ప్రజాస్వామిక తెలంగాణ కోసం..మళ్లీ ఉద్యమం చేయాలే : కోదండరాం

ప్రజాస్వామిక తెలంగాణ కోసం..మళ్లీ ఉద్యమం చేయాలే : కోదండరాం
  • కేసీఆర్​ను గద్దె దించేందుకు ఉద్యమకారులంతా ఏకం కావాలి

కామారెడ్డి/ కామారెడ్డి టౌన్, వెలుగు :  ప్రజాస్వామిక తెలంగాణ వస్తోందని ఆశించామని, కానీ దాని కోసం మళ్లీ ఉద్యమించాల్సిన అవసరం ఏర్పడిందని తెలంగాణ జనసమితి స్టేట్ ప్రెసిడెంట్, ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రోటరీ ఆడిటోరియంలో ‘తెలంగాణ ఉద్యమకారులారా కలిసి మాట్లాడుకుందాం’  పేరిట మీటింగ్ ​నిర్వహించారు. తెలంగాణ జనసమితి స్టేట్​జనరల్ సెక్రెటరీ నిజ్జన రమేశ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ మీటింగ్​లో ప్రొఫెసర్​ కోదండరాం మాట్లాడుతూ.. కేసీఆర్ ను గద్దె దింపేందుకు ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న వాళ్లంతా ఏకం కావాలన్నారు.

ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. ఏ ఒక్కరి పోరాటంతోనో ప్రత్యేక రాష్ట్రం రాలేదని, సకలజనుల భాగస్వామ్యం, విద్యార్థుల ఆత్మబలిదానాలతో తెలంగాణ సిద్ధించిందన్నారు. కేసీఆర్​కామారెడ్డిలో పోటీచేస్తున్నందున ఇక్కడి ప్రజలకు ఆయన్ని ప్రశ్నించే అవకాశం వచ్చిందన్నారు.ప్రజాస్వామిక తెలంగాణ సాధించడమే లక్ష్యం కావాలన్నారు. గతంలో తెలంగాణ ఉద్యమానికి కామారెడ్డి ఊపిరి పోసిందని, ఇప్పుడు అదే కామారెడ్డి నుంచి ఉద్యమం మొదలుకావాలన్నారు.

గజ్వేల్​ను వదిలి కామారెడ్డిలో పోటీ చేయాల్సిన అవసరం కేసీఆర్​కు ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. అందరం కలిసి ఒకే అభ్యర్థిని నిలబెట్టి  కేసీఆర్​ని ఓడిద్దామన్నారు. నీళ్లు, నిధులు, నియమకాల కోసం కేసీఆర్​ను మరో సారి నిలదీయాలన్నారు.  గ్రామాల్లో కమిటీలు వేసి ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరముందన్నారు. రైతు స్వరాజ్య వేదిక కన్వీనర్​ కన్నెగంటి రవి, కామారెడ్డి జేఏసీ చైర్మన్​ జగన్నాథం, ప్రతినిధులు వీఎల్​నర్సింహారెడ్డి, సిద్ధిరాములు, వేణుగోపాల్, లక్ష్మణ్​ యాదవ్​ తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్​కు గుణపాఠం చెప్పాలి..షబ్బీర్​అలీ, మాజీ మంత్రి

కామారెడ్డి ఉద్యమాల గడ్డ అని, అలాంటి గడ్డమీదకు మాయలు చేసే కేసీఆర్​వస్తున్నారని మాజీ మంత్రి షబ్బీర్​అలీ విమర్శించారు. ఉద్యమ స్ఫూర్తితో ఇక్కడి ప్రజలకు కేసీఆర్​కు గుణపాఠం చెప్పాల్సిన అవకాశం వచ్చిందన్నారు. తెలంగాణ ఉద్యమకారులు రోడ్ల మీద ఉంటే, ద్రోహులు మంత్రివర్గంలో ఉన్నారన్నారు.  

సమావేశంలో తీర్మానాలు..

తెలంగాణ ఉద్యమకారులారా కలిసి మాట్లాడుకుందాం పేరుతో నిర్వహించిన మీటింగ్​లో పలు తీర్మానాలు చేశారు. అవి కేసీఆర్​పై పార్టీలకతీతంగా ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టడం, కొత్తగా ఏర్పాటు చేసే మెడికల్ కాలేజీకి సొంత బిల్డింగ్​ నిర్మాణం, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ప్యాకేజీ 21, 22 పనుల త్వరితగతిన పూర్తి, కామారెడ్డిని ఎడ్యుకేషన్ హబ్ గా మారుస్తామని ఇచ్చిన హామీ మేరకు ఇంజనీరింగ్, బీఎడ్, మహిళా డిగ్రీ కాలేజీ, ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీల ఏర్పాటు, కాంట్రాక్ట్, ఔట్​సోర్సింగ్ టీచర్​ పోస్టులను రెగ్యులరైజ్ చేయడం, నల్లబెల్లంపై ఆంక్షల ఎత్తివేత, ఉద్యమకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు.