విద్యార్థుల సమస్యలపై ముథోల్​లో ‘సమర దీక్ష’   

విద్యార్థుల సమస్యలపై ముథోల్​లో ‘సమర దీక్ష’   

భైంసా, వెలుగు: బాసర ట్రిపుల్​ఐటీ స్టూడెంట్స్​పై కేసీఆర్​ఎందుకింత కక్ష సాధిస్తున్నారో అర్థం కావడం లేదని టీజేఎస్​ చీఫ్ కోదండరామ్​ ఫైరయ్యారు. శుక్రవారం ఆయన నిర్మల్​ జిల్లా ముథోల్​లో బాసర ట్రిపుల్​ ఐటీ స్టూడెంట్ల సమస్యల పరిష్కారం కోసం ‘సమర దీక్ష’ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సరైన భోజనం పెట్టకపోవడం, లెక్చరర్​ నియామకంతోపాటు హాస్టల్​లో సమస్యలపై మూడు నెలలుగా స్టూడెంట్స్​ఆందోళనలు చేస్తుంటే కేసీఆర్​ ఇటువైపు  కన్నెత్తి చూడకపోవడం దారుణమన్నారు. కడుపునిండా సరైన భోజనం లేక హాస్టళ్లలో స్టూడెంట్స్​అవస్థలు పడుతుంటే.. సీఎం మాత్రం ఇతర రాష్ట్రాలు తిరుగుతూ సహాయాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని విద్యార్థులు, రైతులు కేసీఆర్​కంటికి కన్పించడం లేదన్నారు.  ఎనిమిదేండ్లుగా వర్సిటీలో రెగ్యులర్​ వీసీని నియమించకపోవడం ఏంటని ప్రశ్నించారు. చాలా రాష్ట్రాలు ఆదాయంలో 15 శాతాన్ని చదువులకు కేటాయిస్తుంటే మన సర్కారు మాత్రం ఆరు శాతమే కేటాయిస్తోందని విమర్శించారు. బాసర ట్రిపుల్​ఐటీలో టీఆర్​ఎస్ అనుకూల వ్యక్తులకు కాంట్రాక్టులు ఇవ్వడంతోనే సమస్యలు పెరిగాయన్నారు. సమస్యలు తెలుసుకునేందుకు వెళ్లే వాళ్లను క్యాంపస్​లోకి రానివ్వకుండా అరెస్టు  చేయడం సరికాదన్నారు. కేసీఆర్ వెంటనే విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధిపై దృష్టి పెట్టాలని డిమాండ్​ చేశారు. 

ఇన్సూరెన్స్  డబ్బులు ఎక్కడికి పోయాయి?
ట్రిపుల్​ ఐటీ స్టూడెంట్స్​ నుంచి వసూలు చేసిన ఇన్సూరెన్స్ ప్రీమియం డబ్బులను ఆయా కంపెనీలకు చెల్లించాలని కోదండరామ్​ డిమాండ్​ చేశారు. అధికారులు ఒక్కో స్టూడెంట్​ నుంచి రూ.700 వసూలు చేశారని, ఆ డబ్బులు ఎటు వెళ్లాయని ప్రశ్నించారు. దీనిపై విచారణ జరిపించాలన్నారు. సర్కారు నిర్లక్ష్యం వల్లే ఇటీవల ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న నలుగురు మహిళలు చనిపోయారన్నారు. సాయంత్రం 5 గంటలదాకా కొనసాగిన ఈ దీక్షలో నేతలు హరిగోపాల్, గంగాపురం వెంకట్​రెడ్డి, విశ్వేశ్వరరావు, బైరి రమేష్, జిల్లా అధ్యక్షుడు విజయ్​కుమార్​ పాల్గొన్నారు.