ఏబీజీ షిప్ ​యార్డ్​ ఆస్తులు రూ. 2,747 కోట్ల అటాచ్​

ఏబీజీ షిప్ ​యార్డ్​ ఆస్తులు రూ. 2,747 కోట్ల అటాచ్​
  • ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ వెల్లడి

న్యూఢిల్లీ: బ్యాంకులను మోసగించిన కేసులో ఏబీజీ షిప్ ​యార్డుకు చెందిన రూ. 2,747 కోట్ల ఆస్తులను ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ (ఈడీ) అటాచ్​ చేసింది. దేశంలోని బ్యాంకులను మోసగించి అప్పులు తీసుకున్న ఈ కంపెనీ అక్రమ మార్గాలలో ఆ డబ్బును వేరే అకౌంట్లకు తరలించిందనే ఆరోపణలనూ ఎదుర్కొంటోంది. దీంతో మనీలాండరింగ్​ కేసును ఈడీ రిజిస్టర్​ చేసింది. అటాచ్​ చేసిన ఆస్తులు సూరత్​, దహేజ్​లలోని షిప్​ యార్డులతో పాటు గుజరాత్​లోని ఇతర ప్రాంతాలలో  ప్లాట్లు, కమర్షియల్​, రెసిడెన్షియల్​ ప్రోపర్టీలూ ఉన్నట్లు ఈడీ వెల్లడించింది. ఏబీజీ షిప్​ యార్డ్​ లిమిటెడ్, ఆ గ్రూప్​లోని ఇతర కంపెనీలు, సంబంధిత సంస్థల బ్యాంకు అకౌంట్లనూ అటాచ్​ చేసినట్లు పేర్కొంది.

ఏబీజీ షిప్​యార్డ్​ లిమిటెడ్​ ప్రమోటర్, మేనేజింగ్ ​డైరెక్టర్​ రిషి కమ్​లేష్​ అగర్వాల్​ను సీబీఐ బుధవారం అరెస్టు చేసింది. ఐసీఐసీఐ బ్యాంక్​ సహా బ్యాంకుల కన్సార్టియం నుంచి ఈ గ్రూప్​ భారీగా అప్పులు తీసుకుంది. తీసుకున్న అప్పులను సక్రమంగా వాడకుండా, ఇతర అవసరాల కోసం వాటిని మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏబీజీ షిప్​యార్డ్​ లిమిటెడ్​, ఆ గ్రూప్​లోని ఇతర కంపెనీలు బెర్మాకో ఎనర్జీ సిస్టమ్స్​, థనంజయ్​ దతార్​, సవితా ధనంజయ్​ దతార్, క్రిష్ణ గోపాల్​ తోష్ణివాల్​, వీరేన్​ అహూజా ఇతరుల ఆస్తులు అటాచ్​ చేసిన వాటిలో ఉన్నాయని ఈడీ తెలిపింది.  ఏబీజీ షిప్​ యార్డ్​ లిమిటెడ్​ షిప్​ బిల్డింగ్​ రంగంలో కార్యకాలాపాలు నిర్వహిస్తోంది. 16 ఏళ్లలో మొత్తం 165 వెసెల్స్​ను ఈ కంపెనీ తయారు చేసింది.