బషీర్ బాగ్, వెలుగు: నిర్బంధాలు పెరిగినప్పుడు ప్రజా ఉద్యమాలు పుట్టుకొస్తాయని పౌరహక్కుల సంఘం నాయకుడు ప్రొఫెసర్ హరగోపాల్ చెప్పారు. పౌరహక్కుల సంఘం 50 వసంతాలు ముగింపు సభలకు సంబంధించిన పోస్టర్‌ను శుక్రవారం ఆయన బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సంఘం హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరగోపాల్మాట్లాడుతూ.. ఈ నెల 9, 10 తేదీల్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.1973లో సంఘం ప్రారంభించినప్పుడు కంటే ఇప్పటి పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, 2024 తర్వాత రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య వ్యవస్థ భవిష్యత్ గందరగోళంలో పడే చాన్స్ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రపంచంలో ఏ సంఘం చేయని త్యాగాలను.. పౌరహక్కుల సంఘం నాయకులు చేశారన్నారు. పౌరహక్కుల ప్రభావం తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా ఉందని చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చామని గుర్తుచేశారు. మాజీ సీఎం కేసీఆర్ఉద్యమ సమయంలో పౌరహక్కుల సంఘంలో చేరుతానని, పౌరహక్కుల కోసం పని చేస్తానని గుర్తుచేశారు. అయితే పదేండ్ల పాలనలో పౌర హక్కుల విధ్వంసం, సంఘం నాయకుల నిర్బంధం, ప్రశ్నించే గొంతుకుల అణిచివేత, ఒకే వ్యక్తి చేతిలో అధికారం, ఊపా చట్టం దుర్వినియోగం వంటివి రాష్ట్రంలో జరిగాయన్నారు. తమ పిలుపు అందుకున్న ప్రజలు ప్రభుత్వాన్ని మార్చారని హరగోపాల్ తెలిపారు.
