
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై వరుస క్రేజీ ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ హీరోలుగా సముద్రఖని దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘బ్రో’ చిత్రం ఈనెల 28న విడుదలవుతోంది. ఈ సందర్భంగా టీజీ విశ్వ ప్రసాద్ ఇలా ముచ్చటించారు.
‘‘త్రివిక్రమ్ గారు తమిళంలో ఈ సినిమా చూసి రీమేక్ చేస్తే బాగుంటుందని సూచించారు. పవన్ కళ్యాణ్ గారితో సినిమా కనుక ‘బ్రో’ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. తమిళ చిత్రంతో పోలిస్తే కథలోని ఆత్మ అలాగే ఉంటుంది. కానీ స్క్రీన్ ప్లే, కమర్షియల్ ఎలిమెంట్స్ పరంగా కొత్తగా ఉంటుంది. కళ్యాణ్ గారి వల్ల సినిమా స్థాయి ఎన్నో రెట్లు పెరిగింది. మొదటి పది నిముషాలు మినహా సినిమా చివరి వరకూ ఆయన ఉంటారు. ఒరిజినల్ చూసిన వారికి కూడా కొత్త ఫీల్‌ను ఇస్తుంది. ముఖ్యంగా ఇద్దరు హీరోల మధ్య వచ్చే సీన్స్, వాళ్ళ పాత్రలు ప్రేక్షకులను హత్తుకుంటాయి. ఈనెల 21 లేదా 22 తేదీల్లో ట్రైలర్‌ను విడుదల చేస్తాం. 25న ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ప్లాన్ చేస్తున్నాం. ఇది మా25వ సినిమా. ఇక ప్రతి సినిమాకు ఒక స్ట్రాటజీ ఉంటుంది. టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభాస్ గారితో మేము తీస్తున్న సినిమా గురించి చెప్తాం. ఓవైపు కళ్యాణ్ గారు, మరోవైపు ప్రభాస్ గారు.. ఇద్దరూ ఎవరికివారు ప్రత్యేకం. ఒకరితో ఒకరిని పోల్చలేం. అందరు హీరోలతో సినిమాలు చేయాలనే దిశగా అడుగులు వేస్తున్నాం. నా డ్రీమ్ హీరో మాత్రం చిరంజీవి గారు. ఆయనకు వీరాభిమానిని. ఆయనతో సినిమా చేయడం నాకు ప్రత్యేకం’’.