సమస్యల క్షేత్రం..బాసర అమ్మవారి ఆలయం

సమస్యల క్షేత్రం..బాసర అమ్మవారి ఆలయం
  • బాసర సరస్వతీ క్షేత్రంలో సమస్యలు 
  • నిధులు ఉన్నా.. పనులు సున్నా..
  • ఇన్​చార్జి ఈవోతోనే నెట్టుకొస్తున్న సర్కార్​

బాసర,వెలుగు:బాసర సరస్వతీ క్షేత్రంలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. అమ్మవారి సన్నిధిలో ఒకటి ఉంటే.. ఒకటి ఉండదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  2018  ఎలక్షన్​ టైంలో సీఎం కేసీఆర్ రూ.100 కోట్లతో బాసర ఆలయ రూపురేఖలు మారుస్తానని హామీ ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు ఏ ఒక్క పని మొదలు పెట్టలేదు. ఏటా అమ్మవారి సన్నిధిలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తారు. గంటల తరబడి క్యూ లైన్​లో నిలబడి పిల్లలకు అక్షరాభ్యాసం చేయించి మొక్కులు సమర్పించుకుంటారు. ప్రభుత్వం తరఫున ఏటా మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఆలయ అభివృద్ధికి కృషిచేస్తానని మంత్రి, స్థానిక ఎమ్మెల్యే హామీ ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు.

అన్నీ సమస్యలే..
బాసర క్షేత్రంలో అన్నీ సమస్యలే రాజ్యమేలుతున్నాయి. ఆలయానికి ఏళ్లకేళ్లుగా ఇన్​చార్జి ఈవోనే కొనసాగుతున్నాడు. భక్తులకు తాగేందుకు మంచినీరు దొరకడం లేదు. సరిపడా టాయిలెట్స్​ లేవు. సత్రాల్లో ఉండే టాయిలెట్స్ సరిగా పనిచేయడంలేదు. ఉన్న వాటిలో కొన్నింటిలో నీటి సౌకర్యలేదు. స్నానాల కోసం వేడి నీళ్లు దొరకడంలేదు. టీటీడీ సత్రం, చుట్టుపక్కల సత్రాల్లో ఉండే వారు రెండు మూడు అంతస్తులు దిగి వేడి నీళ్లు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అభివృద్ధి చేసేందుకు ఆఫీసర్లు మాస్టర్​ ప్లాన్​ రూపొందించినా.. అది కాగితాలకే పరిమితమవుతోంది. విశాలమైన స్థలం, గర్భాలయ వెడల్పు, మాడవీధులు, వెయ్యి రూపాయల ప్రత్యేక మండపం,  షాపింగ్ కాంప్లెక్స్, క్యూ లైన్​ కాంప్లెక్స్, టాయిలెట్స్​కోసం వేసిన మాస్టర్​ ప్లాన్​ ముందుకు సాగడంలేదు.

కోట్ల ఆదాయం ఉన్నా...
అమ్మవారికి ఏటా కోట్ల ఆదాయం వస్తోంది. అయినా ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టడంలేదు. సరిపడు వసతి గదులు అందుబాటులో లేకపోవడంతో చాలామంది ప్రైవేట్​కాటేజీలను ఆశ్రయిస్తున్నారు. ఆలయ ఆవరణలో100 గదుల భవన నిర్మాణానికి ప్రణాళికలు రెడీ చేసిన ఆఫీసర్లు.. ఇంత వరకు పనులు ప్రారంభించలేదు. గతంలో ఆలయ అభివృద్ధి కోసం రెడీచేసిన ప్రణాళిక అనుమతుల పేరిట జాప్యం చేశారు. మాస్టర్ ప్లాన్ అనుమతికి ఫైలు ముఖ్యమంత్రి వద్దకు వెళ్లిందంటూ ప్రచారం చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు.