ఒక్క అవకాశం ఇవ్వండి.. నా పరిపాలన ఏంటో చూపిస్తా..

ఒక్క అవకాశం ఇవ్వండి.. నా పరిపాలన ఏంటో చూపిస్తా..

‘మా’ ఎన్నికల్లో తనకు ఒక్క అవకాశమిస్తే.. తన పరిపాలన ఏంటో చూపిస్తానని ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ అన్నారు. త్వరలో జరిగే మా ఎన్నికల్లో జనరల్ సెక్రెటరీ‎గా పోటీ చేసి.. ఘన విజయం సాధిస్తానని ఆయన దీమా వ్యక్తం చేశారు. తన మనస్సాక్షికి ఎంతచెప్పినా మాట వినడం లేదని.. అందుకే పోటీలోకి దిగుతున్నానని ఆయన అన్నారు. నమ్మడం.. నమ్మిన వారికోసం బతకడమే తనకు తెలుసని బండ్ల గణేష్ అన్నారు. అందరికీ అవకాశమిచ్చారు.. ఇప్పడు తనకు ఒకే ఒక అవకాశమిస్తే తానేంటో చూపిస్తానని ఆయన అన్నారు. సినీ ఇండస్ట్రీకి చెందిన వంద మంది పేద కళాకారులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వడమే తన ధ్యేయమని.. దానికోసం పోరాడతానని ఆయన స్పష్టం చేశారు. సినీ రంగంలోని పేదవారి సొంత ఇంటి కల నిజం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇప్పుడు పదవుల్లో ఉన్నవాళ్లు రెండేళ్లుగా ఏమీ చేయలేదని... ఇప్పుడు చేస్తామంటే ‘మా’ సభ్యులు నమ్మరని ఆయన అన్నారు. గొడవలతో మా సభ్యులను మోసం చేసింది చాలని.. ఇక అలా జరగొద్దని ఆయన అన్నారు. తన గెలుపు కోసం అందరి ఆశీస్సులు కావాలని గణేష్ కోరారు. ‘మా’ ను బలోపేతం చేసి.. ముఖ్యంగా పేద కళాకారుల ఇళ్ళ కలను నిజం చేయడమే నిజమైన అభివృద్దికి చిహ్నమని ఆయన అన్నారు.

కాగా.. ‘మా’ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాశ్ రాజ్.. బండ్ల గణేష్ తన ప్యానెల్‎లో అధికార ప్రతినిధిగా ఉండాలని కోరారు. అయితే ప్రకాశ్ రాజ్ ఆఫర్‎ను బండ్ల గణేష్ సున్నితంగా తిరస్కరించారు. తనకున్న పనుల వల్ల ఆ పదవికి తాను న్యాయం చేయలేనని.. తన స్థానంలో మరోకరికి అవకాశం కల్పించాలని సూచించారు.