మోండా మార్కెట్​ బంగారం చోరీ కేసులో పురోగతి

మోండా మార్కెట్​ బంగారం చోరీ కేసులో పురోగతి
  • దోపిడీకి పాల్పడిందిథానే గ్యాంగ్!   
  • ముంబైకి చేరుకున్నపోలీసు బృందాలు

సికింద్రాబాద్, వెలుగు: సికింద్రాబాద్ మొండా మార్కెట్ పాన్ బజార్​లోని బంగారు నగల మెల్టింగ్ షాప్​లో జరిగిన చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ చోరీకి పాల్పడింది మహారాష్ట్రలోని థానేకు చెందిన గ్యాంగ్ గా ముంబై పోలీసులు నిర్ధారించడంతో స్థానిక పోలీసు బృందాలు ముంబైకి బయళ్దేరి వెళ్లాయి. పోలీసుల వివరాల ప్రకారం.. ముంబై నుంచి ఎనిమిది మంది సభ్యుల ముఠా ఈ నెల 24న సిటీకి వచ్చి ప్యాట్నీ సెంటర్​లోని ఢిల్లీ లాడ్జ్ లో బసచేశారు. పాన్​బజార్​లోని ఆ నగల మెల్టింగ్ షాపునకు వెళ్లి మూడ్రోజుల పాటు రెక్కీ నిర్వహించారు. షాప్​లో యజమాని లేడని నిర్ధారించుకున్నారు.

దీంతో శనివారం ఆ గ్యాంగ్​లోని ఆరుగురు సభ్యులు ఐటీ అధికారులమంటూ షాప్ లోపలికి ప్రవేశించారు. మిగతా ఇద్దరు షాపు ముందు కాపలా ఉన్నారు. సోదాల పేరు చెప్పి సరైన డాక్యుమెంట్లు లేవంటూ 1700 గ్రాముల బంగారు బిస్కెట్లు తీసుకొని బయటకువచ్చి అంతా కలిసి ఆటోలో కూకట్​పల్లికి పారిపోయారు. అక్కడ నుంచి వారంతా బస్సులో ముంబైకి వెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ దోపిడీ విధానాన్ని స్థానిక పోలీసులు ముంబై పోలీసులకు వివరించగా.. ఇది థానే గ్యాంగ్ పనిగా వారు నిర్ధారించారు. దీంతో పోలీసు బృందాలు ముంబైకి వెళ్లి నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు సమాచారం.