బడ్జెట్‌‌ కాదు.. స్టోరీ, డైరెక్టర్‌‌ ముఖ్యం : విజయ్ కిరగందూర్

బడ్జెట్‌‌ కాదు.. స్టోరీ, డైరెక్టర్‌‌ ముఖ్యం : విజయ్ కిరగందూర్

కేజీఎఫ్‌‌, కాంతార లాంటి బ్లాక్ బస్టర్స్‌‌ తర్వాత హోంబలే ఫిల్మ్స్‌‌ నుంచి వస్తున్న చిత్రం ‘సలార్‌‌‌‌’. ప్రభాస్ హీరోగా ప్రశాంత్‌‌ నీల్‌‌ తెరకెక్కించిన ఈ మూవీ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా సినిమా విశేషాల గురించి నిర్మాత విజయ్ కిరగందూర్ ఇలా ముచ్చటించారు. 

‘‘సలార్’ సినిమాను 2021లో స్టార్ట్ చేశాం. కానీ కొవిడ్ రెండు వేవ్స్ కారణంగా 2022లో పూర్తి స్థాయి షూటింగ్ ప్రారంభమైంది. తొంభై శాతం తెలంగాణ, ఏపీలో చిత్రీకరించాం. ఈ ఏడాది జనవరిలో షూటింగ్‌ పూర్తి చేశాం. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశాం. ఐదు భాషల్లో రిలీజ్‌‌కు ప్లాన్ చేశాం కనుక డబ్బింగ్, సీజీ వర్క్ లాంటి విషయాలకు ఎక్కువ టైమ్ తీసుకుని డిసెంబర్‌‌‌‌లో రిలీజ్‌‌ చేస్తున్నాం. 

ఈ జర్నీ ఓ సూపర్ ఎక్స్‌‌పీరియెన్స్. ఫస్ట్ టైమ్ తెలుగు హీరో ప్రభాస్‌‌ గారితో వర్క్ చేశాం. మిగతా టీమ్ అంతా పాతదే. ఆయన చాలా మంచి వ్యక్తి. అందుకే ఈ జర్నీ మాకు మెమొరబుల్. మా బ్యానర్‌‌లో ప్రభాస్ నటిస్తుండటం, ‘కేజీఎఫ్‌‌’ లాంటి భారీ బ్లాక్ బస్టర్‌‌‌‌ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఓ రేంజ్‌‌లో ఉన్నాయి. అందరి అంచనాలను అందుకునేలా సినిమా ఉంటుంది.  ‘సలార్‌‌‌‌’ కోసం ఓ కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేశాం. మేకింగ్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ప్రశాంత్ నీల్‌‌కు ఉన్న క్రియేటివిటీకి నేనొక ఫ్లాట్ ఫామ్ మాత్రమే. 

తనకు కావలసిన వనరులను సమకూర్చడం నిర్మాతగా నా బాధ్యత. అలాగే ప్రొడక్షన్, మార్కెటింగ్‌‌లలో తను ఇన్‌‌వాల్వ్ కారు. ఇలా ఇద్దరి మధ్య మంచి అనుబంధం, అవగాహనతో ముందుకెళ్తున్నాం. ఒక సినిమాను ఓకే చేసేటప్పుడు కాన్సెప్ట్‌‌, కంటెంట్‌‌ ఎలా ఉంది.. డైరెక్టర్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు, స్టోరీ సీక్వెన్స్ కరెక్ట్‌‌గా ఉందా.. ఈ సినిమా తీయడానికి ఇది సరైన సమయమేనా’ అనే విషయాలపై ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటా. 

నేను బడ్జెట్‌‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వను. నాకు స్టోరీ, డైరెక్టర్ ముఖ్యం. ఇక మన దేశంలోని సంస్కృతి, సాంప్రదాయాలు, భాషలు అన్నీ వేర్వేరుగా ఉంటాయి. అవన్నీ కలిస్తేనే ఇండియన్ సినీ ఇండస్ట్రీ అవుతుంది. దాన్ని గ్లోబెల్ రేంజ్‌‌కి తీసుకెళ్లాలనేదే నా లక్ష్యం’.