
న్యూఢిల్లీ: కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రధానమంత్రి, సీఎంల తొలగింపు కోసం తీసుకొచ్చిన కొత్త బిల్లులు రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా అన్నారు. రాజకీయ నేతల అవినీతిని అడ్డుకునేందుకే ఈ బిల్లు తెచ్చామంటూ బీజేపీ ప్రజల కళ్లకు గంతలు కట్టాలని ప్రయత్నిస్తోందని ఆమె విమర్శించారు.
బుధవారం ఆమె పార్లమెంట్ కాంప్లెక్స్‌లో మీడియాతో మాట్లాడారు. "భవిష్యత్తులో మీరే (బీజేపీ) ఒక ముఖ్యమంత్రిపై ఏదైనా కేసు పెట్టవచ్చు. 30 రోజుల పాటు అతడు బయటకు రాకుండా జైల్లో పెట్టి.. ఆ తర్వాత అతన్ని సీఎం పదవి నుంచి దింపేసి అధికారాన్ని లాక్కోవచ్చు. ఇది పూర్తిగా తప్పు. ప్రజాస్వామ్య వ్యతిరేకం. రాజ్యాంగ విరుద్ధం. చాలా దురదృష్టకరం" అని ప్రియాంకా గాంధీ అన్నారు.