ప్రైవేటు కాలేజీల్లో ఫీజుల నిర్ధారణకు కమిటీ : బాలకిష్టారెడ్డి

ప్రైవేటు కాలేజీల్లో ఫీజుల నిర్ధారణకు కమిటీ : బాలకిష్టారెడ్డి
  •  చైర్మన్‌‌గా ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి నియామకం

హైదరాబాద్ వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేట్ ప్రొఫెషనల్ కాలేజీల్లో ఫీజు ఖరారు విధివిధానాల రూపకల్పనకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీకి చైర్మన్‌‌గా హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టా రెడ్డిని నియమించింది. కౌన్సిల్ సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్ కమిటీకి సెక్రటరీగా వ్యవహరిస్తారు. సభ్యులుగా సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, సాంఘిక సంక్షేమశాఖ కమిషనర్ క్షితిజ, స్టేట్ ఆడిట్ డైరెక్టర్ ఎం. వెంకటేశ్వర్ రావు, డీటీసీపీ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వెంకటేశ్వర రావు, ఓయూ ప్రొఫెసర్ క్రిష్ణయ్యతో పాటు ఇద్దరు సబ్జెక్ట్ ఎక్స్‌‌పర్ట్‌‌లను చేర్చారు.

ఈ మేరకు విద్యాశాఖ సెక్రటరీ యోగిత రాణా  జీవో జారీ చేశారు. తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌‌ఆర్సీ) 2025-–28 బ్లాక్ పీరియడ్‌‌కు ఫీజు నిర్ధారణ ప్రతిపాదనలు సమర్పించింది. అయితే, ఫీజు నిర్ధారణ ప్రతిపాదినలపై స్పష్టత లేకపోవడంతో పారామీటర్ల రూపకల్పన కోసం కమిటీని ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల విధానాలను పరిశీలించి, న్యాక్, ఇతర గుర్తింపుల ఆధారంగా కాలేజీలను A+ నుంచి D వరకు గ్రేడ్‌‌లుగా విభజించి, ఫీజు నిర్ధారణకు సిఫారసులు చేయనున్నారు. ఈ కమిటీ సిఫారసుల ఆధారంగా టీఏఎఫ్‌‌ఆర్సీ కొత్త ఫీజులను ఖరారు చేయనుంది.