వడ్ల కొనుగోళ్లు.. డబ్బుల చెల్లింపుల్లో స్పీడ్

వడ్ల కొనుగోళ్లు.. డబ్బుల చెల్లింపుల్లో స్పీడ్
  •     ఈ యేడు  సివిల్ సప్లయ్స్  ముందస్తు ప్రణాళికతో రైతులకు మేలు
  •      ఈసారి కొన్న వడ్ల విలువ రూ.8,690 కోట్లు
  •     ఇప్పటికే రూ.7,208 కోట్లు రైతుల ఖాతాల్లో జమ

హైదరాబాద్, వెలుగు: యాసంగి వడ్ల కొనుగోళ్లు ఈ సారి వేగవంతంగా జరిగాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 43 లక్షల టన్నులకు పైగా ధాన్యం సేకరించారు.  కొనుగోళ్లలో స్పీడ్​తో పాటు సేకరించిన వాటికి డబ్బులు కూడా వెంటనే చెల్లిస్తున్నారు. రైతులు వడ్లు అమ్ముకున్న మూడు నాలుగు రోజుల్లోనే రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయి. 

గతంలో వడ్లు సెంటర్లలో కాంటా పెట్టి నెల.. నెలన్నర రోజులైనా డబ్బులు ఖాతాల పడక రైతులు తిప్పలు పడే పరిస్థితి ఉండేది. సర్కారు పక్కా ప్లాన్​తో కొనుగోళ్లు ముందుగానే చేపట్టడంతో ఈ నెల 15 వరకే నిరుడు కంటే దాదాపు మూడు రెట్లు అధికంగా సేకరించింది. రాష్ట్రవ్యాప్తంగా 7,172 సెంటర్లు పెట్టి కొనుగోళ్లు చేపట్టింది. రైతులు డబ్బు అవసరాలకు దళారులు, ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకునే పరిస్థితి ఇప్పుడు లేదు. దీంతో బహిరంగ మార్కెట్​లోనూ ప్రైవేటు వ్యాపారులు ధాన్యం ధరలు పెంచి కొనుగోళ్లు చేపట్టారు. 

నిరుడు 42 శాతమే చెల్లింపులు.. ఈయేడు 83% 

బీఆర్ఎస్ సర్కారు హయాంలో నిరుడు ఈ టైమ్ వరకు రూ.7,530 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు జరిగింది. కానీ రైతులకు చెల్లించాల్సిన మొత్తం వడ్ల పైసల్లో ఇదే టైమ్​కు రూ.3,168 కోట్లు మాత్రమే చెల్లించింది. అంటే కొనుగోలు చేసిన దాంట్లో 42 శాతం మాత్రమే చెల్లింపులు జరిగాయి. అంటే రూ.4,362 కోట్లు లేటు చేసింది. అదే ఈయేడు కొనుగోలు చేసిన రూ.8,690 కోట్ల విలువైన ధాన్యంలో ఇప్పటికే రూ.7,208 కోట్లు రైతులకు చెల్లించింది. అంటే కొనుగోలు చేసిన ధాన్యం డబ్బుల్లో 83% చెల్లింపులు జరిగాయి. అంటే ఇంకా ఇవ్వాల్సింది 17శాతం అంటే రూ.1,482కోట్లు మాత్రమే. గతంతో పోలిస్తే మెరుగైన కొనుగోళ్లతో పాటు చెల్లింపుల్లోనూ జాప్యం లేకుండా చెల్లించడంపట్ల రైతుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.

నిరుడు కంటే ఎక్కువ సేకరణ

నిరుడుతో పోలిస్తే ఈయేడు ఎక్కువ ధాన్యం సేకరించారు. గతేడాది ఏప్రిల్ 1 నాటికి వడ్ల కొనుగోళ్లు మొదలేకాలేదు. గతేడాది ఏప్రిల్ 30 నాటికే కేవలం 6.71 లక్షల టన్నులు కొన్నరు. ఈ యేడు ఏప్రిల్ 30 నాటికే 16.93 లక్షల టన్నులు సేకరించారు. ఈయేడు మే 15 వరకు 32.93 లక్షల టన్నులు సేకరించగా.. లాస్ట్ ఇయర్ ఇదే టైమ్​కు 25.15 లక్షల టన్నులు మాత్రమే కొనగోళ్లు జరిగాయి. ఈయేడు మే 25 నాటికే 43 లక్షల టన్నులు సేకరించారు. నిరుడు కంటే ముందే కొనుగోళ్లు ప్రారంభించడంతో పాటు నిరుడు కంటే ఎక్కువ ధాన్యం సేకరించారు.