V6 News

మక్క కొనుగోళ్లపై ప్రభుత్వం నిర్లక్ష్యం : ఎంపీ డీకే అరుణ

మక్క కొనుగోళ్లపై ప్రభుత్వం నిర్లక్ష్యం : ఎంపీ డీకే అరుణ
  • ప్రతిగింజను ప్రభుత్వమే కొనాలి
  • మహబూబ్‌‌నగర్‌‌ ఎంపీ డీకే అరుణ డిమాండ్

గద్వాల, వెలుగు : మక్క కొనుగోళ్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మహబూబ్‌‌నగర్‌‌ ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు. సోమవారం గద్వాల మార్కెట్‌‌యార్డులో మక్కల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తాము పడుతున్న ఇబ్బందులను ఎంపీకి వివరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు చెబుతూ కాలం గడుపుతోందని, రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లేదన్నారు. రైతు భరోసా పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదన్నారు.

జిల్లాలో 2.70 లక్షల క్వింటాళ్ల మక్కల దిగుబడి వచ్చిందని, ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌‌ చేశారు. ప్రభుత్వం కొనకపోవడంతో రూ. 800 తక్కువగా ప్రైవేట్‌‌ వ్యాపారులకు అమ్ముకోవాల్సి వస్తుందన్నారు. గద్వాల నియోజకవర్గంలోని గట్టు, మల్దకల్‌‌ మండల కేంద్రాల్లో మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించుకుంటే ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని హెచ్చరించారు.