వీడని ‘మల్లన్న సాగర్’ ​సమస్యలు

వీడని ‘మల్లన్న సాగర్’ ​సమస్యలు

వీడని ‘మల్లన్న సాగర్’ ​సమస్యలు
ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న నిర్వాసితులు 

పెండింగ్​ ప్యాకేజీలు, పరిహారం అందజేతలో ఆలస్యం
ఓపెన్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లలో నిర్లక్ష్యం
కుటుంబ యజమాని చనిపోతే భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేయరు
ఒక్కొక్క ముంపు గ్రామంలో పదుల్లో బాధితులు

సిద్దిపేట, వెలుగు :  కాళేశ్వరం ప్రాజెక్టులో  భాగంగా  సిద్దిపేట జిల్లా  తొగుట మండలంలో 50 టీఎంసీల కెపాసిటీతో  కొమురవెల్లి  మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మించారు.  దీన్ని 18 వేల ఎకరాల విస్తీర్ణంతో నిర్మించడంతో  తొగుట,  కొండపాక మండలాల పరిధిలోని మధిర సహా 12 గ్రామాలు ముంపునకు గురికాగా 4,500 కుటుంబాలు నిర్వాసితులుగా మారాయి.  ప్రభుత్వం సేకరించిన భూములకు ఎకరాకు  రూ. 6 –8 లక్షల పరిహారంతో పాటు,  ఒక్కొ కుటుంబానికి  రూ. 7.5 లక్షల ప్యాకేజీ,  ఓపెన్ ప్లాట్లు తీసుకున్న వారికి రూ.5.04 లక్షలు  ఇంటి నిర్మాణానికి,  ఇల్లు తీసుకోని వారికి  ఆర్అండ్ఆర్ కాలనీలో ఇంటిని కేటాయించారు. 18 ఏండ్లు నిండిన వారికి  రూ.5 లక్షల ప్యాకేజీ  శాంక్షన్​ చేశారు. గజ్వేల్, ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 600 ఎకరాల్లో  ఆర్ అండ్ ఆర్ కాలనీ ఏర్పాటు చేసి 2, 500 ఇండ్లు నిర్మించి నిర్వాసితులకు అప్పజెప్పారు. ఇదే టైంలో ఓపెన్  ప్లాట్లు కోరుకున్న వారికి గజ్వేల్ టౌన్​ దగ్గరలో మూడు వేల ప్లాట్లు కేటాయించారు.

బలవంతంగా తరలింపు

మల్లన్న సాగర్ రిజర్వాయర్​ ప్రారంభించాలనే తొందరలో  ముంపు గ్రామాల నుంచి నిర్వాసితులను బలవంతంగా రెండేండ్ల కింద తరలించారు.  ఈ సందర్భంగా ముంపు గ్రామాలను ఖాళీ చేస్తేనే  పెండింగ్ పరిహారాలు, ప్యాకేజీలు ఇస్తామని ఆఫీసర్లు కండిషన్​ పెట్టడంతో  నిర్వాసితులు గజ్వేల్​లోని ఆర్అండ్ఆర్ కాలనీకి మారారు.  ముంపు గ్రామాలను ఖాళీ చేయించడంపై శ్రద్ధ చూపిన ఆఫీసర్లు తర్వాత  నిర్వాసితులు సమస్యలను పట్టించుకోలేదు.  దీంతో ముంపు గ్రామాల నిర్వాసితులు వందల సంఖ్యలో ఇప్పటికీ ఆఫీసర్ల చుట్టు  ప్రదక్షిణ చేస్తున్నా  ఫలితం లేకుండా పోతోంది. రోజులు గడుస్తున్నాయే  తప్ప తమ సమస్యలకు పరిష్కారం చూపడం లేదని నిర్వాసితులు ఆవేదన చెందుతున్నారు. 

ఇవీ సమస్యలు..

నిర్వాసితుల్లో  పలువురి సమస్యలు పరిష్కారం కావడం లేదు.    ప్యాకేజీ తీసుకున్న తర్వాత  కుటుంబ యజమాని చనిపోతే అతడికి  కేటాయించిన  ఇంటిని భార్య పేరిట   రిజిస్ట్రేషన్ చేయకపోవడం,  కుటుంబ పెద్ద చనిపోతే ఓపెన్ ప్లాటు కేటాయింపులో ఆలస్యం,  ఇండ్లు, ఓపెన్ ప్లాట్లు కేటాయించినా  రిజిస్ట్రేషన్ చేసే విషయంలో నిర్లక్ష్యం, 18 సంవత్సరాలు నిండిన వారికి ప్యాకేజీ ఇచ్చినా  ఓపెన్ ప్లాట్ల కేటాయింపు చేయకపోవడంతో  పాటు  పలు పెండింగ్​లో ఉన్న ప్యాకేజీలు, పరిహారాల విషయంలో  లేటు కావడం నిర్వాసితులను ఆందోళనకు గురిచేస్తోంది.  ఈ విషయంపై గజ్వేల్​లో ఆఫీసర్లు స్పష్టమైన సమాచారం ఇవ్వకపోవడంతో  కలెక్టరేట్ చుట్టూ నిర్వాసితులు తిరుగాల్సి వస్తున్నది. నిర్వాసిత గ్రామమైన ఒక్క పల్లెపహడ్​లోనే  భర్త చనిపోగా భార్య పేరిట ఇల్లు రిజిస్ట్రేషన్ చేయాలని 35 మంది,  ఓపెన్ ప్లాట్లు కేటాయించాలని మరో 20 మంది ఉన్నారు.  11 గ్రామాల్లోనూ  ఇవే సమస్యలతో నిర్వాసితులు ఆఫీసర్ల చుట్టు తిరగాల్సి వస్తున్నది.

ఈమె పల్లెపహడ్ గ్రామానికి చెందిన శివలింగ రామవ్వ.  నాలుగేండ్ల కింద రామవ్వ భర్త నరసయ్యకు  ప్యాకేజీ తో పాటు ఆర్అండ్ఆర్ కాలనీలో ఇంటిని కేటాయించినా రిజిస్ట్రేషన్  చేయలేదు. పట్టా సర్టిఫికెట్​లో   నిర్వాసితుడి పేరు  మాత్రమే చేర్చి  ఇంటి నెంబర్ లేకుండానే  అందించారు.  ఆర్ఆండ్ ఆర్ కాలనీలో ఇంట్లోకి  వెళ్లిన తర్వాత నరసయ్య చనిపోవడంతో భర్త  పేరిట ఉన్న  ఇంటిని తన పేరిట రిజిస్ట్రేషన్  చేయాలని మూడేండ్లుగా రామవ్వ  ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నా స్పందన లేదు. 

ఈ ఫొటోలో ఉన్న వృద్ధురాలి పేరు గొడుగు ఎల్లవ్వ.  పల్లెపహడ్​లో తమ భూమి కింద   భర్త రాజయ్యకు  నాలుగేండ్ల కింద ఫ్యామిలీ ప్యాకేజీ కింద పరిహారం ఇచ్చారు. ఈ సందర్బంగా తనకు ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఇల్లు వద్దని ఓపెన్ ప్లాట్ కేటాయించాలని ఆఫీసర్లకు దరఖాస్తు చేయగా వారు అంగీకరించారు.  ఇది జరిగిన కొద్ది రోజుల తర్వాత రాజయ్య చనిపోయాడు. ముందు అంగీకరించినట్టుగా ఓపెన్ ప్లాట్ కేటాయించాలని కోరుతూ గొడుగు ఎల్లవ్వ ఆఫీసర్ల చుట్టు తిరుగుతున్నా ఇప్పటికీ  ఎలాంటి చర్య తీసుకోలేదు. 

ALSO READ:ధరణిలో దరఖాస్తుల గుట్టలు 

ఉన్నతాధికారులు స్పందించాలి..

మల్లన్న సాగర్ నిర్వాసితుల సమస్యలపై నిర్లక్ష్యంగా ఉండడం తగదు.  పాత వాటితో పాటు కొత్తగా ఎదురైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆందోళనలు చేస్తున్నా ఆఫీసర్లు పట్టనట్టు ఉంటున్నరు. గ్రామాలను ఖాళీ చేసి ఏండ్లు గడుస్తున్నా  నిర్వాసితుల సమస్యలు పరిష్కరించకపోవడం బాధాకరం. ఉన్నతాధికారులు స్పందించి నిర్వాసితుల సమస్యలకు పరిష్కారం చూపాలి.

- ఎస్.శివకృష్ణ,   సీపీఐ గజ్వేల్ నియోజకవర్గ కన్వీనర్