
ట్యాంక్ బండ్, వెలుగు: రాష్ట్రంలో ఏర్పడ్డ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమంపై చొరవ చూపాలని తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ కోరింది. సర్వం కోల్పోయిన ఉద్యమకారులను ఆదుకోవాలని వేడుకుంది. గత ప్రభుత్వంలో ఉద్యమకారుల చరిత్ర లేకుండా కేసీఆర్ చేశారని మండిపడింది. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో చైర్మన్ సుల్తాన్ యాదగిరి అధ్యక్షతన శుక్రవారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో ధర్నా చేపట్టారు.
ఈ ధర్నాకు ప్రొఫెసర్ హరగోపాల్, టీజేఎస్ చీఫ్ కోదండరాం, సాంస్కృతిక శాఖ చైర్మన్ వెన్నెల, గద్దర్ కొడుకు సూర్యం, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో ఉద్యమకారుల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరిస్తుందన్న నమ్మకం ఉందన్నారు.
తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన ఎంతోమందిని కేసీఆర్ కనుమరుగు చేశారని విమర్శించారు. వెన్నెల గద్దర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారుల పక్షాన అండగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలపై కాలయాపన చేయొద్దని కోరారు.
కాంగ్రెస్ వల్ల చిగురించిన ఆశలు..
తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షను బీఆర్ఎస్ పట్టించుకోలేదని ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ గోధుమల కుమారస్వామి అన్నారు. గత ప్రభుత్వంలో తెలంగాణ వ్యతిరేక శక్తులు రాష్ట్రాన్ని లూటీ చేశాయని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉద్యమకారుల ఆశలు చిగురించాయని, సీఎం రేవంత్ రెడ్డి తమకు న్యాయం చేస్తారన్న నమ్మకం ఉందని అన్నారు.