తెలంగాణ వర్సిటీ బర్​బాద్​!

తెలంగాణ వర్సిటీ  బర్​బాద్​!

ప్రొఫెసర్​ పోస్టులు సగం ఖాళీ

సర్కారు నుంచి అరకొరగా నిధులు

భవనాలు సరిపోని పరిస్థితి

కొత్త కోర్సుల ప్రారంభంపై కనిపించని శ్రద్ధ

మూడేళ్లుగా పీహెచ్​డీ నోటిఫికేషన్​ లేదు

‘సౌత్​ క్యాంపస్’లో కోర్సుల లొల్లి!

సరిపడా బిల్డింగులు లేవు, సరిపడా టీచింగ్​ఫ్యాకల్టీ లేరు, కొత్త కోర్సుల్లేవు, పరిశోధనలు అసలే లేవు.. నిజామాబాద్​ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీ దుస్థితి ఇది. 13 ఏళ్ల కింద ఉమ్మడి ఏపీలో ఏర్పాటైన ఈ యూనివర్సిటీ ఇప్పటికీ పుట్టెడు సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ప్రభుత్వం నుంచి సరిగా నిధులు అందకపోవడంతో అరకొర వసతులే ఉన్నాయి. ప్రొఫెసర్​ పోస్టుల్లో సగం ఖాళీగానే ఉన్నాయి. మెయిన్​ క్యాంపస్​లో ఇంటర్నల్​ రోడ్లు కూడా ఇప్పటికీ పూర్తికాని పరిస్థితి. దీంతో స్టూడెంట్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రెండు క్యాంపస్​లుగా..

ఉన్నత విద్య అందించేందుకు 2006లో అప్పటి ఉమ్మడి ఏపీ సర్కారు నిజామాబాద్‌‌ జిల్లాలో తెలంగాణ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది. మొదట నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ డిగ్రీ కాలేజీలో తరగతులు ప్రారంభించారు. తర్వాత డిచ్‌‌పల్లి సమీపంలో నేషనల్‌‌ హైవే పక్కన యూనివర్సిటీ నిర్మాణం చేపట్టారు. డిచ్‌‌పల్లి వద్ద 577 ఎకరాల విస్తీర్ణంతో మెయిన్‌‌ క్యాంపస్‌‌, కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బీటీఎస్ వద్ద 44 ఎకరాల విస్తీర్ణంలో సౌత్  క్యాంపస్‌‌  ఉన్నాయి. మెయిన్ క్యాంపస్‌‌లో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, కామర్స్ అండ్ ఎంబీఏ, ఎంసీఏ, లా కాలేజీలు ఉన్నాయి. ఒక గర్ల్స్ హాస్టల్, రెండు బాయ్స్‌‌ హాస్టల్స్‌‌ ఉన్నాయి. సౌత్ క్యాంపస్‌‌లో నాలుగు అకాడమిక్ బిల్డింగ్‌‌లు ఉన్నాయి. జియో ఇన్ఫర్మెటిక్, ఫిజిక్స్, సోషల్ వర్క్‌‌, కెమిస్ట్రీ, సైన్స్ కోర్సులు అక్కడ కొనసాగుతున్నాయి. వర్సిటీ పరిధిలో 76 అండర్ గ్రాడ్యుయేషన్ కాలేజీలు, 15 పీజీ కాలేజీలు, మూడు ఎంబీఏ కాలేజీలు, 11 బీఈడీ కాలేజీలు ఉన్నాయి. మొత్తంగా 29 కోర్సులు బోధిస్తున్నారు. న్యాక్​ నుంచి 2.61 స్కోర్‌‌తో ‘బీ’ గ్రేడ్  గుర్తింపు ఉంది.

వేధిస్తున్న ప్రొఫెసర్ల కొరత

యూనివర్సిటీలో ఫ్యాకల్టీ కొరతతో ఇబ్బంది ఎదురవుతోంది. మొత్తం 136 పోస్టులు మంజూరుకాగా 59 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఇందులో ప్రొఫెసర్‌‌  పోస్టులు 11, అసోసియేట్‌‌  ప్రొఫెసర్‌‌  పోస్టులు 25, అసిస్టెంట్‌‌  ప్రొఫెసర్‌‌ పోస్టులు 23 ఉన్నాయి. కొందరు కాంట్రాక్టు లెక్చరర్లతో క్లాసులు చెప్పిస్తున్నారు. ఇక మెయిన్​ క్యాంపస్​లో ఉన్న నాలుగు బిల్డింగ్‌‌లు సరిపోవటం లేదు. ఆర్ట్స్‌‌, సైన్స్ కోర్సులు ఒకే బిల్డింగ్‌‌లో కొనసాగుతున్నాయి. ఇంటర్నల్ రోడ్ల నిర్మాణం కూడా పూర్తి కాలేదు. పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

చెప్పేది ఎక్కువ.. ఇచ్చేది తక్కువ

బడ్జెట్‌‌లో తెలంగాణ యూనివర్సిటీకి కేటాయింపులు నామమాత్రంగా ఉంటున్నాయి.
అభివృద్ధి పనులు, నిర్వహణ కోసం రూ.47.23 కోట్లు కావాలని వర్సిటీ ప్రతిపాదిస్తే.. ప్రభుత్వం రూ.23.76 కోట్లు కేటాయించింది. అందులో ఎన్ని నిధులు విడుదలవుతాయో తెలియని పరిస్థితి ఉందని అధికారులు చెప్తున్నారు. గత బడ్జెట్‌‌లో వర్సిటీకి రూ.43.77 కోట్లు శాంక్షన్​ చేశారని.. అందులో రూ.26.77 కోట్లు మాత్రమే విడుదల చేశారని అంటున్నారు. ఈసారి కేటాయింపులు కూడా గతసారి విడుదల చేసిన నిధుల కంటే రూ.3.01 కోట్ల మేర తగ్గాయని పేర్కొంటున్నారు. సర్కారు ఇస్తున్న నిధులు వర్సిటీ నిర్వహణ, ఉద్యోగుల జీతాలకే సరిపోతున్నాయని వాపోతున్నారు.

కొత్త కోర్సులు అంతంతే..

యూనివర్సిటీలో కొత్త కోర్సులు ప్రారంభించడం లేదు. మొదట 26 కోర్సులు ఉండగా ఇటీవలే మరో మూడు కోర్సులు చేపట్టనున్నట్టు ప్రకటించారు. వసతుల లేమి, నిధుల కొరతతో కొత్త కోర్సులకు అనుమతులు ఇవ్వడం లేదని అధికార వర్గాలు చెప్తున్నాయి. సౌత్ క్యాంపస్ లో బిల్డింగ్‌‌లు, స్థలం, రవాణా సౌకర్యాలు ఉన్నాయని, ఇంజనీరింగ్ కోర్సులు ప్రవేశపెట్టడానికి అనుకూలంగా ఉంటుందని.. కానీ ఆ దిశగా ప్రయత్నాలు జరగటం లేదని స్టూడెంట్​ యూనియన్ల నేతలు అంటున్నారు.

మూడేళ్లుగా పీహెచ్‌‌డీ లేదు

యూనివర్సిటీలో పరిశోధనలు పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి. మూడేళ్లుగా పీహెచ్‌‌డీ నోటిఫికేషన్‌‌  కూడా ఇవ్వడం లేదు. దీనిపై స్టూడెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిని పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేదని వాపోతున్నారు.

సౌత్  క్యాంపస్సమస్యలు

కామారెడ్డి జిల్లాలోని బీటీఎస్ వద్ద తెలంగాణ యూనివర్సిటీ సౌత్  క్యాంపస్  ఉంది. గతంలో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్నప్పుడు ఇక్కడ ఎమ్మెస్సీ ఆర్గానిక్  కెమిస్ట్రీ కోర్సు నిర్వహించేవారు. తెలంగాణ వర్సిటీ ఏర్పాటు తర్వాత ఆ వర్సిటీకి అనుబంధంగా మారింది. మెయిన్‌‌  క్యాంపస్‌‌కు అనుబంధంగా 2012లో ఇక్కడ తొమ్మిది కోర్సులు ప్రారంభించారు. తర్వాత అందులోని ఐదు కోర్సులను మెయిన్  క్యాంపస్‌‌కు తరలించారు. దీనిపై కామారెడ్డి ప్రాంత స్టూడెంట్స్​ పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రచారానికి వచ్చిన సీఎం కేసీఆర్.. ఆ కోర్సులను తిరిగి సౌత్​ క్యాంపస్​లో ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఇంకా ఆ హామీ నెరవేరడం లేదని స్టూడెంట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

రీసెర్చ్‌‌ను ప్రోత్సహించాలి

యూనివర్సిటీలో పరిశోధనలు జరగడం లేదు. మూడేళ్లుగా పీహెచ్‌‌డీ అడ్మిషన్లు లేవు. దీనిపై ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవటం లేదు. రెగ్యులర్ వీసీ లేకపోవటం సమస్యగా మారిం ది. వర్సిటీని అభివృద్ధి చేయటా నికి అవకాశా లున్నా ప్రభుత్వం స్పందించడం లేదు.

-విఘ్నేశ్, ఎస్ఎఫ్ఐ

కేటాయించిన నిధులు సరిపోవు

యూనివర్సిటీకి ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు తక్కువగా ఉంటున్నాయి. ఇటీవల బడ్జెట్‌‌లో ప్రకటించిన నిధులు అసలే మాత్రం సరిపోయే పరిస్థితి లేదు. నిధుల కొరతతో వర్సిటీ అభివృద్ధి చెందడం లేదు.

– సింగం వెంకటేష్, ఎన్ఎస్‌‌యూఐ

ప్రొఫెసర్ల కొరత తీర్చాలి

యూనివర్సిటీలో కొత్తగా వృత్తి విద్య, ఇంజనీరింగ్ కోర్సులు ప్రవేశ పెట్టాలి. ఖాళీగా ఉన్న ప్రొఫెసర్‌‌, అసిస్టెంట్‌‌ ప్రొఫెసర్‌‌ పోస్టులను భర్తీ చేయాలి. రెగ్యులర్ ప్రొఫెసర్లు లేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.

– రాజేశ్, పీడీఎస్‌‌యూ