
- ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్
ఓయూ, వెలుగు: ప్రముఖ రచయిత్రి అరుంధతీరాయ్, కశ్మీర్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ షేక్ షాకత్ హుస్సేన్‌పై ఢిల్లీ పోలీసులు మోపిన ఉపా కేసును వెంటనే ఎత్తివేయాలని ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. వారిపై కేసు నమోదుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా పర్మిషన్ఇవ్వడాన్ని ఖండిస్తూ బుధవారం ఓయూ ఆర్ట్స్‌కాలేజీలో ‘అరుంధతిరాయ్ పై ఉపా కేసు.. వాస్తవాలు’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఓయూ విద్యార్థులు, పరిశోధక విద్యార్థుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ హరగోపాల్ పాల్గొని మాట్లాడారు. అరుంధతీరాయ్ తన కలం, గళంతో దేశంలోని సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలపై నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతున్న ధీర వనిత అని కొనియాడారు. ఆమె రచనలు 45 దేశాల భాషల్లోకి అనువదించారని చెప్పారు. మన దేశంలో బుకర్ ప్రైజ్ పొందిన మొట్టమొదటి మహిళా రచయిత్రిగా చరిత్ర సృష్టించారని తెలిపారు.
నర్మదా బచావో ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారని, దేశంలో పెరిగిపోతున్న మతోన్మాదాన్ని తన రచనల ద్వారా తీవ్రంగా విమర్శించారని వివరించారు. 14 ఏళ్ల తర్వాత కేసు విచారణకు లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. కార్యక్రమంలో డాక్టర్ కొండా నాగేశ్వర్, విద్యార్థి నాయకులు కోట శ్రీనివాస్, నెల్లి సత్య, డాక్టర్ వంశీధర్, నాగేశ్వరరావు, సతీశ్, వలిగొండ నరసింహ, తాళ్ల అజయ్, రవినాయక్, సుమంత్, శ్రీనివాస్, అజయ్, భగత్, పవన్, అశ్వన్, రమేశ్, కోటి, రుక్సత్ పాషా, వికాస్ తదితరులు పాల్గొన్నారు.