అక్టోబర్ 7 నుంచి ప్రో కబడ్డీ లీగ్ సీజన్ – 9

అక్టోబర్ 7 నుంచి ప్రో కబడ్డీ లీగ్ సీజన్ – 9

ముంబయి: ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ – 9 ఈ ఏడాది అక్టోబర్ 7 నుంచి ఆరంభం కానుంది. డిసెంబర్ లో ముగియనున్న ఈ లీగ్ కు... బెంగళూరు, హైదరాబాద్, పూణెలు వేదిక కానున్నాయి. ఈ మేరకు టోర్నీ నిర్వహిస్తున్న మార్షల్ స్పోర్ట్స్ సంస్థ ప్రకటన విడుదల చేసింది. సీజన్ – 9 కు సంబంధించి ఆటగాళ్ల వేలం ప్రోగ్రాంను ఆగస్టు 5, 6 తేదీల్లో నిర్వాహకులు పూర్తి చేశారు. ఈ సందర్భంగా మార్షల్ స్పోర్ట్స్ హెడ్, పీకేఎల్ కమిషనర్ అనుపమ్ గోస్వామి మాట్లాడుతూ... గ్రామీణ క్రీడ అయిన కబడ్డీకి  పీకేఎల్ తో అంతర్జాతీయ గుర్తింపు లభించిందన్నారు. రానున్న రోజుల్లో కబడ్డీ ఆటను మరింత మందికి  చేరువ చేసేందుకు తమ సంస్థ కృషి చేస్తోందని తెలిపారు.

గత సీజన్ లో కరోనా కారణంగా సేడియాల్లోకి ప్రేక్షకులకు అనుమతి ఇవ్వలేదన్న ఆయన... ఈ సారి ప్రేక్షకుల సమక్షంలో సీజన్ – 9 లీగ్ ను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. పీకేఎల్ –9 పూర్తి షెడ్యూల్ ను త్వరలోనే రిలీజ్ చేస్తామని తెలిపారు. ఇక గతేడాది నిర్వహించిన ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్ – 8 విజేతగా దబాంగ్ ఢిల్లీ నిలిచింది. పట్నా పైరేట్స్‌, దబాంగ్ ఢిల్లీ జట్ల మధ్య జరిగిన ఫైనల్లో ఢిల్లీ తొలిసారి ఛాంపియన్‌గా అవతరించింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో 37-36 తేడాతో ఢిల్లీ జట్టు విజయఢంకా మోగించింది. దీంతో మూడు సార్లు టైటిల్‌ విజేత పట్నా పైరేట్స్ ఒక పాయింట్ తేడాతో పరాజయం పాలైంది.