- మహిళా, శిశు సంక్షేమ శాఖ సెక్రటరీకి ప్రొఫెసర్ కోదండరాం వినతి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పోషణ్ అభియాన్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం సెక్రటేరియెట్‌లో మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అనితా రామచంద్రన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
పోషణ్ అభియాన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు పొనుగోటి సంపత్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. కాంట్రాక్ట్ రెన్యువల్‌ను సకాలంలో చేపట్టి ఉద్యోగ భద్రత కల్పించాలని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా జీతభత్యాలను పెంచాలని కోరారు.
సిబ్బందికి హెల్త్ ఇన్సూరెన్స్, మహిళా ఉద్యోగులకు మెటర్నిటీ సెలవులు మంజూరు చేయాలన్నారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడారు. పోషణ్ అభియాన్ అమలులో తెలంగాణ.. దేశంలోనే అగ్రస్థానంలో నిలవడానికి సిబ్బంది కృషే కారణమని కొనియాడారు. లబ్ధిదారులకు నాణ్యమైన సేవలు అందిస్తున్న ఉద్యోగులపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. వినతిపై ముఖ్య కార్యదర్శి అనితా రామచంద్రన్ సానుకూలంగా స్పందించారు. త్వరలోనే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో అసోసియేషన్ నాయకులు సతీశ్, శైలజ, సరిత తదితరులు పాల్గొన్నారు.
