బషీర్ బాగ్, వెలుగు: ప్రభుత్వాలు విద్యకు ప్రాధాన్యం ఇవ్వకపోతే దేశ భవిష్యత్అంధకారం అవుతుందని పౌర హక్కుల నాయకుడు, తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ హరగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో మేధావులు, ప్రజా సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ప్రొ.హరగోపాల్ మాట్లాడుతూ.. రాష్ట్ర బడ్జెట్లో 20 శాతం నిధులు విద్యా రంగానికి కేటాయించాలని కోరారు. పదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్విద్యా రంగాన్ని నాశనం చేశారని విమర్శించారు. విద్యా రంగానికి 15 శాతం బడ్జెట్కేటాయిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందని, ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డిని కలిసినప్పుడు ఆ విషయాన్ని గుర్తిచేశానని తెలిపారు.
కేంద్ర బడ్జెట్ లో విద్యా రంగానికి తీవ్ర అన్యాయం జరిగిందని, గతంలో ఎన్నడూ లేని విధంగా ఉన్నత విద్యపై 60 శాతం తగ్గించారన్నారు. రాష్ట్ర బడ్జెట్లో కనీసం15 శాతమైనా విద్యకు కేటాయించాలని, లేకుంటే ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని హరగోపాల్ హెచ్చరించారు.
