
ముషీరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ తరహాలో ఎస్టీ వర్గీకరణ కూడా చేయాలని.. అది ఆదివాసీల న్యాయమైన డిమాండ్ అని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఆదివారం హైదరాబాద్ లోని బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తుడుం దెబ్బ ఆదివాసీ సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఎస్టీ వర్గీకరణపై రౌండ్ టేబుల్ మీటింగ్ జరిగింది. ఇందులో పాల్గొన్న హరగోపాల్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని, అదే తరహాలో ఎస్టీ వర్గీకరణ చేస్తే సామాజిక న్యాయం జరుగుతుందన్నారు.
సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికే పరిమితమైందన్నారు. ఎస్టీ వర్గీకరణ చేపట్టాలని, లేని పక్షాన ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. సామాజిక న్యాయం దక్కలేదు కాబట్టే ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. తుడుం దెబ్బ జాతీయ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. గత 50 ఏండ్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో వస్తున్న ఎస్టీ రిజర్వేషన్లలో ఎక్కువగా విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయాల్లో ఎక్కువగా లంబాడీలే లబ్ధి పొందారన్నారు. రిజర్వేషన్ ఫలాలు ఆదిమ తెగలకు దక్కడం లేదన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న భూములను బినామీ పేరుతో లాక్కుంటున్నారని ఆరోపించారు.