పాటు
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్ మెంట్
- ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలుగా పాలమూరు, తెలంగాణ, మహాత్మా గాంధీ, శాతవాహన యూనివర్సిటీలు
- ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్ లో నూతన ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీల ఏర్పాటు
- రాష్ట్రంలో 4 నూతన IIIT ల ఏర్పాటు చేసి, గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తాం
- అమెరికాలోని IMG అకాడమీ తరహాలో అన్ని వసతులతో కూడిన ప్రపంచస్థాయి క్రీడా విశ్వవిద్యాలయం
- పోలీసు, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల కోసం వరంగల్, హైదరాబాద్లలో 2 విద్యాలయాలు
- 18 సంలు పైబడి, చదువుకొనే ప్రతీ యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్లు