ఇండియా సైలెంట్‎గా ఉండటం బెటర్.. ట్రంప్ పేకమేడ కూలడం ఖాయం: ప్రొ. స్టీవ్ హాంకీ

ఇండియా సైలెంట్‎గా ఉండటం బెటర్.. ట్రంప్ పేకమేడ కూలడం ఖాయం: ప్రొ. స్టీవ్ హాంకీ

న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలపై టారిఫ్ వార్‎కు తెరతీయడం ద్వారా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తనను తానే నాశనం చేసుకుంటున్నారని అమెరికన్ ఎకనమిస్ట్, జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ స్టీవ్ హాంకీ అన్నారు. కొద్దికాలంలోనే ట్రంప్ పేకమేడ కూలిపోవడం ఖాయమని, అప్పటివరకూ ఆయన జోలికి వెళ్లకుండా భారత ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్ వేచి చూడటం మంచిదని సూచించారు.

ట్రంప్ టారిఫ్ లు, ఇండియా, యూఎస్ సంబంధాలపై ప్రొఫెసర్ స్టీవ్ హాంకీ ఈ మేరకు ‘ఎన్డీటీవీ’ ఇంటర్య్వూలో మాట్లాడారు. భారత్ పై ట్రంప్ 50 శాతం టారిఫ్ లు ప్రకటించడంపై స్పందిస్తూ.. భారత్ సహా వివిధ దేశాలపై టారిఫ్‎లు పెంచడం అనేది ట్రంప్ తీసుకున్న అతి చెత్త నిర్ణయమని, ఆయన ఆర్థిక విధానాలు పూర్తిగా తప్పు అని స్పష్టం చేశారు.

‘‘శత్రువు తనను తాను నాశనం చేసుకునే పనిలో ఉన్నప్పుడు ఏమాత్రం జోక్యం చేసుకోరాదన్న నెపోలియన్ సలహాను ఈ సందర్భంగా మోదీ,  జైశంకర్  గుర్తుంచుకోవాలి. వారు కొంతకాలంపాటు సైలెంట్ గా వేచి చూడాలి. ఎందుకంటే టారిఫ్ ల పేరుతో ట్రంప్ కడుతున్న పేకమేడ త్వరలోనే కూలిపోతుంది” అని ప్రొఫెసర్ హాంకీ అన్నారు. ‘‘అమెరికాలో ప్రజలు చేస్తున్న ఖర్చు దేశ జీడీపీ కంటే చాలా ఎక్కువగా ఉంది. దేశం ప్రస్తుతం భారీ వాణిజ్య లోటులోకి పడిపోయింది. అందుకే  ట్రంప్ టారిఫ్ ఎకానమిక్స్ పూర్తిగా చెత్త విధానాలుగా మారతాయి” అని ఆయన వివరించారు.