అమ్మోనియా ప్లాంట్ లో లీకేజీ.. రామగుండం ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీలో నిలిచిన ఉత్పత్తి 

అమ్మోనియా ప్లాంట్ లో లీకేజీ.. రామగుండం ఫెర్టిలైజర్  ఫ్యాక్టరీలో నిలిచిన ఉత్పత్తి 

పెద్దపల్లి జిల్లా:  రామగుండం ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి నిలిచిపోయింది. అమ్మోనియా ప్లాంట్ లో లీకేజ్ జరగడంతో బుధవారం రాత్రి నుంచి యూరియా ఉత్పత్తి ప్రక్రియ స్తంభించింది. ఆర్ఎఫ్సీఎల్ ను ఈ నెల 12న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితం చేయనున్న నేపథ్యంలో ఫ్యాక్టరీలో ఉత్పత్తి ప్రక్రియకు బ్రేక్ పడటంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది. ఇవాళ సాయంత్రంకల్లా మరమ్మతులు చేసి ప్రొడక్షన్ ను స్టార్ట్ చేసే అవకాశం ఉంది. 

1999లో మూసేసి.. 

బొగ్గుతో నడిచే రామగుండం ఎరువుల  కర్మాగారాన్ని నష్టాల కారణంగా 1999లో మూసివేశారు. ఎఫ్‌‌‌‌సీఐ స్థానంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో గ్యాస్ ఆధారితంగా ఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఎల్‌‌‌‌ నిర్మించారు. 2015 ఫిబ్రవరి 17న ఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఎల్‌‌ ఏర్పడగా, 2015 మార్చి 11న ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి సెప్టెంబర్ 25న నిర్మాణ పనులు ప్రారంభించారు. 2016 ఆగస్టు 7న ప్రధాని నరేంద్ర  మోడీ ఈ ప్లాంట్ కోసం మెదక్ జిల్లా గజ్వేల్ లో శంకుస్థాపన చేశారు. 2018 డిసెంబర్ నాటికి ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసి ఎరువుల ఉత్పత్తి  చేయాలనుకున్నప్పటికీ వర్షాలు, ఇతర కారణాల వల్ల లేటైంది. అలాగే 2020లో ఫ్యాక్టరీని ప్రారంభించాల్సి ఉండగా, కరోనా కారణంగా పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం పరిస్థితులు మెరుగవడంతో  నిర్మాణ పనులు దాదాపు పూర్తి చేసి 2021 మార్చిలో  ట్రయల్‌‌‌‌ రన్‌‌‌‌ చేశారు.

వేపనూనె పూత పూసిన యూరియా తయారీ 

ఈ పరిశ్రమలో కొత్త టెక్నాలజీతో వేపనూనె పూత పూసిన యూరియాను తయారు చేయనున్నారు. ఏటా 13 లక్షల మెట్రిక్‌‌‌‌ టన్నుల ఎరువులు ఉత్పత్తి చేయాలనేది ఈ పరిశ్రమ లక్ష్యం. దేశంలో ఏటా 300 లక్షల మెట్రిక్‌‌ టన్నుల యూరియా వాడుతుండగా 240 లక్షల మెట్రిక్‌‌ టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. ఈ లోటును తగ్గించేందుకు దేశవ్యాప్తంగా మూతపడిన ఐదు కర్మాగారాలను రీఓపెన్ చేయాలని కేంద్రం నిర్ణయించింది. మొదటగా తెలంగాణలో ఆర్‌‌ఎఫ్‌‌సీఎల్‌‌ రెడీ అయింది. ఇక్కడ తయారు చేసే యూరియాలో రాష్ట్రానికి 6.50 లక్షల మెట్రిక్‌‌‌‌ టన్నులు, మిగిలింది ఏపీ, తమిళనాడు, కర్నాటకకు సప్లై చేయనున్నారు.

ఆరుగురు వాటాదారులు..

ఆర్‌‌ఎఫ్‌సీఎల్‌లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు తెలంగాణ సర్కార్ వాటాదారుగా ఉంది. 26% నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్(ఎన్ఎఫ్ఎల్), 26% ఇంజినీర్స్ ఇండియా లిమిడెట్(ఈఐఎల్), 11% ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎఫ్‌‌సీఐఎల్), 11% తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, 11.7% డెన్మార్క్ దేశానికి చెందిన హల్దార్‌‌‌‌ టాప్స్‌‌‌‌ కంపెనీ, 14.3% గ్యాస్‌‌‌‌ సరఫరా చేసే గెయిల్ సంస్థకు వాటాలున్నాయి. 6 బ్యాంకులు లోన్‌‌‌‌ ఇస్తుండగా, వీటన్నింటికీ ఎస్‌బీఐ నోడల్ ఏజెన్సీగా ఉంది.