సామాన్యుడి యుద్ధమే పెదకాపు : మిర్యాల రవీందర్ రెడ్డి

సామాన్యుడి యుద్ధమే పెదకాపు :  మిర్యాల రవీందర్ రెడ్డి

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ జంటగా మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన పొలిటికల్ థ్రిల్లర్ ‘పెదకాపు’. సెప్టెంబర్ 29న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌‌‌‌‌‌‌‌ ఈవెంట్‌‌‌‌‌‌‌‌కి దర్శకుడు మల్లిడి వశిష్ట హాజరై సినిమా సక్సెస్ అవ్వాలని విష్ చేశాడు.  శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ ‘కొత్త హీరోతో ఇలాంటి కొత్త కథ చేసినప్పుడు  నిర్మాత దన్ను ఇచ్చినపుడు .. దర్శకుడిగా అందరి తరపున నిలబడి సినిమా చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. ఎప్పుడైనా ప్రోత్సాహం ఉంటేనే ఉత్సాహం ఉంటుంది. ఇందులో పని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్స్. పెదకాపు జర్నీ చాలా బావుంది. ఈ సినిమా అందర్నీ అలరిస్తుందని కోరుకుంటున్నా’ అన్నారు. 

విరాట్ కర్ణ మాట్లాడుతూ ‘నేను హీరోగా ఇంత పెద్ద సినిమాని నిర్మించిన మా బావ (మిర్యాల రవీందర్ రెడ్డి)గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. మొదటి సినిమా అందరికీ మెమరబుల్. అలాంటి మెమరీస్ అన్నీ ఇందులో ఉన్నాయి. శ్రీకాంత్ గారు, చోటా కె నాయుడు సహా కో ఆర్టిస్టులంతా సపోర్ట్ చేశారు’ అని చెప్పాడు. ఇందులో పార్ట్ అవడం లక్కీ అంది హీరోయిన్ ప్రగతి. మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ‘ఒక సామాన్యుడు తన పరిస్థితులని తట్టుకొని బలవంతుడిని జయించాలంటే ఒక యుద్ధమే చేయాలి. అనుకున్నది సాధించాలంటే పోరాటం తప్పితే వేరే మార్గం ఉండదు. అని చెప్పేది ఈ సినిమా కథ’ అన్నారు. నటులు రావు రమేష్, అనసూయ, బ్రిగడ,  సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు సహా టీమ్ అంతా పాల్గొన్నారు.