
- రాహుల్ గాంధీ సారథ్యంలోనే ఓబీసీలకు స్వేచ్ఛ
- ఆయన మరో మార్టిన్ లూథర్ కింగ్ అంటూ ప్రశంస
న్యూఢిల్లీ, వెలుగు: బీసీలు తలుచుకుంటే బీజేపీ పవర్ కట్ అవుతుందని, ఇక ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి కూడా రాలేదని ప్రొఫెసర్ కంచ ఐలయ్య అన్నారు. శుక్రవారం ఢిల్లీలోని టాల్కటోరా స్టేడియంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన భాగీదారి న్యాయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కంచ ఐలయ్య మాట్లాడుతూ.. ‘‘మహాత్మాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, అంబేద్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి నేతలు మనకు బ్రిటిషర్ల నుంచి విముక్తి కల్పించారు.
ఓబీసీలు, దళితులు, ఆదివాసీలకు స్వేచ్ఛను ఇచ్చారు. కానీ, ఆర్ఎస్‌ఎస్, బీజేపీ ఆ స్వేచ్ఛను హరించాయి. 11 ఏండ్ల బీజేపీ పాలనలో బీసీలు బానిసలుగా మారారు. ప్రధాని మోదీ లాంటి నేతల వల్లే కుల వ్యవస్థ నుంచి ప్రజలు స్వేచ్ఛను పొందలేకపోయారు. అణచివేతకు గురైన కింది స్థాయి కులాల దీనస్థితిని భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ చూశారు. అణగారిన వర్గాలకు న్యాయం చేయాలని నిర్ణయించుకున్నారు. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ మార్గంలోనే ఓబీసీల స్వేచ్ఛ కోసం రాహుల్ పోరాడుతున్నారు. ఆయనతోనే ఓబీసీలకు స్వేచ్ఛ లభిస్తుంది” అని అన్నారు.
రాహుల్‌ది సమ్మిళిత కులం
రాహుల్‌ది సమ్మిళిత కులమని ప్రొఫెసర్ కంచ ఐలయ్య అన్నారు. ‘‘నేను ఇందిరా భవన్‌కు వెళ్లినప్పుడు మహాత్మాగాంధీ, అంబేద్కర్, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫొటోలు చూసి ఆశ్చర్యపోయాను. వీరిలో గాంధీ బనియా సామాజిక వర్గం, అంబేద్కర్ దళితుడు, పటేల్ ఓబీసీ, నెహ్రూ బ్రాహ్మణుడు.. ఇలా రాహుల్ గాంధీ అన్ని వర్గాలకు చెందిన సమ్మిళిత నేత. ప్రజలకు స్వేచ్ఛ కల్పించడం ఆయన వల్లే సాధ్యం.
ఓబీసీలు, దళితులు, ఆదివాసీల కోసం పోరా డుతున్న రాహుల్.. మరో మార్టిన్ లూథర్ కింగ్” అని అభివర్ణించారు. ‘‘నేనో రచయిత.. కాంగ్రెస్ పార్టీ మెంబర్ కాదు. అయినా ఇక నా జీవిత కాలమంతా నా కలం రాహుల్ గాంధీ కోసం రాస్తుంది. దేశ ప్రజల స్వేచ్ఛ కోసం ఆయనతో కలిసి పనిచేస్తాను” అని ఐలయ్య చెప్పారు.
ఒకే ఒక్కడు.. రాహుల్
21వ శతాబ్దంలో అన్ని వర్గాల కోసం పోరాడుతున్న ఒకే ఒక్క లీడర్ రాహుల్ గాంధీ అని ప్రొఫెసర్ కంచ ఐలయ్య ప్రశంసించారు. ‘‘కులవ్యవస్థ నుంచి ప్రజలకు స్వేచ్ఛ కల్పించేందుకు రాహుల్ పోరాడుతున్నారు. ఈ దిశలో ఆయన భారత్ జోడో యాత్రతో తొలి అడుగు వేశారు. భారత్ జోడో న్యాయ యాత్రతో రెండో అడుగు వేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కులగణన చేస్తూ మూడో అడుగు వేశారు. ఇది చరిత్రాత్మకం.
కులగణన రిపోర్టును స్టడీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నియమించిన ఎక్స్‌పర్ట్స్ కమిటీకి నేను వైస్ చైర్మన్. తెలంగాణలో 56 శాతం మంది బీసీలు ఉన్నట్టు ఈ సర్వేలో తేలింది. వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వనుంది. ఈ విషయంలో తెలంగాణ ఓబీసీలు విజయం సాధించారు. అయితే, కేవలం 9.9 శాతంగా ఉన్న ఓసీలు మాత్రం 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పొందుతున్నారు. ఈ వ్యవస్థను రూపుమాపేందుకు రాహుల్ విప్లవాన్ని తెచ్చారు. ఇది ఏ రోజూ బీజేపీ ఆలోచించి ఉండకపోవచ్చు” అని అన్నారు.