
నిర్మాత, రియల్ ఎస్టేట్ వ్యాపారి అంజిరెడ్డి హత్య కేసులో కీలక విషయాలు బయటపడ్డాయి. అంజిరెడ్డిని ప్లాన్ ప్రకారమే రాజేష్ అనే వ్యక్తి హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. అంజిరెడ్డి ఆస్తులను కాజేసేందుకు ప్లాన్ ప్రకారం రాజేష్ కుట్ర చేసినట్లు విచారణలో తేలింది. బీహార్ కు చెందిన ఇద్దరి వ్యక్తులకు సుఫారీ ఇచ్చి అంజిరెడ్డిని హత్య చేయించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడని గుర్తించారు పోలీసులు.
అంజిరెడ్డి తన ఆస్తులు అమ్ముకుని అమెరికా వెళ్లాలనుకున్నాడు. అయితే అంజిరెడ్డి తన ఆస్తులను అమ్మే పనిని తన స్నేహితుడైన కాట్రగడ్డ రవికి అప్పగించాడు. రవి ఆస్తులను కొనేందుకు రాజేష్ ను అంజిరెడ్డికి పరిచయం చేశాడు. రూ.3 కోట్ల విలువైన ఇంటిని కొనుగోలు చేస్తానని..రూ.5 లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చాడు రాజేష్. ఇదే అదునుగా తీసుకున్న రాజేష్ ఎలాగైనా ఆస్తిని కాజేయాలనే స్కెచ్ వేశాడు. డబ్బులు పూర్తిగా ఇవ్వకముందే అంజిరెడ్డి ఆస్తులను తన పేరు మీద రాయించుకుని హత్యచేయాలని కుట్ర పన్నాడు.
ఇందులో భాగంగానే అంజిరెడ్డి ఆస్తులను తన పేరు మీద రాయించుకున్న రాజేష్.. ఇద్దరు బీహారీలకు సుఫారీ ఇచ్చి అంజిరెడ్డిని సెప్టెంబర్ 29న ఓ షాపింగ్ మాల్ సెల్లార్ లో హత్య చేయించాడు. తర్వాత రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. కేసు నమోదు చేసుకున్న సికాంద్రాబాద్ గోపాలపురం పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడు రాజేష్ ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.