స్వరాష్ట్రంలోనూ ఉద్యమకారులకు అన్యాయం.. : ప్రొ.కోదండరాం

స్వరాష్ట్రంలోనూ ఉద్యమకారులకు అన్యాయం.. : ప్రొ.కోదండరాం

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ కారులకు న్యాయం జరుగుతుందని భావిస్తే.. చివరికి అన్యాయమే జరిగిందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ.కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. 'అభివృద్ధి పేరుతో జరుగుతున్న దోపిడీ విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం' అనే నినాదంతో ఆయన 'తెలంగాణ బచావో' యాత్ర చేపట్టారు. ఈ యాత్ర హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటలో ప్రారంభమై మేడారం వరకు రెండు రోజుల పాటు కొనసాగనుంది. కోదండరా అక్కంపేటలో ప్రొఫెసర్​ జయశంకర్​విగ్రహానికి నివాళి అర్పించి యాత్ర ప్రారంభించారు.

 ఆయనతో పాటు కేయూ రిటైర్డ్​ ప్రొఫెసర్​ వెంకట్​ నారాయణ, ఉద్యమకారులు తదితరులు ఉన్నారు. కోదండరాం మాట్లాడుతూ.. తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులను పాలకులు విస్మరించారని ఆరోపించారు. రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన కొనసాగుతోందన్నారు.  విద్యను వ్యాపారంగా మార్చి, స్టేట్​ని అప్పుల పాలు చేశారని విమర్శించారు. సింగరేణి, ఆర్టీసీలో నియామకాలు చేపట్టకుండా సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్​ఎస్​ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే రానున్నాయని పేర్కొన్నారు.