రాష్ట్రంలో అన్నీ అద్భుతమే

రాష్ట్రంలో అన్నీ  అద్భుతమే
  • రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతి 
  • సాధిస్తున్నది: అసెంబ్లీలో సీఎం కేసీఆర్​
  • మన నుంచి వలసలు తగ్గినయ్​.. 
  • వేరే రాష్ట్రాల వాళ్లే వలసొస్తున్నరు
  • అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలిచ్చినం
  • ప్రపంచం నివ్వెరపోయేలా యాదాద్రి 
  • కడ్తున్నం.. త్వరలో రీ ఓపెన్​ చేస్తం
  • సొంత జాగలో ఇల్లు కట్టుకుంటే డబ్బులిస్తం
  • కౌలు రైతుల విషయాన్ని పట్టించుకోం 
  • కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్‌‌ వాయిదాకు ప్రధాని వద్దకు అఖిలపక్షంతో పోతమని వెల్లడి
  • ముగిసిన అసెంబ్లీ సమావేశాలు

దేశాన్ని సాకే ఆరేడు రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగో ప్లేస్​లో ఉంది. ఫసల్‌ బీమా పథకం బోగస్‌. అది శాస్త్రీయంగా లేదు. మేం బాగా పనిచేస్తున్నం కాబట్టే అన్ని ఎన్నికల్లో జనం ఓట్లేసి గెలిపిస్తున్నరు. రాష్ట్రంలో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్నయ్. బోనాలను ఎవరైనా పట్టించుకున్నరా? ఇప్పుడు బోనాలు వస్తే మా మంత్రులే ముందుంటున్నరు. మేం మంచి కార్యక్రమాలు చేస్తుంటే.. మీ జేబులకెళ్లి ఇస్తున్నరా అని కొందరు చీప్​గా మాట్లాడుతున్నరు. దసరా తర్వాత రెసిడెన్షియల్‌ స్కూళ్లు తెరుస్తం.                                                                             ‑ అసెంబ్లీలో సీఎం కేసీఆర్


హైదరాబాద్‌‌, వెలుగు : అన్ని రంగాల్లో రాష్ట్రం ముందుకు పోతున్నదని, అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నదని సీఎం కేసీఆర్​ అన్నారు. ‘‘తెలంగాణలో అప్పిచ్చేవాడున్నడు. అద్భుతమైన వైద్యం ఉంది. అద్భుతమైన నీళ్లున్నయ్​. అద్భుతమైన కరెంట్​ ఉంది. అద్భుతంగా ఉపాధి ఉంది. అందుకే ఇక్కడికి అందరు వస్తున్నరు” అని తెలిపారు. ఒకప్పుడు వలసలు పోయే మహబూబ్​నగర్​ జిల్లాలో.. ఇప్పుడు వేరే వాళ్లు వచ్చి కూలీ చేసుకునే పరిస్థితి వచ్చిందని, ఇందుకు తాను చాలా సంతోషంగా ఉన్నానని ఆయన చెప్పారు. ఏ తెలంగాణ కావాలనుకున్నామో ఆ తెలంగాణ అయిందని పేర్కొన్నారు. ఏ రాష్ట్రంలో లేని సంక్షేమం ఇక్కడ జరుగుతున్నదన్నారు. శుక్రవారం సంక్షేమంపై అసెంబ్లీలో జరిగిన షార్ట్‌‌ డిస్కషన్‌‌కు సీఎం సమాధానమిచ్చారు. క్వశ్చన్‌‌ అవర్‌‌లో ఫసల్‌‌ బీమా, కౌలు రైతుల ఇబ్బందులపై మాట్లాడారు.  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా, శిశు సంక్షేమానికి తమ 
ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. 


ఏడేండ్లలో వీరి సంక్షేమానికి రూ. 74,165 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. పదేండ్ల కాంగ్రెస్‌‌‌‌ పాలనలో ఆయా వర్గాల వెల్ఫేర్‌‌‌‌కు కేవలం రూ. 21,663 కోట్లు ఖర్చు చేశారన్నారు. దేశాన్ని సాకే ఆరేడు రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగో ప్లేస్​లో ఉందని కేసీఆర్​ అన్నారు. 
మేం బాగా పనిచేస్తున్నం కాబట్టే గెలిపిస్తున్నరు
తాము బాగా పనిచేస్తున్నాం కాబట్టే అన్ని ఎన్నికల్లోనూ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తున్నారని కేసీఆర్​ చెప్పారు. 2014లో సాధారణ మెజార్టీతో గెలిచిన తమకు 2018లో ప్రజలు 88 సీట్లిచ్చారని అన్నారు. ‘‘బోనాలను ఎవరైనా పట్టించుకున్నరా..? ఇప్పుడు బోనాలు వస్తే మా మంత్రులే ముందుంటున్నరు” అని చెప్పారు. తాము ఏ కులాన్నీ విస్మరించలేదని.. అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాల కోసం రూ.వేల కోట్ల విలువైన భూములు ఇచ్చామన్నారు. రూ.80 కోట్లతో ప్రభుత్వమే ఆత్మగౌరవ భవనాలు నిర్మించనుందని చెప్పారు. ‘‘రాష్ట్రంలో జరిగే మంచిని మంచి అందాం.. మంచి పనిచేసినా మీ జేబులకెల్లి ఇస్తున్నరా అని కొందరు చీప్​గా మాట్లాడుతున్నరు. ఏ రాష్ట్రంలో లేన్నట్టుగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలైతున్నయ్​. నీటి యుద్ధాలు జరిగే సమయంలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును మూడేండ్లలో కట్టి చూపించినం’’ అని అన్నారు. మన దగ్గర నుంచి వలసలు తగ్గాయని, ఇతర రాష్ట్రాల నుంచే ఇక్కడికి వలస వచ్చి పనులు చేసుకుంటున్నారని తెలిపారు. 
కేంద్రం కన్నా రాష్ట్ర తలసరి ఆదాయం డబుల్​
‘‘మీకు వ్యవసాయం రాదు.. తెలివి లేదు..’’ అన్న ఏపీ తలసరి ఆదాయం రూ.1,70,215 అయితే, తెలంగాణ తలసరి ఆదాయం రూ.2,37,633గా ఉందని సీఎం చెప్పారు.  కేంద్రం తలసరి ఆదాయం రూ.1,28,829 మాత్రమేనని, కేంద్రంతో పోల్చితే రాష్ట్ర తలసరి ఆదాయం డబుల్​ ఉందని పేర్కొన్నారు. సెంట్రల్లీ స్పాన్సర్డ్‌‌‌‌ స్కీములకు, హక్కుగా వచ్చే పన్నుల్లో వాటా తప్ప కేంద్రం నుంచి నయా పైసా రావడం లేదన్నారు. ఏడేండ్లలో తెలంగాణ నుంచి కేంద్రానికి రూ.2.74 లక్షల కోట్ల ఆదాయం సమకూరిందని, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీంలకు ఇప్పటి వరకు రూ.42 వేల కోట్లు, ఏటా పన్నుల్లో వాటాగా రూ. 24 వేల కోట్లు మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. దేశాన్ని సాకేది, జీడీపీ అధిక ఆదాయం ఇచ్చేది ఆరేడు రాష్ట్రాలేనని, అందులో తెలంగాణ నాలుగో ప్లేస్‌‌‌‌లో ఉందన్నారు.  ప్రపంచమే నివ్వెరపోయేలా యాదాద్రి ఆలయ నిర్మాణం జరుగుతున్నదని సీఎం అన్నారు. నవంబర్‌‌‌‌ చివరి వారంలోగానీ, డిసెంబర్‌‌‌‌ మొదటి వారంలోగానీ భారీ సుదర్శన యాగం నిర్వహించి యాదాద్రి ఆలయాన్ని రీ ఓపెన్​ చేస్తామని చెప్పారు.  మన నీళ్లపై కేంద్రం కంట్రోల్‌‌‌‌ చేయడం సరికాదని, ఏపీ తరచూ పంచాయితీ పెట్టడంతోనే కేంద్రం నోటిఫికేషన్‌‌‌‌ ఇచ్చిందని సీఎం తెలిపారు. కేఆర్‌‌‌‌ఎంబీ, జీఆర్‌‌‌‌ఎంబీ గెజిట్‌‌‌‌ నోటిఫికేషన్‌‌‌‌ అమలు వాయిదా వేయాలని ప్రధాని,కేంద్ర హోం మంత్రి, జలశక్తి శాఖ మంత్రికి సూచించానని, వాళ్లు సానుకూలంగా స్పందించారని తెలిపారు. గెజిట్‌‌‌‌పై ప్రధాని దగ్గరికి ఆల్‌‌‌‌పార్టీ డెలిగేషన్​ను  తీసుకెళ్తామన్నారు. 
కాంగ్రెస్‌‌‌‌కు మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ స్కిల్‌‌‌‌ లేదు
కాంగ్రెస్‌‌‌‌కు మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ స్కిల్స్‌‌‌‌ లేవని, ఆ పార్టీ పాలనలో అసెంబ్లీలోనే కరెంట్‌‌‌‌ ఉండకపోయేదని కేసీఆర్​ అన్నారు. ‘‘రోశయ్య విద్యుత్‌‌‌‌ మంత్రిగా ఉన్నప్పుడు రెండేండ్లలో కరెంట్‌‌‌‌ వ్యవస్థను సరి చేయకపోతే అసెంబ్లీలోనే ఉరేసుకుంటా అన్నారు. ఒకరోజు బ్రీఫ్‌‌‌‌ కేస్‌‌‌‌లో ఉరితాడు తెచ్చుకుంటే మేమంతా వారించినం” అని ఆయన అన్నారు. ఇప్పటికే 12 మెడికల్‌‌‌‌ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి జిల్లాకు ఒక మెడికల్‌‌‌‌ కాలేజీ వస్తుందన్నారు. ఏడాదిలో వక్ఫ్‌‌‌‌ భూములపై సీబీసీఐడీ విచారణ పూర్తి చేయిస్తామన్నారు. 
దసరా తర్వాత రెసిడెన్షియల్​ స్కూళ్లు ఓపెన్​
దసరా తర్వాత రెసిడెన్షియల్‌‌‌‌ స్కూళ్లు తెరుస్తామని  సీఎం వెల్లడించారు. హాస్పిటళ్లలో అటెండెంట్లకు షెల్టర్స్‌‌‌‌ నిర్మిస్తామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రెసిడెన్షియల్‌‌‌‌ స్కూళ్లు బేకార్‌‌‌‌గా ఉండేవన్నారు. దళితులకు ఇచ్చిన అసైన్డ్‌‌‌‌ భూములు తప్పనిసరి అయితే తప్ప తీసుకోవద్దని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. సొంత జాగాల్లో డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టుకునేందుకు డబ్బులు ఇస్తామని చెప్పారు. ఇందుకోసం ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి, 1,500 ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. 
స్టోరేజీలు పెంచాల్సిన బాధ్యత కేంద్రానిదే.. 
‘‘దేశవ్యాప్తంగా వడ్లు, గోధుమలు పండిస్తున్నరు. స్టాక్‌‌‌‌ ఎక్కువైందని కొనం అంటే పండించిన రైతు ఏం కావాలి?  ప్రకృతి విపత్తులకు పంటలు దెబ్బతింటే బ్యాలెన్స్‌‌‌‌ చేయడానికి కేంద్ర ప్రభుత్వానికే బాధ్యత ఉంటుంది” అని సీఎం చెప్పారు. ఆహార ధాన్యాల కొరత రాకుండా బఫర్‌‌‌‌ స్టాక్‌‌‌‌ పెట్టుకోవాలన్నారు. యూనిఫామ్‌‌‌‌గా దేశమంతా ఒకేసారి 70 శాతం కరువు వస్తే విపత్కర పరిస్థితుల్లో ఆహార కొరత తీర్చుకోవడానికి స్టోరేజీలు నిర్మించాలని అన్నారు. 
బీసీ జనాభా లెక్కల తీర్మానానికి ఆమోదం
కులాల వారీగా బీసీ జనాభా లెక్కల కోసం చేసిన తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. వచ్చే జనాభా లెక్కల్లో ఈ లెక్కలూ  చేపట్టాలంటూ సీఎం కేసీఆర్‌‌‌‌ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు.  

ఫీల్డ్‌‌‌‌ అసిస్టెంట్లను తీసెయ్యలే.. వాళ్లే పోయిన్రు
ఉపాధి హామీ ఫీల్డ్‌‌‌‌ అసిస్టెంట్లను ప్రభుత్వం తొలగించలేదని సీఎం చెప్పారు. ‘‘ఫీల్డ్‌‌‌‌ అసిస్టెంట్లు పంచాయతీరాజ్‌‌‌‌ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా తయారైన్రు. ఉపాధి నిధులు ఖర్చు చేయడం పంచాయతీల హక్కు.. ఫీల్డ్‌‌‌‌ అసిస్టెంట్లను తొలగించిన తర్వాతే బాగా పనులు జరుగుతున్నయ్​.. ఆస్తులు క్రియేట్‌‌‌‌ అవుతున్నయ్‌‌‌‌..వాళ్లు ఉద్యోగులు కాదు.. ఎవరి మాటలో పట్టుకొని సమ్మెకు పోయిన్రు. వాళ్లను ఎవ్వలూ తీసెయ్యలే.. వాళ్లకు వాళ్లే వెళ్లిపోయిన్రు’’ అని ఆయన అన్నారు. ఫీల్డ్​ అసిస్టెంట్లను తిరిగి తీసుకునేందుకున్న అవకాశాలను పరిశీలిస్తామన్నారు. 


కౌలు  రైతులను పట్టించుకోం
కౌలు రైతుల విషయాన్ని పట్టించుకోబోమని కేసీఆర్‌‌‌‌ మరోసారి  తేల్చి చెప్పారు. ఏమైనా సమస్యలుంటే రైతులు.. కౌలు రైతులు చూసుకోవాలన్నారు. పంట నష్టపోయినోళ్లలో కౌలు రైతులు ఉంటే.. మానవతా దృక్పథంతో వారిని కూడా ఆదుకునేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ములుగు ఎమ్మెల్యే అనసూయ చెప్పిన మాటల్లో వాస్తవం ఉందని, వరద నీరు, బ్యాక్‌‌‌‌వాటర్​తో చాలా పంటలు మునిగాయని చెప్పారు. లాస్ట్‌‌‌‌ ఇయర్‌‌‌‌ వర్షాలతో  హైదరాబాద్​ను వరదలు ముంచెత్తాయని, జల్‌‌‌‌పల్లిలో పంటలు మునిగినయని అన్నారు. పోడు భూములపై ఈనెల మూడోవారంలో  గ్రామ కమిటీలు వేసి పోడు రైతులను గుర్తించి పట్టాలు ఇచ్చుకుందామని చెప్పారు. 

ఫసల్‌‌‌‌ బీమా బోగస్‌‌‌‌
దేశంలో ఫసల్‌‌‌‌ బీమా అంతా బోగస్‌‌‌‌ అని,  అదేమాత్రం శాస్త్రీయంగా లేదని  సీఎం కేసీఆర్‌‌‌‌ విమర్శించారు. ఫసల్‌‌‌‌ బీమాతో రైతులకు లాభం జరగడం లేదన్నారు.  రైతులు బ్యాంకులకు అప్పులకు కోసం పోతే వారి ప్రమేయం లేకుండానే ప్రీమియం కట్‌‌‌‌ చేసే పరిస్థితి ఉండేదని చెప్పారు. ప్రీమియం కట్టినా కాలుకు పెడితే మెడకు మెడకు పెడితే కాలుకు అన్నట్లు అన్ని తాకట్లు పెడ్తారని, మండలం, గ్రామంలో మొత్తం పంట మునిగితేనే పరిహారం ఇస్తమంటరని తెలిపారు. కేంద్రమే ఫసల్‌‌‌‌ బీమా తప్పనిసరి అనేది తీసేసిందని, ఇష్టముంటేనే అమలు చేసుకోవచ్చని చెప్పిందని అన్నారు.