
‘తెలంగాణ ప్రభుత్వం కోసం సమగ్ర సాంస్కృతిక విధానం గురించి’ నర్సింగరావు తెలంగాణ ముఖ్యమంత్రి ముందుంచుతున్న తన ప్రతిపాదనకు ప్రవేశికలో తానే చెప్పినట్లు సంస్కృతి ఏ మార్పులూ లేని స్థిరమైన సంప్రదాయాల ఉనికి కానేరదు. అదే వరసలో, నర్సింగరావు అభిప్రాయంలో ఏదేని సంస్కృతికి అంతర్భాగం, ప్రతిరూపమైన ఏ కళైనా దాని రూపు మార్చుకోకుండా జడమైన స్థితిలో ఉండదు. కాలానుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు చెందుతూ ఉంటుంది.
పాతరాతి యుగం ఆదిగా ప్రబలి తెలంగాణ సంస్కృతికి వారసత్వంగా వేళ్ళూనుకున్న సారస్వత, సంగీత, చిత్ర, శిల్ప, ఇత్యాది కళలకు కొనసాగింపుగా ఆవిష్కృతమైన గ్రాఫిక్ ఆర్ట్స్, చలనచిత్ర కళల నేపథ్యంలో తెలంగాణ చరిత్రను, ఆ చరిత్రను పరిపుష్టం చేసిన సృజన సంపదను ఒక చిన్న గుళికలో కళ్ళకు కట్టినట్లు చూపించారు నర్సింగరావు.
ఈ ప్రతిపాదనలో ‘తెలంగాణ నేల వేరువేరు కాలాలలో వివిధ రకాల కళలను, కళాకారులను చిగురించిన మహా సారస్వత, కళా వటవృక్షం’ అని విశదపరచినారు. అవగాహనా సౌలభ్యం కోసం కళలను రెండు రకాలుగా వర్గీకరిస్తూ... చిత్రకళ, శిల్పకళ, ఛాయాచిత్రకళ మొదలైన వాటిని దృశ్య కళలుగా, సంగీతం, నృత్యం, నాట్యం మొదలైన కళలను ప్రదర్శన కళలుగా వర్గీకరించారు. ఈ రెండింటి మేళవింపుగా ఇరవయ్యవ శతాబ్దిలో రూపొందిన ఆధునిక కళారూపాన్ని సినిమాకళగా అభివర్ణించారు.
తెలంగాణ కళలను వెలుగులోకి తేవాలి
తాము కాళ్ళూనక మునుపు నాగరికత లేదని, నాగరికత ఇత్యాదులు తమరాకతోనే మనం నేర్చుకున్నామని ఆంగ్లేయులు యావద్భారతావనిని నమ్మించినట్లే తెలంగాణకు సారస్వత, సంగీత, శిల్ప, చిత్ర, ఇత్యాది కళల సంస్కృతి లేదని, మన ఘనమైన వారసత్వానికి మనల్నే అపరిచితుల్ని చేస్తూ వచ్చిన వ్యాపార వలస విధానాలకు, స్వార్థపర కుటిల మనస్తత్వాలకు సురవరం ప్రతాపరెడ్డి మొదలుకొని.. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మీదుగా నేటిదాక ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి.
మరుగునపడిన, మరుగుపరచిన తెలంగాణ నాగరిక, సాంస్కృతిక, శిల్ప, చిత్ర, సారస్వతాది తెలంగాణ తరతరాల కళల వైశిష్ట్యాన్ని ఈ తరుణంలో శిథిలాల నుంచి వెలుగులోకి తేవలసిన ఆవశ్యకత ఉంది. అందుకోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టవలసిన వివిధ కార్యక్రమాలను కేవలం సైద్ధాంతిక సూచనప్రాయంగా ప్రకటించడం కాకుండా నర్సింగరావు సహేతుకమైన దిశానిర్దేశం చేసున్నారు. ఈ ప్రతిపాదనలోనే ప్రస్తావిస్తున్న జాతీయ సాంస్కృతిక విధానాల రూపకల్పనలో, వాటిని అమలుచేయు విధానాలలోని వెనుకబాటుతనం అటుంచి, నవ తెలంగాణ సందర్భంలో పునరుజ్జీవింపజేయవలసిన సాంస్కృతిక విధానాలు, అందుకోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టవలసిన కార్యాచరణల ఆవశ్యకత ప్రధాన లక్ష్యంగా నర్సింగరావు చేసున్న ప్రతిపాదనలు సమర్థనీయం. నర్సింగరావు అభినందనీయ ప్రతిపాదన ఒక సూచన మాత్రమే కాదు. వెన్నుతట్టి మేల్కొలుపుతున్న సౌహార్ద హెచ్చరిక.
కళలపై ప్రభుత్వం దృష్టి సారించాలి
యుగయుగాల వారసత్వ చరిత్రను వీపున మోసుకొస్తున్న సాంస్కృతిక కళలు కేవలం కళల కోసమే కాదు. అవి సామాజిక, ఆర్థిక, రాజకీయ విధానాలను ప్రతిబింబించగల దర్పణాలు. సామాజిక, ఆర్థిక, రాజకీయ విధానాలపైన బలమైన ముద్ర వేసి పరిపాలనా విధానాలను ప్రభావితం చేయడమే కాకుండా, పరిపాలనాధీశుల పది కాలాల అధికార మనుగడకు దిశానిర్దేశం, మార్గదర్శకం చేసే ఉత్థాన ప్రేరకాలు ఈ వారసత్వ కళలు.
నిన్నమొన్నటి తెలంగాణ సాధన ఉద్యమం, ఆ పైన చేజిక్కించుకున్న ప్రభుత్వాధికారపు రాకపోక దాకా ఇది చారిత్రక సత్యం. అందుకే ప్రభుత్వాలు, ప్రత్యేకించి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం సాంస్కృతిక రంగంపైన, అంటే సారస్వత, చిత్ర, శిల్ప, చలనచిత్ర మొదలైన కళలపైన ప్రత్యేక దృష్టి సారించాలని అంటున్న నర్సింగరావు ప్రతిపాదన ముదావహం. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన సముపార్జనల కోసం వెచ్చిస్తున్న ప్రాధాన్యతల ఆర్భాటాల పరుగులో ఆధునిక సమాజం మానవీయ అంశాల స్పృహకు దూరం కావడం నేటి సమాజ సమస్త రుగ్మతలకు కారణం.
కళలను పాఠ్యాంశాలుగా చేర్చాలి
నర్సింగరావు చేస్తున్న ఈ ప్రతిపాదనలోని ఆరంభంలో ‘సమగ్ర సాంస్కృతిక విధానం’, ‘తెలంగాణ - సాంస్కృతిక వారసత్వం’ అనే శీర్షికల పేరిట పొందుపరచిన పీఠికలను సమన్వయపరచి తెలంగాణలోని అన్ని స్థాయిల విద్యాబోధనల్లో పాఠ్యాంశంగా ప్రవేశపెట్టవలసిన సముచిత ఆవశ్యకతను భావిస్తున్నాను. సంస్కారం మనిషి నడవడికలో అడుగడుగునా ప్రతిఫలించాలి.
అది కేవలం శాస్త్ర, సాంకేతిక అధ్యయనాల వల్ల సాధ్యపడదు. మన పురాణాల్లోని భస్మాసుర హస్తంలాగ ఇప్పటికే మనిషి అవసరాలకు మించిన దశకు, అమాంతం మనిషినే మింగేసే దశకు చేరుకున్నది శాస్త్రీయాభివృద్ధి. ఈ శాస్త్రీయాభివృద్ది వేగానికి కొంతైనా అడ్డుకట్ట వేసి యువత నడవడికలో, హృదయ సంస్కారంలో ఒక పరివర్తనని, ఒక పరిణామాన్ని, ఒక పరిణతిని పెంపొందించే శిక్షణ అలవరచాలి.
అందుకోసం, నేటి మనిషి ప్రగతితో అవినాభావమైన శాస్త్ర, సాంకేతిక విద్యతోపాటు దానికి సమాంతరంగా, అవసరమైతే ఒకింత మొగ్గు తూగేటట్లుగానే సాహిత్య, తత్వశాస్త్రాలతోపాటు తమదైన సంస్కృతిని మనిషి ఎదుగుదలలో అంతర్భాగంగా జీర్ణింపజేసే అన్ని కళలనూ విద్యా బోధన అన్ని దశల్లోనూ తప్పనిసరి పాఠ్యాంశాలుగా చేర్చాలి. ఎంతశాస్త్రం చదివినావు. ఎన్ని గ్రంథాలు, ఎన్ని శ్లోకాలు, ఎన్ని పద్యాలు వల్లెవేయగలవు. అది కాదు చదువులకర్థం. చదివిన చదువుల వల్ల ఎంత సంస్కారం అబ్బినదనేది విద్యలకు అర్థం. పరమార్థం.
మానవ వికాసానికి కళలు దోహదపడాలి
శాస్త్రీయ, సాంకేతిక రంగాల్లో ఇంత అభివృద్ధి సాధించినా నేటి ప్రపంచ దేశాలు తీవ్రమైన అశాంతిలో, అభద్రతలో
కొట్టుమిట్టాడుతున్నాయి. ఒకవైపు శాస్త్ర సాంకేతిక ప్రగతికి, మరోవైపు మానవీయ సామాజిక శాస్త్రాలైన తత్వశాస్త్రానికి, మత ప్రబోధనలకి, సారస్వతానికి మధ్యన అదృశ్యమౌతున్న సమతుల్యం అందుకు కారణం అంటాడు రాధాక్రిష్ణన్.
అదే అభద్రత, అశాంతి ఆధునిక మానవుడి నిత్య జీవితంలో అనివార్యంగా ప్రతిఫలిస్తున్నది. మనిషి అంతిమ గమ్యమైన అసలు సృజనలను తోసిరాజని భౌతిక ప్రగతి సాధనలవైపు తీస్తున్న పరుగులు భూమ్మీద మనుగడకే ప్రమాదంగా పరిణమిస్తున్నవి. మృగ్యమౌతున్న ఈ సమతుల్యాన్ని సాధించడం ఎట్లా అనేది ఈ తరం ముందున్న ప్రశ్న. కళలు ఒక జాతి సంస్కృతి పరిణామానికే కాదు. మనిషి వ్యక్తిగత సంస్కార వికాసానికి కూడా దోహదపడాలి. అద్దం పట్టాలి.
-బైరెడ్డి కృష్ణారెడ్డి