బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే : ప్రత్యేక రాష్ట్రం వచ్చినా ప్రజల జీవితాల్లో వెలుగుల్లేవు : ప్రియాంక గాంధీ

బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే : ప్రత్యేక రాష్ట్రం వచ్చినా ప్రజల జీవితాల్లో వెలుగుల్లేవు : ప్రియాంక గాంధీ

బీఆర్ఎస్ సర్కార్ పై ఆసిఫాబాద్ బహిరంగ సభలో ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ముందుగా ఇండియా జీతేగా అంటూ స్లోగన్స్ ఇచ్చారు. ఇందిరాగాంధీ పుట్టినరోజున టీం ఇండియా.. ఆస్ట్రేలియాపై గెలుస్తుందని ధీమా వ్యక్తం  చేశారు. 40 ఏళ్లు అయినా ఇందిర జనం గుండెల్లో ఉన్నారని చెప్పారు. అనాడు ట్రైబల్ వేల్ఫేర్ సొసైటీ ద్వారా వేల మంది గిరిజనులకు ఇందిరాగాంధీ ఉపాధి కల్పించారని గుర్తు చేశారు. గిరిజనులకు భూములపై ఉన్న హక్కులను వారికే కల్పించారని అన్నారు. జల్, జంగల్, జమీన్ పై ఆదివాసీలకు హక్కులు ఉండాలని ఇందిరాగాంధీ ఆశించారని చెప్పారు. ఆదివాసీల సంస్కృతి అంటే ఇందిరకు ఎనలేని గౌరవమని...  అదే విషయాన్ని తమకు చెప్పేవారని అన్నారు. ప్రజల సమస్యలు విని.. వాటిని పరిష్కరించడమే కాంగ్రెస్ మూల సిద్దాంతం అన్నారు. 

తెలంగాణ ప్రజల చిరకాల కోరిను సోనియాగాంధీ అర్ధం చేసుకుని.. ఎంతో కష్ట నష్టమైనా ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని చెప్పారు ప్రియాంకగాంధీ. పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పరిపాలనలో రాష్ర్ట ప్రజల సమస్యలు పరిష్కరించబడ్డాయా..? అని ప్రశ్నించారు. చత్తీస్ ఘడ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం..అక్కడి పేదరికం, నిరుద్యోగాన్ని వందకు వంద శాతం పరిష్కరించిందన్నారు. రాజస్థాన్ లోనూ 2 లక్షల ఉద్యోగాలు అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని, మరో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారని అన్నారు. కేసీఆర్ తన ప్రసంగంలో మాత్రం తాను చేసిన అభివృద్ధి ఏంటో చెప్పరని, కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాత్రం విమర్శలు చేస్తుంటారని మండిపడ్డారు.

తెలంగాణలో పదేళ్లుగా నిరుద్యోగులు నిరాశతో ఉన్నారని ప్రియాంకగాంధీ చెప్పారు. ఉద్యోగాలు ఇస్తానని వాగ్దానాలు చేసిన కేసీఆర్.. ఎవరికైనా ఇచ్చారా..? అని ప్రశ్నించారు. లక్షల మందికి భూములు ఇస్తానని హామీ ఇచ్చి.. ఎవరికైనా ఇచ్చారా..? అని అడిగారు. కేవలం ధనవంతులు, పెద్ద పెద్ద వాళ్ల కోసమే బీఆర్ఎస్ పరిపాలన కొనసాగుతోందని ఆరోపించారు.  ఉద్యోగాల కోసం యువతీ, యువకులు రాత్రింబవళ్లు కష్టపడి చదివి ఎగ్జామ్స్ రాస్తే...  ఆ తర్వాత రాష్ట్రంలో పేపర్  లీకేజీలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే తాము జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని స్పష్టం చేశారు. 

చత్తీస్ ఘడ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. అక్కడి రైతుల రుణమాఫీలు చేసిందని చెప్పారు. తెలంగాణలోనూ 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ కుంభకోణం జరిగిందని, ఆ నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలందరూ ఆలోచన చేయాలని కోరారు. ప్రజలు ప్రశ్నించేతత్వం నేర్చుకోవాలన్నారు. తెలంగాణకు వస్తున్న ప్రధాని మోదీ స్కామ్ లు గురించి మాట్లాడుతారు.. కానీ.. ఇక్కడి వాళ్లపై సీబీఐ, ఈడీ రైడ్స్ జరిపించకుండా.. కేవలం కాంగ్రెస్ నాయకులపై మాత్రం దాడులు చేయిస్తారని ఆరోపించారు. 

కాళేశ్వరం అవినీతిపై, ఢిల్లీ లిక్కర్ స్కామ్ పైనా మోదీ ఏనాడు మాట్లాడరని అన్నారు. కేసీఆర్.. మోదీ పరిపాలనను వ్యతిరేకంచరు.. మోదీ కూడా కేసీఆర్ పరిపాలనను వ్యతిరేకించరు అని అన్నారు. ఇద్దరూ ఒకరికొకరు సహాయ, సహకారాలు అందించుకుంటారని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే.. ఎవరికి ఓటు వేసినా ఒకరికి మరొకరు సహకరించుకుంటారు అని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం నాటు నాటు డ్యాన్స్ చేస్తున్నాయి.. ఈ మూడు పార్టీల నాయకుల తీరు చూడండి గానీ.. వాళ్లకు మాత్రం ఓట్లు వేయకండి అని పిలుపునిచ్చారు. రెండు సార్లు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తే.. ప్రజల జీవితాలను వెనక్కి తీసుకెళ్లారని చెప్పారు.