
మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించిన చిత్రం ‘గుంటూరు కారం’. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమాకు మొదటి వారంలోనే రూ.212 కోట్లకు పైగా గ్రాస్ రావడం ఆనందంగా ఉందన్నారు నిర్మాత సూర్య దేవర నాగవంశీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కొందరి అంచనాలను తప్పని నిరూపిస్తూ ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టడం ఆనందంగా ఉంది. థియేటర్స్‌లో సినిమా బాగా పెర్ఫార్మ్ చేస్తోంది. డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు అందరూ బ్రేక్ ఈవెన్‌కి చేరువయ్యారు. నెగిటివ్ రివ్యూలు సినిమాపై ఎటువంటి ప్రభావం చూపలేదు.
అర్థరాత్రి ఒంటి గంట షోస్ కారణంగా ప్రేక్షకులు కొంత మిస్ లీడ్ అయ్యారని అనిపించింది. ఆరోజు ఉదయం కొందరు సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులను గందరగోళానికి గురిచేసే ప్రయత్నం చేశారు. కానీ కుటుంబ ప్రేక్షకులు, సాధారణ ప్రేక్షకులు ఎప్పుడైతే సినిమాకి రావడం మొదలుపెట్టారో, ఆ సాయంత్రానికి ఒక్కసారిగా టాక్ మారిపోయింది. తల్లీకొడుకుల సెంటిమెంట్ బాగా వర్కవుట్ అయింది. అందుకే ఈ స్థాయి వసూళ్లు వస్తున్నాయి. ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్లే ఈ విజయానికి నిదర్శనం. దీనిని ఓ ఫ్యామిలీ సినిమాగా మేము ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లలేక పోయాం. దీంతో పక్కా మాస్ సినిమాగా భావించి, థియేటర్‌కు వెళ్లిన అభిమానులు కాస్త నిరాశ చెందారేమో అనిపించింది. ఇప్పుడు సినిమా పట్ల మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం. మహేష్ బాబు మొదటి నుంచీ ఈ సినిమాపై ధైర్యంగానే ఉన్నారు. ఆయన అంచనానే నిజమైంది’ అని అన్నారు.