
పాట్నా: బీహార్‌లో ఎన్నికల సంఘం చేపడుతోన్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, దేశంలో ఓట్ చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీహార్‌లో చేపట్టిన ‘ఓటర్ అధికార్ యాత్ర’ విజయవంతంగా సాగుతోంది. మంగళవారం (8వ రోజు) సుపాల్ నుంచి పున: ప్రారంభమైన ఈ యాత్రలో రాహుల్ గాంధీ సోదరి, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ పాల్గొన్నారు.
అన్నకు మద్దతుగా రాహుల్ గాంధీతో కలిసి నడిచారు ప్రియాంక. ప్రచార రథంలో రాహుల్ పక్కనే నిలబడి పార్టీ కార్యకర్తలు, అభిమానులకు ప్రియాంక గాంధీ అభివాదం చేశారు. ఈ యాత్రలో ప్రియాంక గాంధీతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ తదితరులు పాల్గొని రాహుల్ గాంధీకి సంఘీభావం తెలిపారు.
బీహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ, ఓట్ చోరీని వ్యతిరేకిస్తూ బీహార్‌లోని ససారాంలో 2025, ఆగస్ట్ 17 నుంచి ఓటర్ అధికార్ యాత్ర ప్రారంభించారు రాహుల్ గాంధీ. ఈ యాత్ర మొత్తం 16 రోజుల పాటు 1,300 కి.మీ. మేర కొనసాగి సెప్టెంబర్ 1న పాట్నాలో ముగియనుంది. ఎస్ఐఆర్ పేరుతో ప్రతిపక్షాల ఓట్లను ఓటర్ల జాబితా నుంచి అక్రమంగా తొలగించడం, నకిలీ ఓటర్లను చేర్చడం, ఓట్ల చోరీని అడ్డుకోవడం వంటి అంశాలను రాహుల్ గాంధీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. బీజేపీ, ఈసీ కుమ్మక్కై రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నాయంటూ రాహుల్ ఈ యాత్రలో ఆరోపిస్తున్నారు.